breaking news
achievement award
-
90 ఏళ్ల వయసులో మాతృదేశానికి పయనం.. డాలస్‌లో ఘన సత్కారం!
డాలస్, టెక్సస్: అనేక దశాబ్దాలుగా పార్క్‌ల్యాండ్ హాస్పిటల్, డాలస్ కౌంటీ ఫ్యామిలీ కోర్ట్ సర్వీసెస్, డాలస్ కౌంటీ చైల్డ్ వెల్ఫేర్ తదితర సంస్థల ద్వారా ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, బాలల సంక్షేమం, కుటుంబ న్యాయస్థాన సేవలు, గృహహింస, వృద్ధుల సంక్షేమం, డయాలసిస్ సేవలు వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష సేవలందించిన ప్రముఖ సామాజిక సేవకురాలు డా. భానుమతి ఇవటూరికి డాలస్‌లో ఘన సత్కారం లభించింది. 90 ఏళ్ల వయస్సులో అమెరికాలో 50 సంవత్సరాలకు పైగా జీవితం గడిపిన ఆమె ఇకపై మాతృదేశంలో జీవించేందుకు పయనమవుతున్న సందర్భంగా ఈ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (IANT) పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, షబ్నం మాడ్గిల్, తైయాబ్ కుండావాల, సుష్మా మల్హోత్రా, సత్యన్ కళ్యాణ్ దుర్గ్; తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ (TANTEX) అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి, పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, శ్రీధర్ కోడెల, డా. నరసింహారెడ్డి ఊరిమిండి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు, రామకృష్ణ నూనె; అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఉత్తరాధ్యక్షులు సతీష్ రెడ్డి; నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ (NATS) పూర్వాధ్యక్షులు బాపు నూతి; తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, TANA బోర్డు పూర్వ కార్యదర్శి మురళి వెన్నం; కమ్యూనిటీ నాయకులు ఎం.వి.ఎల్. ప్రసాద్, రావు కల్వల, డా. జగదీశ్వరన్ పుడూర్ తదితరులు డా. భానుమతి ఇవటూరిని జీవిత సాఫల్య పురస్కారంతో ఘనంగా సన్మానించారు.సభాధ్యక్షత వహించిన డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “సమస్యకు–పరిష్కారానికి మధ్య, వివాదానికి–అవగాహనకు మధ్య, గందరగోళానికి–స్పష్టతకు మధ్య, నిరాశకు–ఆశకు మధ్య డా. భానుమతి ఒక వెలుగుదారిగా నిలిచారు. అమెరికాలో కొత్త జీవితాన్ని నిర్మించుకోవడం అంత సులభమైన విషయం కాదు. తల్లిదండ్రులు తమతో పాటు మాతృభూమి విలువలు, సంప్రదాయాలు, ఆశలు, ఆకాంక్షలను తీసుకువస్తారు. అయితే వారి పిల్లలు మాత్రం పూర్తిగా భిన్నమైన సాంస్కృతిక వాతావరణంలో పెరుగుతారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, పిల్లలపై ఉన్న ఆశలు అపార్థాలకు, చివరకు కుటుంబ కలహాలకు దారితీస్తాయి. ఈ సమస్యను ఎంతో లోతుగా అర్థం చేసుకున్న భానుమతి.. తల్లిదండ్రుల ఆశలు, అంచనాల కారణంగా పిల్లలనే దూరం చేసుకునే పరిస్థితి రాకూడదని చెబుతారు” అన్నారు.“జీవితంలో విజయం అంటే కేవలం డిగ్రీలు, పదవులు, బిరుదులు కాదు. మన వల్ల ఎన్ని కుటుంబాలకు సహాయం అందింది, ఎంతమంది జీవితాలు మెరుగుపడ్డాయి అనేదే నిజమైన విజయానికి కొలమానం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ డా. భానుమతి ఇవటూరి జీవితం. 50 సంవత్సరాలకు పైగా అమెరికాలో జీవితం గడిపి, తొమ్మిది పదులు దాటిన వయస్సులో మాతృదేశంలో తన భవిష్యత్ జీవితాన్ని గడపాలనుకోవడం హర్షనీయమైన విషయం. ఆమె మిగిలిన జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపాలని అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని డా. ప్రసాద్ తోటకూర అన్నారు.వివిధ సందర్భాల్లో డా. భానుమతి ఇవటూరితో సన్నిహితంగా పనిచేసిన ఎం.వి.ఎల్. ప్రసాద్, రావు కల్వల, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, డా. కృష్ణబాబు చుండూరి, డా. కిశోర్ సుంకర, రాధికా కోడెల, రామకృష్ణ నూనె, డోరిస్ మార్షల్, స్యూ యాన్ రూత్, అవ్యం రమణి తదితరులు భానుమతి సామాజిక సేవలను కొనియాడారు.డా. భానుమతి ఇవటూరి మాట్లాడుతూ.. “అతి తక్కువ సమయంలో, వారాంతం కానప్పటికీ, ఇర్వింగ్‌లోని మైత్రీ ఇండియన్ రెస్టారెంట్లో నిర్వహించిన ఈ ఆత్మీయ సమావేశానికి దాదాపు వంద మందికి పైగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ, నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు నా జీవితంలో ఒక మధురమైన రోజుగా మిగిలిపోతుంది. నా సుదీర్ఘ సామాజిక సేవా ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు” అని అన్నారు.ఇవీ చదవండి: 8 ఏళ్లకే చెస్‌లో సంచలనం.. 9/9 గెలిచిన తెలుగు బాలిక! -
అగ్రరాజ్యంలో తెలుగు తేజం
తెనాలి: అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత విద్యకు విశేష కృషి చేసినందుకు ఇమ్మిగ్రెంట్ అచీవ్మెంట్ అవార్డ్ అందుకున్నారు గుంటూరుకు చెందిన తెలుగు మహిళ నీలి బెండపూడి (59). అమెరికాలోని ప్రతిష్టాత్మక పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ అధ్యక్షురాలిగా నియమితులైన తొలి మహిళ నీలి బెండపూడి గత నెలలో భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆయనతో సమావేశమైన వ్యక్తిగా వార్తల్లోకి వచ్చారు. భారతదేశంలోని గొప్ప విద్యాలయాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రెండు దేశాలకు అవసరమైన సిఫార్సులను చేసే కోచర్‌గా ఆమె నియమితులయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన ప్రొఫెసర్ నీలి విశాఖపట్నంలో చదువుకున్నారు. అక్కడినుంచే అమెరికా వెళ్లారు. ఆమె జీవిత విశేషాల్లో విశాఖ వాసిగానే పేర్కొంటున్నారు. నిజానికి ప్రొఫెసర్ నీలి గుంటూరులో జన్మించారు. తల్లి దత్తావఝుల పద్మ, తండ్రి రమేష్. ఇద్దరూ ఆంధ్రా యూనివర్సిటీలో పనిచేశారు. ఈ కారణంగా నీలి బీఏ, ఎంబీఏ వరకు చదువు మొత్తం అక్కడే సాగింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. ఉన్నత చదువుల కోసం 1986లో నీలి బెండపూడి అమెరికా వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్‌లో మార్కెటింగ్‌లో పీహెచ్డీ చేశారు. అకడమిక్ అడ్మినిస్ట్రేటర్‌గా నైపుణ్యం సాధించి.. తాను విద్య అభ్యసించిన కాన్సాస్ యూని వర్సిటీలో ప్రొవోస్ట్, ఎగ్జిక్యూటివ్ వైస్ చాన్సలర్, స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్‌తో సహా అనేక అడ్మినిస్ట్రేటివ్ హోదాల్లో సేవలందించారు. ఓహియో స్టేట్ యూనివర్సిటీలో ఇనీషి యేటివ్ ఫర్ మేనేజింగ్ సర్వీసెస్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా పనిచేశారు. అంతకుముందు హంటింగ్టన్ నేషనల్ బ్యాంక్‌కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ కస్టమర్ ఆఫీ సర్గానూ విధులు నిర్వర్తించారు. అకాడమీ ఆఫ్ మార్కె టింగ్, అత్యుత్తమ మార్కెటింగ్ టీచర్ అవార్డుతో సహా అనేక జాతీయ అవార్డులను అందుకున్నారు. 2018–21లో కెంటకీలోని లూయిస్విల్లే యూనివర్సిటీకి 18వ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 2022 మే 10న పెన్సిల్వేనియా స్టేట్ వర్సిటీ 19వ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఎన్నికైన తొలి మహిళగా గుర్తింపు పొందారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రతిష్టాత్మక ‘ఇమ్మిగ్రెంట్ ఎచీవ్మెంట్’ అవార్డు అందుకు న్నారు. ప్రొఫెసర్ నీలి బెండపూడిని భారత్‌లోని ప్రముఖ వర్సిటీల్లో పరిశోధనను మెరుగుపరచి ఉన్నత స్థాయిలో నిలబెట్టేలా 2 దేశాల మధ్య ఆరంభమైన కార్యక్రమానికి అవసరమైన సిఫార్సులను ప్రొఫెసర్ నీలి చేశారు. ఇందుకోసం ఆమె కోచర్‌గా నియమితులయ్యారు. -
పాస్‌పోర్ట్ ఉద్యోగినికి ప్రతిభా అవార్డు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న పాలెపోగు విజయలక్ష్మి విదేశీ మంత్రిత్వ శాఖ ఇచ్చే ప్రతిభా అవార్డుకు ఎంపికయ్యారు. 2014-15 సంవత్సరానికి ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ఇచ్చే అవార్డుకు ఈమెను ఎంపిక చేశారు. ఈ నెల 26న ఢిల్లీలో జరిగే ‘పాస్‌పోర్ట్ దివస్’ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకుంటారు. గత ఏడాది విజయలక్ష్మి 78,781 పాస్‌పోర్టులు పరిశీలించి, 76,857 మంజూరు చేశారు. అంతేగాకుండా 1,924 పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్(పీసీసీ)లను పరిశీలించి, మంజూరు చేశారని పాస్‌పోర్ట్ ప్రాంతీయ అధికారి అశ్వినీ సత్తారు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.


