పాక్ స్వాతంత్ర్య వేడుకల్లో భారత దేశభక్తి పాట.. రఫ్ఫాడిస్తున్న నెటిజన్లు! | Pakistani Actresses Trolled for Using Indian Patriotic Song on Independence Day | Sakshi
Sakshi News home page

పాక్ స్వాతంత్ర్య వేడుకల్లో భారత దేశభక్తి పాట.. రఫ్ఫాడిస్తున్న నెటిజన్లు!

Aug 17 2026 11:34 AM | Updated on Aug 17 2026 11:46 AM

Pakistani Actresses Trolled for Using Indian Patriotic Song on Independence Day

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆ దేశ నటీమణులు చేసిన ఒక పొరపాటు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆగస్టు 14న పాకిస్థాన్ యౌమ్-ఏ-ఆజాదీ (స్వాతంత్ర్య దినోత్సవం) వేడుకలను పురస్కరించుకుని కొందరు పాకిస్థానీ ప్రముఖులు, నటీమణులు ఒక వీడియోను షేర్‌ చేశారు. అయితే, ఆ వీడియోలో వారు తమ దేశ జెండాలతో సంబరాలు చేసుకుంటూ, బ్యాక్‌గ్రౌండ్‌లో భారతీయ దేశభక్తి గీతాన్ని ఉపయోగించడం చర్చనీయాంశమైంది.

బాలీవుడ్ నటి ఆలియా భట్ నటించిన ‘రాజీ’ చిత్రంలోని దేశభక్తి గీతం ‘ఏ వతన్... వతన్ మేరే... ఆబాద్ రహే తూ...’ పాటను ఈ వేడుకల కోసం ఎంచుకోవడం విశేషం. పాకిస్థాన్ స్వాతంత్ర వేడుకల్లో భారత దేశానికి చెందిన పాటను ప్లే చేయడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సెలబ్రిటీలుగా ఉండి ఇలాంటి బాధ్యతారహిత్యమైన పని చేయడంపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. ఈ ఘటనపై పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ డ్రేజ్ వారిస్ స్పందించారు. ఆ నటీమణుల తీరును తప్పుపడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు.

‘పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున మన దేశ జెండాను పట్టుకుని, ఒక భారతీయ దేశభక్తి పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో వాడుతూ వేడుకలు చేసుకోవడం ఎంతవరకు సమంజసం? ఇది బాలీవుడ్ సంగీతానికి వ్యతిరేకం కానప్పటికీ, జాతీయ ప్రాధాన్యాన్ని, స్పూర్తిని ప్రతిబింబించే విషయంలో ప్రముఖులు మరింత బాధ్యతగా వ్యవహరించాలి’ అని ఆమె పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, భారతీయ వ్లాగర్స్, నెటిజన్లు సైతం పాకిస్థాన్ సెలబ్రిటీల అజ్ఞానాన్ని ఎత్తిచూపుతూ ట్రోల్ చేస్తున్నారు. జాతీయ పర్వదినాల్లో కనీస ప్రాథమిక విషయాలపై అవగాహన లేకుండా ప్రముఖులే ఇలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 


ఇది కూడా చదవండి: బలూచ్‌లో రక్తపాతం: 8 రోజుల్లో 26 మంది పాక్ సైనికులు హతం!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement