మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ | Indiramma Sarees Distribution | Sakshi
Sakshi News home page

మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

Sep 4 2026 11:27 AM | Updated on Sep 4 2026 11:55 AM

Indiramma Sarees Distribution

ఖమ్మం: రాష్ట్రప్రభుత్వం మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలతో పాటు స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు ఉచితంగా అందజేసే ఈ చీరలు ఇప్పటికే జిల్లాకు చేరుతున్నాయి. జిల్లాకు మొత్తం 3,22,255 చీరలు కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 1,46,711 చీరలు చేరడంతో మండల కేంద్రాల్లోని సమాఖ్య కార్యాలయాల్లో భద్రపరిచారు. 

పాలేరుకు అధికం..
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని మండలాల వారీగా స్టాక్‌ పాయింట్లకు విడతల వారీగా చీరలు చేరవేస్తోంది. ఇప్పటివరకు అందిన గణాంకాల ప్రకారం జిల్లాలోనే అత్యధికంగా పాలేరు నియోజకవర్గానికి 61,523 చీరలు చేరాయి. ఇందులో ఖమ్మం రూరల్‌ మండలానికి 13,287, కూసుమంచికి 17,117, నేలకొండపలి్లకి 15,653, తిరుమలాయపాలెం మండలానికి 15,466 చీరలు కేటాయించారు. మధిర నియోజకర్గానికి మొత్తం 35,183 చీరలు రాగా ఇందులో చింతకాని మండలానికి 16,020, ముదిగొండ మండలానికి 19,163 చీరలు చేరుకున్నాయి. మరో విడతలో బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాలకు చీరలు రానున్నాయి. ఖమ్మం నియోజకవర్గంలో రఘునాథపాలెం మండలానికి 21,063 చీరలు, ఇల్లెందు నియోజకవర్గంలోని కామేపల్లి మండలానికి 14,966 చీరలు, వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలానికి 13,976 చీరలు చేరాయి. వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని మిగిలిన మండలాలతో పాటు కేఎంసీ, ఇతర మున్సిపాలిటీలకు సంబంధించి తదుపరి విడతలో చీరలు రానున్నాయి.

ఈసారి చిలుకపచ్చ శోభ..
గతంలో ప్రభుత్వం మొదటి విడత కింద తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా పాలపిట్ట రంగు చీరలను అందజేసింది. ఈ దఫా మహిళల అభిరుచులకు అనుగుణంగా ఎరుపు రంగు అంచుతో మెరిసిపోయే చిలుకపచ్చ రంగు చీరలను రూపొందించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించినట్లు నాణ్యమైన, ఆధునిక డిజైన్లతో కూడిన చీరలను టెస్కో ద్వారా చేనేత కార్మికులతో తయారు చేయించి జిల్లాకు సరఫరా చేరుతున్నాయని అధికారులు తెలిపారు.

పంపిణీకి సర్వం సిద్ధం..
మండలాల వారీగా గోదాములకు చేరిన చీరలను భద్రపరిచినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ప్రకటన వచ్చిన వెంటనే ఇందిరా మహిళా శక్తి ద్వారా ఎస్‌హెచ్‌జీ ప్రతినిధులు, గ్రామ పంచాయతీ అధికారుల భాగస్వామ్యంతో గ్రామాలు, వార్డుల వారీగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అర్హులైన ప్రతీ మహిళకు ఈ పండగ కానుక అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అధికారులు పేర్కొన్నారు. 

చదవండి: ‘ఒక పదవి పోతే.. మరో పదవి వెతుక్కుంటూ వచ్చింది’


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement