వైయస్సార్ కడప: జిల్లాలోని రాయచోటి ఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాయచోటి నుంచి కడపకు సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ కడప, అన్నమయ్య జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని ఘాట్‌లో ప్రమాదానికి గురైంది. ఘాట్‌లోని మలుపు వద్ద లారీ అదుపుతప్పి ఎడమవైపు తిరగకుండా నేరుగా అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
అయితే, లారీ బోల్తా పడిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో లారీ డ్రైవర్, క్లీనర్ చిక్కుకుని బయటకు రాలేక సజీవ దహనమైనట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
అలాగే, లారీకి అంటుకున్న మంటలు సమీపంలోని అడవికి వ్యాపించగా, అటవీ ప్రాంతం దట్టంగా ఉండటంతో మంటలు వేగంగా విస్తరించి పెద్ద ఎత్తున అగ్నిజ్వాలలు ఎగసిపడ్డాయి. దీంతో ఘాట్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు.
ఫైర్ ఇంజన్లను రప్పించి లారీకి అంటుకున్న మంటలతో పాటు అడవిలో వ్యాపించిన మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంలో మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే, లారీ అదుపుతప్పడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


