శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రం సమీపంలోని ఓ నియోజకవర్గానికి చెందిన చిరంజీవి అనే వ్యక్తి బంగారం వ్యాపారం చేస్తుంటారు. ఆన్‌లైన్‌లో తక్కువ ధరకే బంగారం (గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్) యాప్ చూసి ఫోన్ కాల్ చేయడంతో అవతలి వ్యక్తులు ‘మా దగ్గర 24 క్యారెట్ ముక్క బంగారం ఉంది. బిస్కెట్ బంగారం, కాయిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. చాలా తక్కువ ధరకే ఇస్తాం’ అని చెప్పారు. మోడల్‌గా ఓ కాయిన్ సైతం ఒరిజినల్‌దేనంటూ వాట్సాప్‌లో ఫొటో పంపించారు. అందులో ఓ వ్యక్తి విశాఖ రమ్మని చెప్పి తక్కువ ధరకే కాయిన్ ఇచ్చి వెళ్లిపోయాడు. దీంతో వారిని నమ్మిన చిరంజీవి రూ.1.50 కోట్లకు డీల్ మాట్లాడుకుని బంగారం సిద్ధం చేయమని చెప్పడం, వారు కూడా ఏర్పాటు చేశామని చెప్పి డబ్బుతో బెంగళూరు రమ్మనడంతో చిరంజీవి మరో వ్యక్తితో కలిసి వెళ్లారు. వారు రమ్మన్న చోటకు వెళ్లాక అప్పటికే గ్రూప్‌గా చేరుకున్న అక్కడి అపరిచిత వ్యక్తులు తీసుకెళ్లిన డబ్బులు రూ.1.50 లక్షల విలువైన ఐఫోన్ సహా సర్వం దోచేశారు.
సామాన్యులే బలి..!
గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ తరహాలోనే గార మండలంలో తాజాగా ఓ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ ఉద్యోగి బ్యాంక్ శాలరీ అకౌంటులో రూ.18,057, పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలో రూ.8,058 లు మొత్తంగా రూ. 26,115 లు దఫదఫాలుగా సంబంధిత బ్రాంచిలు హోల్డ్‌లో పెట్టినట్లు ఫోన్‌లో మెసేజ్లు వచ్చాయి. సదరు ఉద్యోగి సంబంధిత బ్యాంకు ప్రతినిధులను సంప్రదించగా ‘సైబర్ ఫ్రాడ్‌కు సంబంధించిన అమౌంట్ మీ ఖాతాలకు మళ్లాయి. పోలీసుల నుంచి ఎన్‌వోసీ తెచ్చుకుంటే హోల్డ్ తీసేస్తామని’ వారు చెప్పడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. తానేంటి.. సైబర్ ఫ్రాడ్ చేయడమేంటని అనుకుంటూనే జిల్లా సైబర్ సెల్‌ను ఆశ్రయించారు.
మోసంతో సంబంధం లేకపోయినా..
అక్కడ తనిఖీ చేయగా ఉద్యోగి భార్య బ్యాంకు ఖాతాకు రూ.10 వేలు మోసపూరిత సొమ్ము ఈ నెల 10న ఒకరు ఫోన్‌పే ద్వారా మళ్లించినట్లు, ఆమె తన ఖాతానుంచి రూ. 9 వేలు ఒకసారి, రూ.వెయ్యి ఒకసారి భర్త శాలరీ ఖాతాకు అదే రోజు పంపినట్లు తెలుసుకున్నారు. వాటిలో రూ. 5 వేలను ఉద్యోగి తన పోస్టాఫీసు ఖాతాకు పంపించి మళ్లీ పోస్టాఫీసు ఖాతా నుంచి అదే రోజు రూ.8,057లు సెల్ఫ్ స్వీప్ చేసి పంపినట్లు తెలిసింది. ఒకే రోజు మల్టిఫుల్ ట్రాంజెక్షన్స్ మోసపూరిత సొమ్ము నుంచి పలు ఖాతాలకు చేరడంతో తెలంగాణ మిర్యాలగూడలో గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ పేరిట కేసు నమోదైందని, ఆ మోసపూరిత సొమ్ము మీ భార్య ఖాతానుంచి మీ ఖాతాకు రావడం వల్లే బ్యాంకు హోల్డ్‌లో పెట్టిందని నిపుణులు చెప్పడంతో ఉద్యోగి అవాక్కయ్యారు. ఉద్యోగి భార్య తన స్నేహితురాలి స్నేహితునికి (ఐటీ కంపెనీలో పనిచేస్తున్న యువకుడు) అవసరమై రూ. 10 వేలు అప్పుగా ఇవ్వడం, ఆ సొమ్మును ఇటీవలే అతను ఫోన్‌పే చేయడం జరిగిందని తెలుసుకున్న ఉద్యోగి అతనికి ఫోన్ చేసి ఆరా తీశాడు. పని ఒత్తిడిలో ఉన్న ఆ ఐటీ యువకుడు తన బ్యాంకు ఖాతాలు తనిఖీ చేయగా తనవి కూడా రూ. 60 వేల వరకు లాక్ అయినట్లు తెలుసుకుని నిర్ఘాంతపోయాడు. ఐటీ యువకుడు ఇటీవలే పాత కార్లు కొనుగోలు చేసే వెండర్స్ ఇద్దరికి తన పాత కారు అమ్మాడని.. దానిలో భాగంగా వారు ఫోన్‌పే ద్వారా ఐటీ యువకుని అకౌంట్‌కు కొంత సొమ్ము పంపారని ఆ సొమ్ము గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌కు గురైన సొమ్మని, మొత్తంగా వెండర్ అన్నవాడే గోల్డ్ ఫ్రాడ్ చేసిన వ్యక్తని అనుమానిస్తున్నారు.
మోసగాడి ఖాతా నుంచి బదిలీ కావడంతో..
గోల్డ్ ఇన్వెస్టుమెంట్ ఫ్రాడ్ అయిన వెండర్ నుంచి మోసపూరిత సొమ్ము ఐటీ యువకుని ఖాతాకు, ఐటీ యువకుడి నుంచి ఉద్యోగి భార్య ఖాతాకు, ఆమె ఖాతానుంచి ఉద్యోగి శాలరీ అకౌంట్‌కు , దాని నుంచి ఉద్యోగి పోస్టాఫీసు ఖాతాకు, మళ్లీ సెల్ఫ్ స్వీప్ ద్వారా పోస్టాఫీసు ఖాతా నుంచి శాలరీ అకౌంటుకు ఒకే రోజు ఎక్కువ లావాదేవీలు జరగడం.. మిర్యాలగూడలో సైబర్ కేసు నమోదు కావడంతో అక్కడి పోలీసులు సంబంధిత లావాదేవీల జరిగిన బ్యాంకు ఖాతాలున్న బ్రాంచిలకు ఆదేశాలు పంపడంతో అన్ని అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయి.
సైబర్ మోసాలకు సామాన్యులు బలైపోతున్నారు. తమకు నేరుగా సంబంధం లేకపోయినా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సైబర్ ఫ్రాడ్ సొమ్ము వివిధ అకౌంట్ల ద్వారా బదిలీ అయ్యిందంటూ ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారు. కేసు పూర్తయ్యే వరకు సొమ్ము తీసుకోవడానికి వీల్లేదంటూ సదరు సొమ్మును హోల్డ్‌లో పెట్టేస్తున్నారు. తాము కష్టపడి సంపాదించిన డబ్బును తాము తీసుకోవడాకి వీల్లేకుండా చేయడం తగదంటూ బాధితులు లబోదిబోమంటున్నారు.
నేరపూరిత సొమ్ము బదిలీ అయ్యిందంటూ ఖాతాలు ఫ్రీజ్ చేస్తున్న వైనం
తమకు సంబంధం లేకపోయినా ఇరుక్కుంటున్న ఖాతాదారులు
గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లతో రెచ్చిపోతోన్న సైబరాసురులు
జిల్లాలో వెలుగు చూస్తున్న సరికొత్త మోసాలు
ఇదే తరహాలో ఎచ్చెర్ల కేంద్రంగా టిఫిన్ షాప్ నడుపుతున్న ఓ వ్యక్తి సైతం రూ. 25 లక్షలు మోసపోయారు. జిల్లాలో ఇటీవలి కాలంలో ఇటువంటి గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లు ఐదు జరిగాయి. ప్రజలు సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుకోవడంతో కాస్త తగ్గుముఖం పట్టినా కొంతమంది సైబరాసురులు సరికొత్త మోసాలతో ఇలా రెచ్చిపోతుండటంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు.
అపోహలు వద్దు
ఆన్‌లైన్ సైబర్‌ఫ్రాడ్‌కు గురైన బాధితుని సొమ్ము ఎవరెఎవరి ఖాతాలకు చేరుతాయో ఆ ఖాతాల్లోని సొమ్మునే అనుమానితంగా ఫ్రీజ్ (హోల్డ్) చేస్తాం. ఖాతాలు రన్నింగ్‌లోనే ఉంటాయి. ఇతర ట్రాంజెక్షన్లన్నీ యథావిధిగా జరుగుతాయి. ఈలోగా వారం రోజుల పాటు ఫ్రాడ్ అమౌంట్ వున్న ఖాతాలను వెరిఫై చేయించి అందులోని సొమ్ము వారిదేనని నిజాయితీగా తేలితే లేయర్ల వారీగా అందరి అకౌంట్ల నుంచి హోల్డ్ తొలగిస్తాం. ప్రజలు అపోహలు చెందాల్సిన పని లేదు. వీరిలో ఫ్రాడ్ సొమ్ము గుర్తించి రికవరీ చేసి బాధితునికి అందజేస్తాం.
– కె.వి.మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం


