అన్నమయ్య జిల్లా టీడీపీ నేతలు ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగానే ముందుకు సాగుతున్నారా? పలు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లు మార్చినా వర్గ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయా..? జిల్లా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు అధిష్టానానికి తలనొప్పులుగా మారాయా? అంటే..అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.
అన్నమయ్య జిల్లా టీడీపీ రాజకీయాల్లో వర్గ విభేదాలు సమసిపోలేదు. నిన్నటిదాకా జిల్లా టీడీపీలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనుకూల, వ్యతిరేక వర్గాలు కొనసాగి.. బలాబలాలు సమానంగానే ఉన్నాయి. ఇటీవల తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్‌లను మార్చడంతో ఇప్పుడు అందరి దృష్టి కొత్త నేతలపై పడింది. వీరు మంత్రి మండిపల్లి శిబిరంలో చేరుతారా లేక నల్లారి కిశోర్ పక్షాన వెళ్తారా అన్నది జిల్లా టీడీపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జిల్లా రాజకీయాల్లో కీలకమైన మంత్రి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారన్నది ఉత్కంఠగా కనిపిస్తోంది.
మొన్నటిదాకా రెండు వర్గాలు
జిల్లా టీడీపీ రాజకీయాల్లో జిల్లా అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ నియామకం కాక ముందు వరకు జిల్లా మంత్రి చుట్టూ రాజకీయాలు నడిచాయి. అప్పటివరకు పుంగనూరు ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె ఇన్చార్జి జయచంద్రారెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, మాజీ ఎమ్మెల్యే, ముఖ్య నాయకులు మండిపల్లి వర్గంగా ముద్రపడ్డారు. ఈ పరిస్థితుల్లో కొంతకాలం న్యూట్రల్ గా ఉన్న మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా మంత్రిపై అసంతృప్తితో పీలేరు ఎమ్మెల్యే కిశోర్ కుమార్ రెడ్డితో జతకట్టారు. తర్వాత కొంతకాలానికి ప్రసాద్ జిల్లా అధ్యక్షుడు కావడంతో ఈ ముగ్గురు ఒక వర్గంగా కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తున్నారు. జిల్లాలో వీరంతా మంత్రితో కలిసి పాల్గొన్న సందర్భమే లేదు.
చల్లా, దాసరిపల్లి తొలగింపు
తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ఇరుక్కోవడంతో ఆయనను పార్టీ నుంచి అధినేత చంద్రబాబు సస్పెండ్ చేశారు. పుంగనూరు నియోజవర్గంలో చల్లాపై వచ్చిన ఆరోపణలతో ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించారు. మంత్రి మండిపల్లికి రెండు నియోజకవర్గాల నుంచి అండగా ఉన్న ఇద్దరు నేతల బలం తగ్గిపోయింది.
ఆ ఇద్దరు ఎవరి వైపు..
కొత్తగా వచ్చిన ఇన్చార్జీలు ఏ వర్గం వైపు ఉంటారన్నది పార్టీ నేతల్లో అమితాసక్తి నెలకొంది. పుంగనూరు, తంబళ్లపల్లె గత ఇన్చార్జిలు ఉండగా రెండు వర్గాల బలం సమంగా ఉండేది. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, మధుసూదన్ నాయుడు ఇన్చార్జిలు కావడంతో వీరు ఎవరి వైపు వెళ్తారన్నది చర్చనీయాంశమైంది.
శంకర్ విషయానికి వస్తే..
గత ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన ఆవేదనతో ఉన్న శంకర్ యాదవ్ తిరిగి ఇంచార్జ్ అయ్యారు. జయచంద్రారెడ్డి నకిలీ మద్యం తయారు కేసులో నిందితుడు కాకపోయి ఉంటే శంకర్‌కు తిరిగి అవకాశం వచ్చేది కాదు. కాగా గత పరిస్థితులను పరిశీలిస్తే శంకర్ కిశోర్ వైపు వెళ్తారన్నది అనుమానమే. ఎందుకంటే శంకర్ కాంగ్రెస్ పారీ్టలో చేరి రాజకీయాల్లోకి వచ్చాక అప్పటి కిరణ్ సర్కార్ నుంచి సహాయ నిరాకరణ ఎదుర్కొన్నారు. తాజాగా టీడీపీ ఇన్చార్జిగా శంకర్‌కి బాధ్యత అప్పగించే విషయంలో కిశోర్ పలు సందర్భాల్లో చంద్రబాబు ఎదుట అసంతృప్తి వ్యక్తం చేశారని పారీ్టలో ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో శంకర్ కిశోర్‌తో జత కడతారా అన్నది అనుమానమే. అలాగే మంత్రి మండిపల్లి విషయంలోనూ శంకర్ సానుకూలంగా ఉండే అవకాశాలు లేవు. దాసరిపల్లి జయచంద్రారెడ్డిపై నియోజకవర్గ టిడిపిలో తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ మంత్రి అండగా నిలిచారని శంకర్ వర్గం రెండేళ్లుగా మొరపెట్టుకుంటూనే ఉంది.
మధు ఎటు వైపు.. పుంగనూరు ఇంచార్జ్ మధుసూదన్ నాయుడు ఇన్చార్జిగా నియమితులయ్యాక కిశోర్, చల్లాను కలవగా, మంత్రి మండిపల్లిని, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలవలేదని తెలుస్తోంది. దాసరిపల్లి, చల్లా ఇద్దరూ మంత్రి వర్గీయులుగా కొనసాగిన కారణంతో శంకర్, మధులు మంత్రితో జత కట్టేందుకు మొగ్గచూపకపోతే..జిల్లాలోని ఐదు నియోజకవర్గ నేతల్లో నలుగురు ఓ వర్గమై, జిల్లాలో రాజకీయాల్లో మంత్రి ఒంటరిగా మిగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవరు ఏ జట్టులో చేరుతారో.. గట్టునుండి చూస్తుండిపోతారో వేచిచూడాలి.


