సాక్షి, వనపర్తి: వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గోపాల్‌పేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ‘భరిస్తున్నా కాబట్టే పార్టీలో కొనసాగుతున్నా.. లేదంటే మరో జీవన్‌రెడ్డిని అయ్యేవాడిని’ అంటూ చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది.
ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో కొన్ని తప్పులు జరుగుతున్నాయని, పార్టీకి అన్యాయం చేస్తున్న వారిని బయటకు పంపించాల్సిన అవసరం ఉందని అన్నారు. వనపర్తిలో కొందరు పార్టీని సర్వనాశనం చేస్తున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోవడంపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. “డబ్బులకు ఆశపడి అధిష్ఠానం నాకు టికెట్ ఇవ్వలేదు” అంటూ ఆరోపించారు. పార్టీలో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం అవసరమని.. ఇందుకోసం సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని చిన్నారెడ్డి సూచించారు. దీంతో పాటు స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
అయితే, కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ వేదికగా చిన్నారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వనపర్తి కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలను మరోసారి తెరపైకి తెచ్చాయి. ఆయన వ్యాఖ్యలపై పార్టీ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం ఇప్పటికే హైకమాండ్‌పై తీవ్ర విమర్శలు చేస్తుండగా.. చిన్నారెడ్డి కూడా ఆ లిస్టులో చేరిపోయారు.


