సాక్షి, హైదరాబాద్: తాజా మాజీ మంత్రి, వరంగల్ తూర్పు కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. “నిరీక్షణ ముగిసింది.. అతిత్వరలో ఓ కీలక నిర్ణయం ప్రకటిస్తా.. చూస్తూనే ఉండండి.. తెలంగాణ!” అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఈ ఉదయం నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై కాసేపటికే ఆమె మరో ప్రకటన చేశారు.
ఈ ఉదయం కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె ఎక్స్ ఖాతా నుంచి అఫీషియల్‌గా పోస్ట్ చేశారు. కాసేపటికే ఆమె పేరిట ఉన్న ఫేస్‌బుక్ ఖాతాలో ఆసక్తికరమైన పోస్ట్ కనిపించింది. ఇదిలా ఉంటే.. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ తదుపరి అడుగు ఏమిటన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ పరిణామం కోసం కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు గమనించ సాగాయి.
కొండా సురేఖ కూతురు సుస్మిత వ్యాఖ్యల నేపథ్యంలో ముదిరిన పంచాయితీ.. సురేఖను బర్తరఫ్ చేసేదాకా వెళ్లింది. మరీముఖ్యంగా మంత్రివర్గం నుంచి ఆమెను తొలగించిన తర్వాత వరంగల్ రాజకీయాల్లోనూ చర్చకు దారితీసిన పరిస్థితుల మధ్య ఈ పోస్టు వైరల్ అవుతూ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆ ఫేస్‌బుక్ అకౌంట్ తనది కాదని ఆమె వివరణ ఇచ్చుకున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు అవాస్తవం. మా పేరిట జరుగుతున్న ప్రచారాలకు మాకు సంబంధం లేదు అంటూ ఆమె నుంచి ఓ ప్రకటన వెలువడింది.
“త్వరలో పెద్ద అప్‌డేట్” అంటూ సురేఖ పేరిట వచ్చిన ప్రకటన ఉత్తదే అని తేలిపోయింది. అయితే తన రాజకీయ భవిష్యత్తుపై ఆమె ఏదైనా క్లారిటీ ఇస్తారా? అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే ఆమెను రెండు పార్టీలు సంప్రదించాయని.. ప్రాంతీయ పార్టీ వైపు ఆమె మొగ్గు చూపిస్తున్నారని వరంగల్‌లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది.
ఇదీ చదవండి: కొండాను ఒంటరి చేయడంలో సక్సెస్!


