ఏసీబీ వలలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారి | ACB Raids Suryapet Town Planning Officer Residence | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారి

Sep 4 2026 6:01 AM | Updated on Sep 4 2026 6:01 AM

ACB Raids Suryapet Town Planning Officer Residence

రూ.3.54 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు.. కేసు నమోదు

సూర్యాపేట: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి వి.సోమయ్యపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. నల్లగొండ రేంజ్‌ ఏసీబీ అధికారులు గురువారం సూర్యాపేటలోని సోమయ్య నివాసం, కార్యాలయంతోపాటు ఆయన బంధువులు, సహచరులకు సంబంధించిన ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లాలో 3 ఎకరాల 3 గుంటల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. 

అలాగే సూర్యాపేట, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ పరిధిలో ఐదు నివాస ఆస్తులున్నట్లు తేల్చారు. వీటిలో ఒక జీ+1, ఒక జీ+2, ఒక జీ+4 భవనాలతో పాటు ఒక పెంట్‌హౌస్, రెండు గ్రౌండ్‌ ఫ్లోర్‌ ఇళ్లున్నాయి. వీటితోపాటు సూర్యాపేట పరిధిలో మరో ఎనిమిది ఓపెన్‌ ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సోదాల్లో భాగంగా రూ.4,63,990 నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.13 లక్షల నగదున్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా సుమారు రూ.20 లక్షల విలువ చేసే 709 గ్రాముల బంగారు, 1,750 గ్రాముల వెండి ఆభరణాలు లభించాయి. సోమ య్యకు చెందిన రెండు కార్లు, మూడు ద్విచక్ర వాహనాలను కూడా గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.25.20 లక్షలుగా అధికారులు పేర్కొన్నారు. 

ఇంట్లోని గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల విలువ సుమారు రూ.11 లక్షలుగా అంచనా వేశారు. బంగారాన్ని తాకట్టు పెట్టి బ్యాంకు ద్వారా సోమయ్య సుమారు రూ.49 లక్షల రుణం పొందినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన స్థిరాస్తులు, నగదు, బంగారం, వాహనాలు తదితరాలను కలిపి సోమయ్యకు సంబంధించిన ఆస్తుల మొత్తం విలువను రూ.3,54,36,490గా ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మరిన్ని ఆస్తుల వివరాలపై విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement