ఉపాధ్యాయుడి సస్పెన్షన్
పాఠశాలకు తాళం వేసి గ్రామస్తులు
రాయగడ: మూడో తరగతి చదువుతున్న బాలికపై అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణల నేపథ్యంలో ఉపాధ్యాయుడిని అధికారులు సస్పెండ్ చేయడంతో జిల్లాలోని పద్మపూర్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. చర్యను వ్యతిరేకిస్తున్న ఓ వర్గం పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు బయటే ఉండాల్సి వచ్చింది. మరోవైపు అధికారుల చర్యను సమర్థిస్తున్న మరో వర్గం నిష్పక్షపాత దర్యాప్తు ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావాలని కోరుతోంది. దీంతో బిరిపదర్ గ్రామంలో రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. జిల్లాలోని పద్మపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిరిపదర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో సహాయక ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న శివ ప్రసాద్ సాహు పై మూడో తరగతి విద్యార్థిని కుటుంబ సభ్యులు అసభ్య ప్రవర్తనకు సంబంధించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆగస్టు 12 వతేదీ న ఫిర్యాదు అందిన అనంతరం ప్రధానోపాధ్యాయురాలు ప్రణతి పాణిగ్రహి నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఫిర్యాదు, తదుపరి దర్యాప్తు ఆధారంగా పద్మపూర్ సమితి ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బిఈఒ) హృషికేష్ రథ్ ఉపాధ్యాయుడు శివ ప్రసాద్ సాహును సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అయితే ఈ చర్యపై గ్రామంలో ఒక వర్గం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. సుమారు 15 ఏళ్లుగా అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడిపై వచ్చిన ఆరొపణలు ఆ వర్గం ఖండిస్తు సస్పెన్షన్‌ను ఉపసంహరించుకొవాలని డిమాండ్ చేసింది. డిమాండ్ నెరవేరకపోవడంతో కొందరు విద్యార్థులను ముందుంచి పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేసినట్లు సమాచారం. దీంతో పాఠశాలలో బోధన కొంతసేపు నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పద్మపూర్ పోలీసులు వెంటనే పాఠశాలకు చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం పాఠశాల గేటుకు వేసిన తాళాన్ని తొలగించారు. బీఈఓ హృషికేష్ రధ్, ఏబీఈఓ చంద్రసేన్ లిమ్మ, సీఆర్‌సీసీ చిత్తరంజన్ సేనాపతి, సర్పంచ్ కిషొరి సబర్, ఎస్‌ఎంసీ అధ్యక్షుడు గొవర్ధన్ సబర్, పోలీసులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, ప్రధానోపాధ్యాయురాలి సమక్షంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలోనూ ఇరువర్గాల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది. ఒక వర్గం ప్రధానొపాధ్యారాలిపై కులపరమైన వాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆమెను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేసింది. మరొ వర్గం మాత్రం అధికారుల చర్యను సమర్థిస్తూ పూర్తిస్థాయి నిష్పక్షపాత దర్యప్తు అనంతరం మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొంది. ఈ వ్యవహారంపై ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ విద్యార్థిని, తల్లిదండ్రులు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు, కమిటీ నిర్ణయం మేరకే ఉన్నతాధికారులకు సమాచారం అందించామని తెలిపారు. తనపై చేసిన కులపరమైన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. బీఈఓ హృషికేష్ రథ్ మాట్లాడుతూ దర్యాప్తు నివేదిక ఆధారంగానే ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. విద్యార్థుల చదువుకు ఎలాంటి అంతరాయం కలగకుండా పాఠశాలలో మరొ ఉపాధ్యాయుడికి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.


