సాక్షి, వరంగల్: తెలంగాణ మంత్రి వర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో వరంగల్ రాజకీయాలు ఒక్కసారిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లాయి. ఇప్పటివరకు కొండా వర్గానికి బలంగా అండగా నిలిచి నేతలు, అనుచరుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. చర్యలు తమదాకా వస్తాయేమో అనే భయంతో కొందరు ఇప్పటికే కొండా వర్గానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.
మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత.. వరంగల్ తూర్పులో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయని, ఆమె అనుచర గణం హడావిడి చేస్తుందని అంతా భావించారు. కానీ, ఇప్పటిదాకా అలాంటిదేం జరగకపోవడం గమనార్హం. పైగా నిన్నటిదాకా కొండా కుటుంబం పేరు చెప్పుకుని తిరిగిన నేతలు.. ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అయితే కొండా సురేఖ అనుచరులుగా ఉన్న పలువురికి దక్కిన పదవులు.. అలాగే వాళ్లకు అప్పగించిన ఏజెన్సీలు, ఇతర వ్యవహారాలపై అధికారులు ఆరా తీస్తున్నారన్న వార్తలు ఆ వర్గంలో మరింత టెన్షన్ పెంచుతున్నాయి.
కొండా సురేఖ బర్తరఫ్‌తో వరంగల్ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. చర్యల భయంతో ఆమె అనుచర వర్గంలో టెన్షన్ నెలకొనగా.. తమ పదవులు కూడా పోతాయన్న ఆందోళనతో కొందరు సైలెంట్ అవుతున్నారు. ఈ భయంతోనే కొందరు అనుచరులు కొండాకు దూరంగా ఉంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటు ఇంతకాలం కొండాకు వ్యతిరేకంగా నిలిచిన తమను కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోలేదని కొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు మారడంతో తమకు రాజకీయంగా ప్రాధాన్యం పెరుగుతుందని వారు భావిస్తున్నారు. కొందరు నేతలైతే ఏకంగా సంబురాలు జరుపుకున్నట్లు సమాచారం.
మరోవైపు.. తన అనుచరులు ఇబ్బందుల్లో పడకూడదన్న ఉద్దేశంతో కొండా సురేఖ వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో కొందరు నేతలు వేచి చూసే ధోరణిలో ఉండగా.. మరికొందరు మాత్రం పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కొండా వర్గాన్ని వీడి.. మరో వర్గంలోకి జంప్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఇంతకాలం కొండా కేంద్రంగా సాగిన వరంగల్ రాజకీయ సమీకరణాలు ఇప్పుడు మరో బాట పట్టేలా కనిపిస్తున్నాయి.
ఇటు కొండా కుటుంబానికి ఇంతకాలం వ్యతిరేకంగా ఉన్నవాళ్లు.. తమకూ మంచి రోజులొస్తాయనే ఆశతో ఉన్నారు. కొత్త పదవులు, రాజకీయ అవకాశాలపై ఆశలు పెట్టుకున్న కొందరు నేతలు ఇప్పటికే పార్టీ పెద్దలను కలిసేందుకు సిద్ధమవుతున్నారన్న చర్చ కూడా మొదలైంది. దీంతో వరంగల్ కాంగ్రెస్‌లో ఎవరు ఎటు వెళ్తారు? ఎవరికి కొత్త అవకాశాలు దక్కుతాయి? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: విపక్షాలకు కొత్త అస్త్రం అందించిన రేవంత్!


