నిజంగా అర్హులేనా..! | Indiramma Lig Houses Beneficiary Verification Hyderabad | Sakshi
Sakshi News home page

నిజంగా అర్హులేనా..!

Sep 4 2026 1:13 PM | Updated on Sep 4 2026 1:21 PM

Indiramma Lig Houses Beneficiary Verification Hyderabad

బషీర్‌బాగ్‌లో క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్న హౌసింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ వీపీ గౌతం

ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్ల లలబ్ధిదారులపై క్షేత్రస్థాయి పరిశీలన

రంగంలోకి 80 మంది అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్ల లక్కీడ్రాలో ఎంపికైన లబ్ధిదారుల అర్హతను నిర్ధారించే ప్రక్రియ మొదలైంది. లాటరీలో ఎంపికైన వారి దరఖాస్తుల్లో పేర్కొన్న వివరాలు వాస్తవమేనా? నిబంధనల ప్రకారం వారు అర్హులేనా? అనే అంశాలను తేల్చేందుకు హౌసింగ్‌ బోర్డు, కార్పొరేషన్‌కు చెందిన సుమారు 80 మంది అధికారులు, సిబ్బంది ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగారు.

లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరిస్తూ.. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో అక్కడికక్కడే నమోదు చేస్తున్నారు. కోర్‌ సిటీ పరిధిలోని 16 ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్‌లో ఎల్‌ఐజీ ఇళ్లను కేటాయించేందుకు  కంటోన్మెంట్‌లో 120, మిగిలిన నియోజకవర్గాల్లో 480 మంది చొప్పున లలబ్ధిదారులతో పాటు వెయిటింగ్‌ లిస్ట్‌ కోసం మరికొంత మందిని కూడా లాటరీ ద్వారా ఎంపిక చేశారు.

గురువారం లలబ్ధిదారుల అర్హతను నిర్ధారించే క్షేత్రస్థాయి పరిశీలనను హౌసింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ వీపీ గౌతం స్వయంగా పరిశీలించారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో లక్కీడ్రాలో ఎంపికైన బషీర్‌బాగ్‌ షేర్‌గేట్‌ సమీపంలో నివసిస్తున్న లబ్ధిదారుడి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివరాలను స్వయంగా యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు.  

దరఖాస్తు వివరాలతో పోల్చి.. 
ఇళ్లకు దరఖాస్తు చేసుకునే సమయంలో లలబ్ధిదారుల నుంచి ఎలాంటి ధ్రువపత్రాలను తీసుకోలేదు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సేకరిస్తున్న వివరాలను అప్పట్లో దరఖాస్తులో పొందుపరిచిన సమాచారంతో అనుసంధానించి పరిశీలిస్తున్నారు. లలబ్ధిదారులు పదేళ్లుగా అదే నివాసంలో ఉంటున్నారా? అంతకుముందు ఎక్కడ నివసించారు? ఇంటి నిర్మాణ పరిస్థితి? కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు? తదితర వివరాలను ఆరా తీస్తున్నారు.

ఇంటి ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. మరోవైపు లక్కీడ్రా ద్వారా ఎంపికైన లబ్ధిదారుల వివరాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు కూడా అధికారులు అవకాశం కల్పించారు. అభ్యంతరాలను క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిన అంశాలతో సమగ్రంగా పరిశీలించి.. అర్హులైన వారి తుది జాబితాను ఖరారు చేయనున్నారు.

10 వరకు ఎల్‌ఐజీ ఇళ్ల దరఖాస్తుల గడువు పెంపు 
ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్ల కోసం ముషీరాబాద్, గోషామహల్, ఎల్‌బీ నగర్, చాంద్రాయణ గుట్ట నియోజకవర్గాల్లో దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 10 వరకు  పొడిగించినట్లు హౌసింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌ వీపీ గౌతం తెలిపారు. ఈ నెల 3 వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు ఉండగా వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోనికి తీసుకొని మరో వారం వరకు పెంచినట్లు తెలిపారు. అల్పాదాయ వర్గాల ప్రజల సొంత ఇంటి కలను నిజం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన ఈ పథకంలో ఇండ్లు పొందేందుకు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఇవి కూడా చదవండి: కూకట్‌పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement