పోలీసులు ప్రయాణించిన కారులో ఉన్న మద్యం, గంజాయి, యూనిఫాం
పోలీసుల కారులో గంజాయి వెనుక బయటపడుతున్న నిజాలు
గంజాయి దొరికిన కారులో ఓ బ్లూ బ్యాగ్‌లో భారీగా నగదూ ఉన్నట్లు చెబుతున్న గ్రామస్తులు
ఆ నగదు పోలీసులకు గ్రానైట్ మాఫియా ఇచ్చిందని అనుమానాలు
చంద్రబాబు సర్కారు వచ్చినప్పటి నుంచి భారీగా గ్రానైట్ అక్రమ రవాణా
రెండు మాఫియా గ్రూపుల మధ్య రాజీ చేసిన పోలీసులు
ప్రతిగా బల్లికురవ నుంచి గురజాల వరకు ఉన్న ఎస్సైలకు గ్రానైట్ మాఫియా భారీ పార్టీ
విందుకు ఓ ఉన్నతాధికారీ హాజరైనట్లు గుసగుసలు
పార్టీ ఏర్పాటులో ఒక మంత్రి పీఏ, ఓ సీఐ ప్రధాన పాత్ర
తిరిగి వస్తుండగా పోలీసుల కారుకు ప్రమాదం
గంజాయి గుట్టు బయటపడగానే జారుకున్న ఇద్దరు ఎస్సైలు
కరకట్ట ప్యాలెస్ డైరెక్షన్‌లో కేసును నీరుగార్చేందుకు కుట్రలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పోలీసుల కారులో గంజాయి, మద్యం బాటిళ్లు దొరకిన ఘటన వెనుక అత్యంత కీలకమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ఘటనకు ముందు అధికార కూటమి గ్రానైట్ మాఫియాకు అండదండలందిస్తున్న పోలీసులు అందరికీ మాఫియా పెద్దలు పెద్ద పార్టీ ఇచ్చారని, అందులో పాల్గొని వస్తుండగా పోలీసుల వాహనం ఆటోను ఢీకొనడం, ఆ కారులో గంజాయి, మద్యం బాటిళ్లు బయటపడి.. మొత్తం గుట్టు రట్టయిందని సమాచారం. ఇదే కారులో ఓ నీలం రంగు బ్యాగు కూడా లభ్యమైందని, దానిలో పెద్ద మొత్తంలో డబ్బు ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ఘటన తర్వాత పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు, భిన్నమైన ప్రకటనలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ప్రజలు, వైఎస్సార్‌సీపీ నాయకులు సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కరకట్ట ప్యాలెస్ డైరెక్షన్‌లో ఈ కేసును నీరుగార్చేందుకు పావులు కదుపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనలో బల్లికురవ ఎస్సై నాగరాజు, సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావును కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది.
పోలీసులు మద్యం తాగారా?
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరప్పాడు వద్ద ఆదివారం సాయంత్రం ఆటోను పోలీసుల కారు ఢీకొట్టిన సమయంలో కారు డ్రైవర్
చేతిలో మద్యం బాటిల్ ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. కారులో మిగిలిన వారు కూడా మద్యం తగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. బల్లికురవ ఎస్సై నాగరాజు, సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు సివిల్ డ్రెస్సులో ఉండటంతో వారిని గ్రామస్తులు గుర్తించలేదు. దాంతో కారు డిక్కీలో ఏముందో చూడాలని పట్టుబట్టారు. డిక్కీ తెరవగా అందులో గంజాయి, మద్యం బాటిళ్లు, పోలీసు యూనిఫాంలు బయటపడ్డాయి.
అక్కడకొచ్చిన అద్దంకి సీఐ సుబ్బరాజు గ్రామస్తులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో గ్రామస్తులకు, సీఐకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇది జరుగుతుండగానే కారులో ఉన్న ఇద్దరు ఎస్సైలు చల్లగా జారుకున్నట్లు చెబుతున్నారు. పోలీసు అధికారులు చెప్పినట్లు గంజాయి విక్రయిస్తున్న నిందితుడిని ఛేజ్ చేస్తూ వచ్చి ఉంటే గ్రామస్తులకు ఆ విషయం ఎందుకు చెప్పలేదని, అక్కడి నుంచి ఇద్దరు ఎస్సైలు ఎందుకు జారుకున్నారన్న ప్రశ్నలకు అధికారుల నుంచి జవాబు లేదు.
బ్లూ బ్యాగులో భారీ మొత్తంలో నగదు?
పోలీసుల కారు డిక్కీలో ఒక బ్లూ కలర్ బ్యాగు కూడా ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఆ బ్యాగులో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే గ్రామస్తులు డిక్కీ తెరవాలని ఒత్తిడి చేసినప్పుడు సీఐ సుబ్బరాజు అడ్డుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బ్యాగులో డబ్బులున్నది నిజమైతే అంత భారీ మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
గ్రానైట్ డీల్‌లో భాగంగానే పార్టీ జరిగిందా?
చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ‘పచ్చ గ్రానైట్ మాఫియా’ రెచ్చిపోతోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల కనుసన్నల్లో గ్రానైట్ అక్రమ రవాణా భారీ ఎత్తున జరుగుతోంది. పైగా, గ్రానైట్ మాఫియా మూడు గ్రూపులుగా విడిపోయింది. వారి మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్నట్లు సమాచారం. బల్లికురవ నుంచి తరలిస్తున్న గ్రానైట్ తమ నియోజకవర్గం మీద నుంచి తరలిస్తున్నారని, తమకు కూడా కప్పం చెల్లించాలని పల్నాడుజిల్లా గురజాల నేతలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వివాదాన్ని ఇటీవల సీఐగా పదోన్నతి పొందిన ఒక ఎస్సై, మరో ఎస్సై రాజీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో బల్లికురవ నుంచి దాచేపల్లి, గురజాల వరకు ఉన్న పోలీసు స్టేషన్ల ఎస్సైలకు, కొందరు పెద్ద అధికారులకు మాఫియా పెద్దలు ఈర్లకొండలో భారీ మందు పార్టీ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఈ పార్టీ ఏర్పాటులో ఒక మంత్రి పీఏ ప్రధాన పాత్ర పోషించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈర్ల గంగమ్మ గుడి వద్ద నాలుగు పొట్టేళ్లను కోసి పార్టీ ఇచ్చినట్లు స్థానిక ప్రజలు అంటున్నారు. దర్శి సబ్ డివిజన్‌కు సంబందించి ఒక కీలక పోలీసు అధికారి కూడా ఈ విందుకు వచ్చినట్లు చెబుతున్నారు. దర్శి డివిజన్లో ఎస్సైగా పనిచేసి ఇటీవల సీఐగా పదోన్నతి పొందిన అధికారి ఈ పార్టీ ఏర్పాటు, గ్రానైట్ డీల్‌లో కీలక పాత్ర పోషించినట్లు పోలీసు శాఖలో చర్చసాగుతోంది.
ఇద్దరు అధికారులు.. రెండు కథనాలు
ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రమాదం జరిగి, పోలీసుల గంజాయి గుట్టు బయటపడింది. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా పాకిపోయింది. దీనిపై అర్ధరాత్రి 11.45 గంటలకు దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ ఒక వీడియో విడుదల చేశారు. ఇటీవల బల్లికురవ, సంతమాగులూరు ప్రాంతాల్లో జరిగిన అనేక చోరీలను పోలీసులు ఛేదించారని, ఈ నేపథ్యంలో ఎస్సైలు ఈర్ల గంగమ్మ తల్లిని దర్శించుకుని వస్తుండగా ధర్మవరం వద్ద ఒక అనుమానితుడు కనిపించాడని, పోలీసులను చూసి భయంతో అతని వద్ద ఉన్న గంజాయి, మద్యం బాటిళ్లను పడేసి పరారయ్యాడని డీఎస్పీ ఆ వీడియోలో చెప్పారు.
నిందితుడిని వెంబడించే క్రమంలో పోలీసుల కారు ఆటోను ఢీకొట్టినట్లు చెప్పుకొచ్చారు. దర్శి డీఎస్పీ వివరణకు పూర్తి భిన్నంగా మరో అధికారి చెప్పడం గమనార్హం. కొమ్మాలపాడు గ్రామంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడకు వెళ్లారని, పోలీసులను చూసి నిందితుడు తన వద్ద ఉన్న గంజాయి, మద్యం బాటిళ్లను పారేసి పరారైనట్లు ఆ అధికారి చెప్పారు. అతడిని వెంబడించే క్రమంలో ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ రెండు వివరణల్లో ఏది నిజమో పోలీసు అధికారులే చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులు పారిపోలేదు.. మద్యం తాగలేదు
శంఖవరప్పాడు ఘటనపై ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్థనరాజు వివరణ
అద్దంకి: ‘యాక్సిడెంట్ జరిగింది. అక్కడే ఉన్న మా ఎస్‌ఐలు గ్రామస్తులతో తాము బల్లికురవ ఎస్‌ఐ నాగరాజు, సంతమాగులూరు ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు అని చెప్పారు’ అని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు వెల్లడించారు. ప్రకాశం జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్‌లో ఆయన సోమవారం అద్దంకి మండలం శంఖవరప్పాడులో జరిగిన ఘటనపై మాట్లాడారు. ‘‘పోలీసులు పారిపోయారంటున్నారు. వారు ఎక్కడికీ పారిపోలేదు.
తాగిన మత్తులో ఉన్నారని చెప్పడం అవాస్తవం. యాక్సిడెంట్ కావడం సహజం. ఓ నిందితుని వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్న క్రమంలో శంఖవరప్పాడు వద్దకు రాగానే, ఎదురుగా రాంగ్ రూట్‌లో ఆటో, బైక్ వస్తున్నాయి. బైక్‌ను తప్పించబోయి ఆటోను కారు ఢీ కొట్టింది. ఎస్‌ఐలు వైద్యశాలలో ఉన్న ఆధారాలు ఉన్నాయి. గంజాయి దొరికిన దాని గురించి విచారణ చేసి ప్రెస్‌మీట్ పెడతాం. పోలీసులు రకరకాల ఆపరేషన్లు చేస్తారు. ఆ క్రమంలో వారు ప్రైవేటు వెహికల్‌లో వచ్చారనడం నేరం కాదు. ఓ వాహనాన్ని తప్పించబోయి యాక్సిడెంట్ జరిగింది. మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. పోలీసు వ్యవస్థ బాగా పనిచేస్తోంది’ అని చెప్పారు.


