పర్లాకిమిడి: స్థానిక మూడో వార్డు, రాజగురు వీధి వద్ద ఉన్న మహాప్రభు రసికరాజ మందిరం (పోరిచ్చా మఠం) ను ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి గురువారం సందర్శించారు. రెండు శతాబ్దాల కిందట మహారాజా నిర్మించిన శ్రీరసికరాజ మందిరం (పోరిచ్చామఠం)శ్రీ రాధాకృష్ణ పురాతన మందిరం ఉంది. మహాంత కృపాల్ మహారాజ్, అనేక మంది సాధుసంతువులు పర్లాకిమిడి వచ్చినప్పుడు ఇక్కడ బస చేస్తుండేవారు. అతి పురాతన, చారిత్రాత్మక ఈ మందిరం ప్రస్తుతం జీర్ణావస్థలో ఉంది. ఈ మందిర పుణరుద్ధరణకు ఇన్నేళ్లుగా నోచుకోలేక పోయిందని మురళీ పోరిచ్చా, గజేంద్రపండా, పర్యవేక్షకులు గోపినాధ పోరిచ్చా, పూజారీ హారేరామ క్రిష్ణ చౌదురి, సముటియా వీధి ప్రజలు ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహికి విన్నవించారు. ముఖ్యంగా శ్రీక్రిష్ణజన్మాష్టమి వేడుకలు, కార్తిక మాసంలో నెలరోజుల పాటు సంకీర్తనలు జరుగుతాయి. అలాంటి ఈ మందిర పుణరుద్ధరణకు తన వంతు సహాయం చేస్తానని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి హామీ ఇవ్వడంతో రాజగురు, పోరిచ్చా వీధి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మందిరంతో పాటు పక్కన ఉన్న ఫుల్లోసుందరీ మందిరం అభివృద్ధి పనులు కూడా ఎమ్మెల్యే లాడ్ నిధులతో మరామత్తులు చేస్తానని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి హామీ ఇచ్చారు.


