డాలస్, టెక్సస్: తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెలుగు’ కార్యక్రమంలో భాగంగా 95వ అంతర్జాల సమావేశం ‘తెలుగే మన వెలుగు’ అనే అంశంపై నిర్వహించారు. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు తెలుగు భాష పరిరక్షణ, అభివృద్ధిపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. తెలుగు భాష పరిరక్షణ, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. త్వరలో సలహా కమిటీ ఏర్పాటు చేసి భాషాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని తెలిపారు. తెలుగు భాషకు విశేష సేవలందించిన ప్రముఖుల జ్ఞాపకాలను భావితరాలకు అందించేందుకు విగ్రహాలు, స్మారక చిహ్నాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ఆంగ్ల భాష ప్రాధాన్యతను గుర్తిస్తూనే మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వ పరిపాలనలో తెలుగును విస్తృతంగా ఉపయోగించాలని, ఆంగ్లంలో వెలువడే ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే తెలుగులోకి అనువదించాలని సూచించారు. కనీసం ఐదో తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన జరిగితే పిల్లలకు భాషపై మంచి పట్టు ఏర్పడుతుందని అన్నారు.
ఆచార్య శలాక రఘునాథ శర్మ మాట్లాడుతూ.. ఇతర భాషల పదాలను సులభంగా తనలో కలుపుకునే ప్రత్యేకత తెలుగు భాషకు ఉందన్నారు. తెలుగు భాష వైభవాన్ని అనేక మంది ప్రముఖులు ప్రశంసించారని, భాషను విస్తరించడంలో నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు మాట్లాడుతూ.. తెలుగు భాష, సంస్కృతుల అభివృద్ధికి కృషి చేస్తున్న వారికి ప్రతి సంవత్సరం తెలుగు భాషా, కళారత్న పురస్కారాలు అందిస్తున్నామని తెలిపారు. గిడుగు రామమూర్తి మునిమనుమరాలు గిడుగు లక్ష్మీకాంతికృష్ణ మాట్లాడుతూ తన ముత్తాత ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని గ్రాంథిక భాష స్థానంలో వ్యవహారిక భాషకు ప్రాధాన్యం తీసుకొచ్చారని గుర్తుచేశారు.
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు మాడభూషి సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. తెలుగుకు ప్రాచీన భాష హోదా వచ్చినప్పటికీ కేంద్రం నుంచి తగిన నిధులు సాధించడంలో మరింత కృషి అవసరమన్నారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య కార్యదర్శి గుంటుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లలకు తెలుగు నేర్పేందుకు ఆధునిక పద్ధతులను ఉపయోగించాలని సూచించారు. కేవలం మార్కులకే పరిమితం కాకుండా విద్యార్థులకు భాష ఎంతవరకు అర్థమవుతోందో చూడాలని అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ రమేశ్ కందుల మాట్లాడుతూ.. కాలానుగుణంగా తెలుగు భాషలో మార్పులు వస్తున్నాయని, అందరూ కలిసి భాషకు పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, విజయవంతం చేసేందుకు సహకరించిన వారందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి: అమెరికాలో ఘనంగా మనబడి తెలుగుకు పరుగు రన్4తెలుగు 2026


