సౌత్ సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు ఇప్పటికే పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంతో పాటు సినిమా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం పెళ్లికి దూరంగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా నటి అంజలి చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరోసారి చర్చలోకి తీసుకొచ్చాయి.
తన స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సబ్యుల ఆనందం కోసం తాను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముందని అంజలి సూటిగా ప్రశ్నించింది. పెళ్లి తర్వాత అందరూ వెళ్లిపోతారు. కానీ చివరకు తాను మాత్రం ఒంటరిగా మిగిలిపోతానని సరదాగా వ్యాఖ్యానించింది. అంజలి ఇంట్లో కూడా తన పెళ్లి ప్రస్తావన తీసుకురావడం లేదని చెప్పింది.
ఇక ఇదే తరహాలో కమల్ హాసన్ తనయ శ్రుతిహాసన్ కూడా తనకు పిల్లలంటే ఇష్టమే కానీ పెళ్లిపై మాత్రం ఆసక్తి లేదని గతంలోనే స్పష్టం చేసింది. అసలు పెళ్లి లేకుండానే జీవిత భాగస్వామితో కలిసి జీవించవచ్చని ఆమె అభిప్రాయపడింది.
తమిళ నటి లక్ష్మీ మీనన్ కూడా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పింది. పెళ్లి మాత్రమే సంతృప్తికరమైన జీవితానికి మార్గం కాదని పేర్కొంది. కొంతకాలం క్రితమే తనకు దీనిపై పూర్తి అవగాహన వచ్చిందని.. ఈ విషయంలో భవిష్యత్తులో కూడా మార్పు ఉండదని పేర్కొంది.
మరోవైపు అనుష్క, త్రిష, నిత్యామీనన్ వంటి హీరోయిన్లు కూడా ప్రస్తుతం పెళ్లికి దూరంగానే ఉన్నారు. నిత్యామీనన్ అయితే ఒంటరి జీవితమే తనకు సంతోషంగా ఉందని ఇప్పటికే చెప్పింది. మొత్తంగా, పెళ్లి విషయంలో తమకు నచ్చిన నిర్ణయమే తీసుకుంటూ కెరీర్‌పై దృష్టి పెడుతున్నారు ఈ హీరోయిన్లు.


