ఎంపీటీసీ నుంచి మంత్రి.. బర్తరఫ్‌ వరకు | Many twists and turns in Konda Surekhas political journey | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీ నుంచి మంత్రి.. బర్తరఫ్‌ వరకు

Sep 4 2026 2:56 AM | Updated on Sep 4 2026 2:56 AM

Many twists and turns in Konda Surekhas political journey

కొండా సురేఖ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మలుపులు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: తాజా మాజీ మంత్రి, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖది ఉమ్మడి వరంగల్‌ రాజకీయాల్లో ప్రత్యేక అధ్యాయం. క్షేత్రస్థాయి రాజకీయాల నుంచి మొదలైన ఆమె ప్రస్థానం శాసనసభకు.. అక్కడి నుంచి మంత్రివర్గానికి చేరింది. మధ్యలో పార్టీ మార్పులు.. రాజీనామాలు.. ఉపఎన్నికలో ఓటమి.. మళ్లీ విజయాలు.. రాజకీయ ప్రత్య­ర్థులతో పోరాటం.. ఇలా ఎన్నో మలుపులు తిరిగింది. కాంగ్రెస్‌తో మొదలైన ప్రస్థానం వైఎస్సార్‌సీపీ, బీఆర్‌ఎస్‌ మీదుగా తిరిగి కాంగ్రెస్‌లోకి చేరింది. రెండుసార్లు మంత్రి పదవిని చేపట్టిన ఆమె.. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురవడం చర్చనీయాంశంగా మారింది. 

ఎంపీటీసీగా రాజకీయాల్లోకి..  
కొండా సురేఖ 1995లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్‌ తరఫున వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరి ఎంపీటీసీగా ఎన్నికై గీసుకొండ మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా (ఎంపీపీ) బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 1996లో ఏపీ కాంగ్రెస్‌ కమిటీ సభ్యురాలు అయ్యారు. అనంతరం 1999లో అప్పటి శాయంపేట అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009లో పరకాల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా నిలిచారు. 

అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో సురేఖ స్థానం పొందారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వై.ఎస్‌. మరణం తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా నిలిచి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకున్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరి పరకాల ఉపఎన్నికలో ఆ పార్టీ తరఫున పోటీ చేసినా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మొలుగూరి భిక్షపతి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆమెకు తొలిసారి ఎదురైన రాజకీయ ఓటమి ఇదే. 

2014లో బీఆర్‌ఎస్‌... 2018లో మళ్లీ కాంగ్రెస్‌లోకి.. 
తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో సురేఖ వైఎస్సార్‌సీపీని వీడి నాటి టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014 ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఘన విజయం సాధించారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న ప్రాంతంలో పార్టీ మారి భారీ మెజారిటీతో గెలవడం ఆమె రాజకీయ బలానికి నిదర్శనంగా నిలిచింది. కానీ ఆ పార్టీలోనూ ఆమె ప్రయాణం ఎక్కువకాలం సాఫీగా సాగలేదు. పార్టీ నాయకత్వంతో విభేదాలు, అంతర్గత రాజకీయాల నేపథ్యంలో 2018లో ఆ పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్‌లో చేరిన సురేఖ.. పరకాల నుంచి పోటీ చేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. దీంతో సురేఖకు ఒక దశలో రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బే తగిలింది.

మళ్లీ తూర్పులో పట్టు... 2023లో ఘన విజయం 
2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున సురేఖ తిరిగి వరంగల్‌ తూర్పు నుంచి పోటీ చేసి గెలుపొందారు. అదే సమయంలో రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఆమెకు మరోసారి మంత్రి పదవి పొందేందుకు మార్గం సుగమమైంది. 2023 డిసెంబర్‌ 7న రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కేబినెట్‌ మంత్రిగా సురేఖ ప్రమాణ స్వీకారం చేశారు. అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖల బాధ్యతలు చేపట్టారు. కానీ మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ పలుమార్లు పార్టీ అంతర్గత అంశాలపై ఆమె బహిరంగంగా స్పందించారు. 

ఇటీవల సీఎంను ఉద్దేశించి ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ఇది సురేఖ బర్తరఫ్‌కు దారి తీసింది. ఈ పరిణామం ఉమ్మడి వరంగల్‌ కాంగ్రెస్‌లోని అంతర్గత సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సురేఖకు ఉన్న వ్యక్తిగత అనుచరగణం, భర్త కొండా మురళి రాజకీయ పరిచయాలు, బీసీ వర్గాల్లో ఆమెకు ఉన్న మద్దతు.. ఇవన్నీ కలిపి చూస్తే ఆమె బర్తరఫ్‌ ప్రభావం తక్షణమే ముగిసే అవకాశం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

అచ్చిరాని దేవాదాయ శాఖ 
జూపల్లి నుంచి సురేఖ దాకా రిపీట్‌ అవుతున్న సెంటిమెంట్‌ 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రివర్గం నుంచి కొండా సురేఖకు ఉద్వాసన నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ఓ ఆసక్తికర సెంటిమెంట్‌పై చర్చ మొదలైంది. దేవాదాయ శాఖను చేపట్టిన మంత్రులకు ఆ పదవి రాజకీయంగా కలిసి రాదనే అంశం కొండా సురేఖ బర్తరఫ్‌తో మరోసారి తెరపైకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావు ఉదంతం ఇందుకు ప్రధాన ఉదాహరణగా రాజకీయ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. 2009లో వైఎస్సార్‌ మంత్రివర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న జూపల్లి.. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో దేవాదాయ శాఖకు మారారు. 

తనకు ప్రాధాన్యత లేని శాఖ ఇచ్చారనే అసంతృప్తి అప్పట్లో ఆయనలో వ్యక్తమైంది. అదే సమయంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మరో మంత్రి డీకే అరుణతో జూపల్లి మధ్య ప్రొటోకాల్, ఆధిపత్య వివాదాలు చర్చకు వచ్చాయి. చివరకు మంత్రి పదవికి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ ఏర్పడ్డాక దేవాదాయ శాఖ బాధ్యతలు చేపట్టిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం కూడా ఈ చర్చకు మరో ఉదాహరణగా నిలుస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో నిర్మల్‌ నుంచి గెలిచిన ఆయన.. దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగిన తర్వాత 2023 ఎన్నికల్లో ఓడిపోయారు. 2023లో ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖ పార్టీ అంతర్గత వివాదాల్లో చిక్కుకుని చివరకు కేబినెట్‌ నుంచి ఉద్వాసనకు గురయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement