సురేఖ ఎపిసోడ్‌.. కాంగ్రెస్‌లో రేవంత్‌ బలపరీక్ష నెగ్గినట్టేనా? | KSR Comments On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

సురేఖ ఎపిసోడ్‌.. కాంగ్రెస్‌లో రేవంత్‌ బలపరీక్ష నెగ్గినట్టేనా?

Sep 7 2026 12:50 PM | Updated on Sep 7 2026 1:19 PM

KSR Comments On CM Revanth Reddy

రాజకీయాలలో సరైన వ్యూహం లేకుండా పోతే ఏం జరుగుతుందో చెప్పడానికి కొండా సురేఖ మంత్రి పదవి కోల్పోయిన తీరు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ మొత్తం ఉదంతంలో ఆమె రాజకీయంగా నష్టపోయారు. అదే టైమ్‌లో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ప్రతిష్టను కొంతవరకు దెబ్బతీశారు. విపక్షాలకు ఆమె కొన్ని ఆయుధాలు అందించారు. మరోవైపు  రేవంత్ రెడ్డి తనకు పార్టీలో పట్టు ఉందని నిరూపించడానికి శ్రమించాల్సి వచ్చింది.

కొండా సురేఖతో గత కొన్ని నెలలుగా రేవంత్‌కు కారణం ఏమైనా విభేదాలు ఏర్పడ్డాయి. అయినా ఆమెను మంత్రిగా కొనసాగించవలసి వచ్చింది. కాంగ్రెస్ అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసి తనను పదవి నుంచి తప్పించారని సురేఖ ఆరోపిస్తున్నారు. అందులో నిజం ఉందా, లేదా అన్నది పక్కనబెడితే దాదాపు రెండువారాల పాటు సాగిన ఈ డ్రామా వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పరపతి కొంత దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అనే డైలాగులకు ఈ ఎపిసోడ్ ద్వారా ప్రాధాన్యత ఏర్పడింది. రేవంత్ టీడీపీ వాసన వదలుకోలేకపోతున్నారన్న భావన పలువురిలో ఉంది. కాకపోతే పైకి అనడం లేదు.

సురేఖ, ఆమె భర్త మురళీ ఉమ్మడి వరంగల్ రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తూ వచ్చారు. అందువల్లే ఆయా పార్టీలు వారిని ఆదరించక తప్పలేదు. అంతవరకు ఓకే కాని కొండా దంపతులు దానిని సద్వినియోగం చేసుకోవడంలో సఫలం కాలేకపోతున్నారు. 1999లో తొలిసారి శాసనసభకు ఎన్నికైనప్పటి నుంచి ఇంతవరకు వారిది ఘర్షణాత్మక రాజకీయమే. ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డితో తప్ప, ఆయా పార్టీల నేతలు పలువురితో గొడవలు ఉండేవి. రెండున్నర దశాబ్దాల తర్వాత, లక్కీగా మంత్రి అయిన తర్వాత కూడా జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలతో సఖ్యత లేకపోవడం పెద్ద మైనస్‌గా కనిపిస్తుంది. పోనీ రాష్ట్ర స్థాయిలో ఎవరితోనైనా అవగాహనతో ఉన్నారా అంటే అదీ కనిపించదు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తేడా వచ్చాక, తెలివిగా వేరే ముఖ్యమైన నేతలు, మంత్రుల మద్దతు పొందే యత్నం చేయాలి. కాని వీరు రేవంత్ సోదరులపైన, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తదితర నేతలు పలువురిపైన ఆరోపణలు గుప్పించారు. దాంతో ఈమెకు అండగా నిలవడానికి ఎవరూ ధైర్యం చేయలేకపోయారనిపిస్తుంది. గతంలో కూడా వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్‌లో ఏర్పడిన పరిణామాలలో తొలుత వైఎస్సార్‌ కుమారుడు జగన్‌కు మద్దతుగా ఉన్నా, తదుపరి ఆ పార్టీకి దూరం అయ్యారు. 

ఆ క్రమంలో అనవసర విమర్శలు చేశారు. రోశయ్య క్యాబినెట్‌లో మంత్రిగా ఉంటూ ఆయనను వ్యతిరేకించారు. నిజానికి అప్పట్లో రఘువీరారెడ్డి వంటి వారు కూడా రోశయ్య క్యాబినెట్ లో చేరడానికే ఇష్టపడలేదు. కాని తదుపరి సర్దుకుపోయారు. కొండా సురేఖ మాత్రం అలా వ్యూహాత్మకంగా చేయలేకపోయారు. తదుపరి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినా, మళ్లీ అక్కడే గొడవే అయింది. కేసీఆర్ పైనా విమర్శలు  గుప్పించారు. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరి ఎమ్మెల్యే, మంత్రి అవ్వడం విశేషమే. 

రేవంత్‌తో మొదట సత్సంబంధాలు ఉన్నా, కారణం ఏమిటో కాని తేడా వచ్చింది. ఈమె భర్త కొండా మురళీకి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్న అసంతృప్తి ఉండవచ్చు. ఇంకేదైనా కావచ్చు. పరకాలలో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి తిరిగి టిక్కెట్ ఇస్తామని రేవంత్ ప్రకటించడం వీరికి ఆగ్రహం తెప్పించింది. కొండా కుమార్తె సుస్మిత దానిపై ఒక సభలో తీవ్రమైన భాషలో ప్రసంగం చేయడం, రేవంత్‌పై ఆరోపణలు గుప్పించడం కలకలం రేపింది. దానికి ముందు ఒఎస్డి కేసులో మంత్రి ఇంటిని సోదా చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు కూడా ఈమె పరుష వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఎలాగో రాజీ చేశారు. కాని ఈసారి రేవంత్ సీరియస్‌గా తీసుకున్నారు.

నిజానికి తన కుమార్తె సీఎంపై ఆరోపణలు చేస్తున్నప్పుడు వెంటనే సురేఖ నిలువరించి ఉండాల్సింది. లేదా ఆ వెంటనే ఖండించి ఉండాల్సింది. ఎందువల్లో సురేఖ ఆ పని చేయలేదు. దాంతో వివాదం ముదిరింది. ఎంత కాదన్నా ముఖ్యమంత్రికి ఉండే పవర్ వేరు. ఆమె తన మంత్రిత్వ శాఖలో జోక్యం చేసుకుంటున్నారని, ఇతరత్రా విమర్శలు చేసినా, ప్రయోజనం ఉండదు. క్రమశిక్షణ కమిటీ నోటీసు ఇచ్చినప్పుడు సారీ చెబితే అయిపోయేదానికి మంత్రి పదవి పోయేవరకు తెచ్చుకున్నారనిపిస్తుంది. ఏఐసీసీకి ఇచ్చిన లేఖ బయటపెట్టినా పెద్దగా ప్రకంపన ఏమీ రాలేదు.

బహుశా ఆమె భర్త మురళీ ఆమె రాజకీయ ఎదుగలకు, అలాగే పతనానికి కూడా కారణమా అన్న విశ్లేషణ వస్తుంది. దానికి తగినట్లే మురళీ ఇంత జరిగిన తర్వాత మీడియాకు కనిపించేలా మీసం మెలి తిప్పుతూ కన్పించారు. అంటే జనంలో తనకు అంత పట్టు ఉందని చెప్పదలిచి ఉండవచ్చు. కాని వర్తమాన రాజకీయాలలో ఎన్నికలు వచ్చేవరకు అధికారంలో ఉన్నవారిదే పెత్తనం అవుతుంది. ఇవన్ని వారికి అనుభవమే అయినా, ఏ ధైర్యంతో ఇలా చేశారో తెలియదు. వారి ప్లాన్ బి ఏమిటో ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతామని సురేఖ ప్రకటించడం కాస్త తెలివైన చర్యగానే కనిపిస్తుంది. సమయం మించిపోయాక రక్షాబంధన్ రాఖీని రేవంత్‌కు కట్టినా ప్రయోజనం కలగలేదనుకోవాలి.

ఇక రేవంత్ వైపు చూస్తే సురేఖ ఇష్యూ మొదలు కాగానే పదవి నుంచి తప్పించి ఉంటే ఆయన పవర్ పుల్ గా ఉన్నారన్న అభిప్రాయం కలిగేది. సురేఖపై కొంతమంది ఎమ్మెల్యేలతో విమర్శలు చేయించడంతో పార్టీలో వివాదాలు రచ్చకెక్కినట్లయింది. అధిష్టానం వద్దే పంచాయతీ జరగడం, ఆ పైన మరికొన్ని రోజులు జాప్యం జరగడంతో రేవంత్ కూడా అధిష్టానం చెప్పినట్లు వినాల్సిందేనన్న అభిప్రాయం కలుగుతుంది. అందువల్లే రేవంత్ హైకమాండ్‌ను బ్లాక్ మెయిల్ చేశారని సురేఖ ఆరోపించగలిగారు. రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. సురేఖ రాఖీ కట్టిన తర్వాత రాజీ కుదిరిందేమోనని అనుకున్నారు. కాని రేవంత్ అందుకు సిద్దపడలేదన్నమాట.

బీసీ వర్గానికి చెందిన మహిళ సురేఖను పదవినుంచి తప్పించడంపై ఎలాంటి ప్రభావం పడుతుందో అన్నదానిపై అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే తుది నిర్ణయం జరిగి ఉంటుంది. ఈ వివాదం తొలుత రేవంత్ వ్యాఖ్యలతోనే ఆరంభమైన సంగతిని కూడా కాంగ్రెస్ క్యాడర్ గుర్తించి ఉంటారు. గతంలో పవర్ ఫుల్ ముఖ్యమంత్రులన్న పేరున్న వైఎస్ రాజశేఖరరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటివారు సైతం బహిరంగంగా ఇలాంటి ప్రకటనలు చేసేవారుకాదు. మరో బలమైన నేత చెన్నారెడ్డి అధిష్టానాన్ని ధిక్కరించి పదవి కోల్పోయారు. అయితే ఆయన సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు చెందిన ఒక మంత్రి విమర్శలు చేసిన వెంటనే పదవి నుంచి తప్పించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాటికొండ రాజయ్య, ఈటెల రాజేందర్ లను బర్తరఫ్ చేశారు.

కాగా తాను ఎవరికి భయపడనని, స్నేహంగా అడిగితే అన్నీ చేసి పెడతానని రేవంత్ అంటున్నారు. ఇది అచ్చంగా గతంలో కొన్నిసార్లు ఆయన గురువు చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం మాదిరే కనిపిస్తుంది. అయితే చంద్రబాబు ప్రాంతీయ పార్టీ అధినేత కాబట్టి కొంతవరకు చెల్లవచ్చు. అయినా ఆయన అన్నీ అంచనా వేసుకున్నాకే ధైర్యం చేసేవారు. కొన్నిసార్లు ఏమి జరగనట్లు రాజకీయం సాగించేవారు. కాంగ్రెస్‌లో అది అంత తేలికకాదు. ఎవరికి ఉండే బలం వారికి ఉంటుంది. ప్రస్తుతానికి కర్ణాటకలో మాదిరి ఒక నేత ఎవరూ ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడే దశ తెలంగాణ‌లో రాలేదు. అది ఆయనకు కలిసివచ్చే అంశం. అయితే తన కుటుంబ సభ్యులపైన, సన్నిహితులు కొందరిపైన సురేఖ చేసిన ఆరోపణల వల్ల కాంగ్రెస్‌కు కొంత నష్టం జరుగుతుంది. 

వాటిపై అసెంబ్లీలో చర్చ  జరగాలని విపక్షం పట్టుపట్టవచ్చు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన సురేఖ తనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తే అదొక సమస్య అయ్యే అవకాశం ఉంది. కాగా సౌమ్యుడుగా పేరొందిన చిన్నారెడ్డి అనూహ్యంగా వివాదంలో చిక్కుకుని పదవి పోగొట్టుకోవడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. బీసీ నేత పదవినే తీసేశారన్న విమర్శ రాకుండా ఉండడం కోసం ఈ నిర్ణయం చేసి ఉండవచ్చు. ఓవరాల్‌గా ఈ పరిణామాలతో తెలంగాణలో కాంగ్రెస్  ప్రజలలో పలచన కావచ్చు. సురేఖ రాజకీయం ముళ్లబాటగా మారే అవకాశం ఉంటుంది. కాగా, రేవంత్ తన పరపతి నిలబెట్టుకున్నప్పటికీ, కొంత డామేజీని భరించక తప్పదు.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

చదవండి: విజయసాయి మాట ఎందుకు మార్చారు?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement