90 ఏళ్ల వయసులో మాతృదేశానికి పయనం.. డాలస్‌లో ఘన సత్కారం! | 90 Year Old Bhanumathi Ivaturi Honoured In Dallas | Sakshi
Sakshi News home page

90 ఏళ్ల వయసులో మాతృదేశానికి పయనం.. డాలస్‌లో ఘన సత్కారం!

Aug 30 2026 12:32 PM | Updated on Aug 30 2026 12:37 PM

90 Year Old Bhanumathi Ivaturi Honoured In Dallas

డాలస్, టెక్సస్: అనేక దశాబ్దాలుగా పార్క్‌ల్యాండ్ హాస్పిటల్, డాలస్ కౌంటీ ఫ్యామిలీ కోర్ట్ సర్వీసెస్, డాలస్ కౌంటీ చైల్డ్ వెల్ఫేర్ తదితర సంస్థల ద్వారా ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, బాలల సంక్షేమం, కుటుంబ న్యాయస్థాన సేవలు, గృహహింస, వృద్ధుల సంక్షేమం, డయాలసిస్ సేవలు వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష సేవలందించిన ప్రముఖ సామాజిక సేవకురాలు డా. భానుమతి ఇవటూరికి డాలస్‌లో ఘన సత్కారం లభించింది. 90 ఏళ్ల వయస్సులో అమెరికాలో 50 సంవత్సరాలకు పైగా జీవితం గడిపిన ఆమె ఇకపై మాతృదేశంలో జీవించేందుకు పయనమవుతున్న సందర్భంగా ఈ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.

ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (IANT) పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, షబ్నం మాడ్గిల్, తైయాబ్ కుండావాల, సుష్మా మల్హోత్రా, సత్యన్ కళ్యాణ్ దుర్గ్; తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ (TANTEX) అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి, పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, శ్రీధర్ కోడెల, డా. నరసింహారెడ్డి ఊరిమిండి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు, రామకృష్ణ నూనె; అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఉత్తరాధ్యక్షులు సతీష్ రెడ్డి; నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ (NATS) పూర్వాధ్యక్షులు బాపు నూతి; తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, TANA బోర్డు పూర్వ కార్యదర్శి మురళి వెన్నం; కమ్యూనిటీ నాయకులు ఎం.వి.ఎల్. ప్రసాద్, రావు కల్వల, డా. జగదీశ్వరన్ పుడూర్ తదితరులు డా. భానుమతి ఇవటూరిని జీవిత సాఫల్య పురస్కారంతో ఘనంగా సన్మానించారు.

సభాధ్యక్షత వహించిన డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “సమస్యకు–పరిష్కారానికి మధ్య, వివాదానికి–అవగాహనకు మధ్య, గందరగోళానికి–స్పష్టతకు మధ్య, నిరాశకు–ఆశకు మధ్య డా. భానుమతి ఒక వెలుగుదారిగా నిలిచారు. అమెరికాలో కొత్త జీవితాన్ని నిర్మించుకోవడం అంత సులభమైన విషయం కాదు. తల్లిదండ్రులు తమతో పాటు మాతృభూమి విలువలు, సంప్రదాయాలు, ఆశలు, ఆకాంక్షలను తీసుకువస్తారు. అయితే వారి పిల్లలు మాత్రం పూర్తిగా భిన్నమైన సాంస్కృతిక వాతావరణంలో పెరుగుతారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, పిల్లలపై ఉన్న ఆశలు అపార్థాలకు, చివరకు కుటుంబ కలహాలకు దారితీస్తాయి. ఈ సమస్యను ఎంతో లోతుగా అర్థం చేసుకున్న భానుమతి.. తల్లిదండ్రుల ఆశలు, అంచనాల కారణంగా పిల్లలనే దూరం చేసుకునే పరిస్థితి రాకూడదని చెబుతారు” అన్నారు.

“జీవితంలో విజయం అంటే కేవలం డిగ్రీలు, పదవులు, బిరుదులు కాదు. మన వల్ల ఎన్ని కుటుంబాలకు సహాయం అందింది, ఎంతమంది జీవితాలు మెరుగుపడ్డాయి అనేదే నిజమైన విజయానికి కొలమానం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ డా. భానుమతి ఇవటూరి జీవితం. 50 సంవత్సరాలకు పైగా అమెరికాలో జీవితం గడిపి, తొమ్మిది పదులు దాటిన వయస్సులో మాతృదేశంలో తన భవిష్యత్ జీవితాన్ని గడపాలనుకోవడం హర్షనీయమైన విషయం. ఆమె మిగిలిన జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపాలని అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని డా. ప్రసాద్ తోటకూర అన్నారు.

వివిధ సందర్భాల్లో డా. భానుమతి ఇవటూరితో సన్నిహితంగా పనిచేసిన ఎం.వి.ఎల్. ప్రసాద్, రావు కల్వల, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, డా. కృష్ణబాబు చుండూరి, డా. కిశోర్ సుంకర, రాధికా కోడెల, రామకృష్ణ నూనె, డోరిస్ మార్షల్, స్యూ యాన్ రూత్, అవ్యం రమణి తదితరులు భానుమతి సామాజిక సేవలను కొనియాడారు.

డా. భానుమతి ఇవటూరి మాట్లాడుతూ.. “అతి తక్కువ సమయంలో, వారాంతం కానప్పటికీ, ఇర్వింగ్‌లోని మైత్రీ ఇండియన్ రెస్టారెంట్‌లో నిర్వహించిన ఈ ఆత్మీయ సమావేశానికి దాదాపు వంద మందికి పైగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ, నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు నా జీవితంలో ఒక మధురమైన రోజుగా మిగిలిపోతుంది. నా సుదీర్ఘ సామాజిక సేవా ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు” అని అన్నారు.

ఇవీ చదవండి: 8 ఏళ్లకే చెస్‌లో సంచలనం.. 9/9 గెలిచిన తెలుగు బాలిక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement