కువైట్‌లో వైఎస్సార్ చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
కడప: ఎడారి దేశాలైన కువైట్, దుబాయ్, ఖతార్, బహరైన్, సౌదీ అరేబియా, జుబైల్, ఒమన్ (మస్కట్)లలో దివంగత సీఎం డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్సార్ చేసిన సేవలను కొనియాడారు. కువైట్‌లో వైఎస్సార్‌సీపీ కువైట్ కమిటీ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ఆధ్వర్యంలో మాలియా ప్రాంతంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలిరెడ్డి మాట్లాడుతూ.. భూమి, ఆకాశం.. సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలుగు ప్రజల హృదయాల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శాశ్వతంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కువైట్ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సౌదీఅరేబియాలోని జుబైల్‌లో వైఎస్సార్‌కు నివాళులు అర్పిస్తున్న వైఎస్సార్‌సీపీ అభిమానులు
దుబాయ్ (యూఏఈ)లోని సోనాపూర్‌లో గల్ఫ్ కో–కన్వీనర్ మహమ్మద్ జిలాన్ బాషా ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సుధాకర్‌రెడ్డి, ప్రసన్న సోమిరెడ్డిల సమక్షంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలుచేసిన ఘనత వైఎస్సార్‌దేనని కొనియాడారు.
ఖతార్ దేశంలో పితాని శ్రీను విల్లాలో వైఎస్సార్ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖతార్ కన్వీనర్ జాఫర్ హుస్సేన్ గల్ఫ్ కో–కన్వీనర్ దొండపాటి శశికిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు
అర్పించారు.
ఇక బహరైన్‌లోని అంబేడ్కర్ క్లబ్‌లో వైఎస్సార్‌సీపీ కన్వీనర్ ఓర్సు నాగరాజు, బహరైన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ కృషిచేశారని తెలిపారు.
దుబాయ్‌లో వైఎస్సార్‌కు నివాళులు అర్పిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
సౌదీ అరేబియా (జుబైల్)లో కూడా వైఎస్సార్ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ కన్వీనర్ షేక్ ఇలాహి నివాళులు అర్పించారు.
ఒమన్ (మస్కట్)లో వైఎస్సార్‌సీపీ కన్వీనర్ భాస్కర్.. ఒమన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహానేత వర్థంతిని నిర్వహించారు. వైఎస్సార్ చేసిన సంక్షేమ పథకాలను గుర్తుచేసుకున్నారు.


