నేడు బీజేపీ కొత్త టీమ్ ప్రకటన.. జాతీయ కార్యవర్గంపై ఉత్కంఠ | BJP Set To Announce New National Team, Key Changes Expected Ahead Of Upcoming State Polls, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

నేడు బీజేపీ కొత్త టీమ్ ప్రకటన.. జాతీయ కార్యవర్గంపై ఉత్కంఠ

Aug 17 2026 9:01 AM | Updated on Aug 17 2026 9:22 AM

BJP Set to Announce New Team Today Suspense Over National Executive

సాక్షి, ఢిల్లీ: బీజేపీలో కొత్త జాతీయ కార్యవర్గం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. నేడు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్త టీమ్‌ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. జాతీయ పదాధికారులతో పాటు కీలకమైన పార్టీ కమిటీలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. కొత్త కార్యవర్గంలో యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పలువురు కేంద్ర మంత్రులకు కూడా చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వచ్చే లోక్‌సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధిష్టానం కొత్త టీమ్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో పార్లమెంటరీ బోర్డు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, మార్గదర్శక మండలి వంటి కీలక సంస్థల్లో కూడా మార్పులు, కొత్త నియామకాలు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, మణిపూర్, హిమాచల్‌ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ సమీకరణాలు, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, యువతకు అవకాశం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త టీమ్‌కు తుది రూపు ఇచ్చినట్లు సమాచారం.

నెల రోజులుగా కసరత్తు..
జాతీయ కార్యవర్గం ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, పార్టీ సంస్థాగత వ్యవహారాల కీలక నేత బీఎల్ సంతోష్ నెల రోజుల క్రితమే కసరత్తు ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, బీజేపీ కార్యక్రమాలు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం నేపథ్యంలో కొత్త కార్యవర్గం ప్రకటన కొంత ఆలస్యమైనట్లు తెలుస్తోంది.

కేంద్ర కేబినెట్‌లో మార్పులు?
బీజేపీ జాతీయ కార్యవర్గం ప్రకటన తర్వాత కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన కూడా జరిగే అవకాశం ఉందనే చర్చ ఢిల్లీ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కొత్త పార్టీ టీమ్, కేంద్ర కేబినెట్‌లో మార్పులు.. రాబోయే ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఉండవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే కొత్త కార్యవర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుంది? కీలక పదవుల్లో ఎలాంటి మార్పులు ఉంటాయి? కేంద్ర మంత్రుల్లో ఎవరికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు? అన్నదానిపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement