వరంగల్ క్రైం : ‘వై 99’ యాప్‌లో మహిళగా పరిచయం చేసుకుని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను హనీ ట్రాప్ చేసి రూ.14.75 లక్షలు మోసం చేసిన నిందితుడిని వరంగల్ సైబర్ క్రైం పోలీసులు తమిళనాడులోని సేలం జిల్లాలో అరెస్ట్ చేశారు. సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో నమోదైన సీఆర్ నెం.21/2026 కేసులో వరంగల్‌కు చెందిన తుమ్మ ఉదయ్ కిరణ్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో నిందితుడు ‘వై 99’ వెబ్‌సైట్‌లో ‘లావణ్య’ పేరుతో మహిళగా నటిస్తూ బాధితుడితో పరిచయం పెంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం సన్నిహితంగా మెలుగుతూ నమ్మకం పొందిన నిందితుడు అత్యవసర అవసరాల నిమిత్తం పలుమార్లు డబ్బులు బదిలీ చేయించుకున్నట్లు వెల్లడైంది. వివిధ బ్యాంకు ఖాతాలు,యూపీఐ లావాదేవీల ద్వారా బాధితుడి నుంచి మొత్తం రూ.14,75,100 మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది.
దీంతో సాంకేతిక, ఆర్థిక ఆధారాలతో నిందితుడిని గుర్తించిన ప్రత్యేక బృందం సేలం జిల్లాలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ఆదేశాల మేరకు, వరంగల్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో ఈ దర్యాప్తు కొనసాగింది. సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ కె. అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది బి. శివకృష్ణ, దినేశ్, భరత్, జహూర్ మొహమ్మద్.. నిందితుడి అరెస్ట్‌లో కీలకంగా వ్యవహరించారు.
ఆన్‌లైన్ పరిచయాలపై అప్రమత్తంగా ఉండాలి
ఆన్‌లైన్‌లో పరిచయమైన వారు డబ్బులు అడిగితే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ క్రైం హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
చదవండి: మినిమం చార్జీ రూ.30


