సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ హయాంలో చేపట్టింది మెగా డీఎస్సీ కాదని, యువగళం డీఎస్సీ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేసిన పాపాలను ఎల్లకాలం దాచిపెట్టలేరని, రోజుకో నిజం బయటపడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో వెలుగులోకి వస్తున్న డీఎస్సీ అక్రమాలపై శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్‌సీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న తమ అనుచరులకు, కార్యకర్తలకే స్పోర్ట్స్ కోటా పేరిట అక్రమంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టారు. కనీసం టెట్ అర్హత సాధించని వారికి, తక్కువ మార్కులు వచ్చిన వారికి కూడా ఉద్యోగాలు ఎలా కట్టబెట్టారో మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నిబంధనను కఠినంగా వర్తింపజేస్తూ, తమ యువగళం టీచర్లకు మాత్రం ఎలాంటి అర్హతలూ లేకపోయినా మినహాయింపు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.
కర్నూలు జిల్లాలో ప్రారంభమైన ఈ అక్రమాల డొంక ఇప్పుడు రాష్ట్రంలోని మిగతా జిల్లాలకూ విస్తరిస్తోంది. కౌతాళం మండలంలోనే ఏకంగా 24 మంది, ఒకే చోట ఐదుగురు స్పోర్ట్స్ కోటా టీచర్లు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఆదరణ లేని జూడో ఆట పేరుతో నకిలీ సర్టిఫికేట్లు సృష్టించి దాదాపు 30 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే చిత్తూరు జిల్లాలో కేవలం 79 మార్కులు వచ్చిన వారికి, తూర్పు గోదావరి జిల్లాలో అసలు అర్హతే లేని వారికి నియామకాలు చేపట్టారు. ఇటువంటి ఉపాధ్యాయులు రేపటి తరం పిల్లలకు ఏం పాఠాలు చెబుతారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) పూర్తిగా అవినీతి అడ్డాగా మారింది. క్రీడా సర్టిఫికేట్లను కనీసం వెరిఫికేషన్ చేయకుండా నియామకాలు ఎలా పూర్తి చేస్తారని పేర్ని నాని మండిపడ్డారు.
చంద్రబాబు, లోకేష్‌లకు ధైర్యముంటే స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన టీచర్ల జాబితాను, వారి సర్టిఫికేట్లను వెంటనే బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు. మెగా డీఎస్సీలో జరిగిన ఈ భారీ కుంభకోణంపై ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని, ఈ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం మరో డీఎస్సీ అంటూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


