సాక్షి,తాడేపల్లి: కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను అమ్మకానికి పెట్టారని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. డీఎస్సీ స్కామ్ బాధితులకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న డీఎస్సీ స్కామ్ అక్రమాలపై సోమవారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
డీఎస్సీ అక్రమాలపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది. అడ్డ దారిలో ఉద్యోగాలు పొందినవారి వివరాలు ప్రతిరోజూ బయటకు వస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు?.ఇద్దరు మహిళా అధికారులతో మాట్లాడించారు. డీఎస్సీ అక్రమాల నేపథ్యంలో లోకేష్ రాజీనామా చేయాలి. ఏపీలో అమ్మకానికి టీచర్ పోస్టులు అన్నట్టుగా పరిస్థితి మారింది. ఆమాటకొస్తే రాష్ట్రాన్నే అమ్మకానికి పెట్టారు. టీచర్ పోస్టుల అమ్మకం వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ నారా లోకేషే.
కుంభకోణం చిన్నది కాదు, చేయించింది చిన్నవారు కాదు. మొదట డీఎస్సీలో అక్రమాలు జరగలేదన్నారు.ఇప్పుడేమో అక్కడక్కడా తప్పులు జరిగాయేమో అంటున్నారు. మా దృష్టికి వస్తే విచారణ జరుపుతామని చెప్తున్నారు.ఈ తప్పులు చేసిందీ, చేయించింది చిన్న వ్యక్తులు కాదు. దీనంతటి వెనుక ఉన్నది నారా లోకేషేనని తేలిపోయింది. డీఎస్సీ అక్రమాలు జరిగినందునే సాక్షితోపాటు మిగతా మీడియా సంస్థలు వార్తల్ని ప్రసారం చేస్తున్నాయి. అక్రమాలపై విచారణ జరపమనే మేమూ కోరుతున్నాం. అయితే లోకేష్‌కు వ్యతిరేకంగా విచారణ జరుగుతుందని ఎలా నమ్మాలి?.స్కాం జరిగినప్పుడు ఎవరు చేశారు? ఎలా చేశారో బయటకు తీయాలి. ఏదైనా తప్పులను చూపిస్తే దాన్ని కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
మీడియా విచారణ చేస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. సోషల్ మీడియాను సెన్సార్ షిప్ చేయటం దుర్మార్గం. ఏపీలో అప్రకటిత ఎమర్జన్సీ అమలవుతోంది.స్పోర్ట్స్ కోటాలో అధికభాగం టీచర్ పోస్టులను అమ్మేసుకున్నారు.బంగారు పతకం సాధించిన దుర్గయ్యకు పోస్టు ఎందుకు రాలేదు?. నవీన్ అనే టాపర్ పేరు లిస్టులో పెట్టి, తర్వాత ఎందుకు తీసేశారు?. దీనిపై నవీన్ హైకోర్టుకు వెళ్లడంతో అక్రమాల డొంక కదిలింది. నవీన్ ఇష్యూపై అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ వేర్వేరు ప్రకటనలు చేశారు.
డీఎస్సీ ప్రశ్నాపత్రం తయారీలో నవీన్ పాల్గొన్నాడు.పేపర్ లీక్ అయింది. ప్రశ్నలను అమ్ముకున్నారు.120 ప్రశ్నలను రూ.3 లక్షల చొప్పున అమ్ముకున్నారు. అనేక అంశాలపై ఆధారాలు ఉన్నాయి. క్రీడా సంఘాల నుండి ఫేక్ సర్టిఫికేట్ తెచ్చి టీచర్ పోస్టులు అమ్మేసుకున్నారు. ఫేక్ టీచర్లు విద్యార్థులకు ఏం చదువులు చెప్తారు?.అర్హులకు అన్యాయం చేస్తే వారి జీవితాలు ఏం కావాలి?.డీఎస్సీలో అక్రమాలు చేసిన వారు జైల్లో ఉండాలి. బాధ్యత కలిగిన మంత్రి లోకేష్ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.
వాస్తవాలు మాట్లాడకుండా నోరు పారేసుకుంటున్నారు. సవాల్ చేసే లోకేష్ శాసనమండలికి వచ్చి ఎందుకు సమాధానం చెప్పలేదు?. జూడో సర్టిఫికేట్లను ఫోర్జరీ చేసిన నలుగురికి ఉద్యోగాలు ఇచ్చారు.వారు ఇచ్చిన సర్టిఫికేట్లు ఫోర్జరీ అని తెలిసినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?. టెట్ క్వాలిఫై కాకపోయినా ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?. దొంగల ముఠాలాగా వ్యవహరిస్తున్నారు.రేపు విచారణ జరిగితే అధికారులు కూడా తప్పించుకోలేరు. తప్పు జరిగినా బరితెగించి మాట్లాడుతున్నారు.
మేము బయట పెట్టిన కేస్ స్టడీస్‌కు మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇతర రాష్ట్రాల్లో తప్పులు చేసిన వారు జైలు పాలయ్యారు. హర్యానాలో అప్పటి సీఎం, ఆయన కుమారుడు జైలు పాలయ్యారు. చంద్రబాబు, లోకేష్ డీఎస్సీ పారదర్శకంగా జరిగిందని చెప్తున్నారు.మరి తప్పులు జరిగాయని అధికారులు ఎలా చెప్పారు?. చంద్రబాబు తన కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే మాకు అందించవచ్చు. లోకేష్ రాజీనామా చేయాల్సిందే సీబీఐతో విచారణ జరపాల్సిందే.కేంద్రంలో కూడా వారి ప్రభుత్వమే ఉన్నప్పుడు లోకేష్, చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు?’అని ప్రశ్నించారు.


