breaking news
krishna-godavari water
-
అజెండాపై కుదరని ఏకాభిప్రాయం
కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో ఏపీ, తెలంగాణల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ రెండో సమావేశంలోనూ అజెండాపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో భేటీలో చర్చించాల్సిన అంశాలపై వారంలోగా ప్రతిపాదనలు ఇవ్వాలని ఇరు రాష్ట్రాల అధికారులకు సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ సూచించారు.సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో ఆంధ్రపద్రేశ్, తెలంగాణల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి సూచనలు ఇచ్చేందుకు కేంద్రం ఏర్పాటుచేసిన కమిటీ రెండో సమావేశంలోనూ అజెండాపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో కమిటీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై వారంలోగా ప్రతిపాదనలు ఇవ్వాలని రెండు రాష్ట్రాల అధికారులకు సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ సూచించారు. ఏపీ ప్రతిపాదనలను తెలంగాణకు, తెలంగాణ ప్రతిపాదనలను ఏపీకి పంపుతామని.. వాటిని పరిశీలించి ఇరు రాష్ట్రాల అధికారులు అభిప్రాయాలు చెప్పాక అజెండాను ఖరారుచేసి మరో రెండు వారాల తర్వాత సమావేశం నిర్వహిస్తామంటూ చేసిన సూచనకు ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకరించారు. సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన జల వివాదాల కమిటీ రెండో సమావేశం ఢిల్లీలోని సీడబ్ల్యూసీ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఏపీ తరఫున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్సీ కె. నరసింహమూర్తి.. తెలంగాణ తరఫున ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. గత జనవరి 30న జరిగిన తొలి సమావేశానికి కొనసాగింపుగా ఈ భేటీ జరిగింది. ఆ సమావేశంలో అజెండా సమరి్పంచాలని ఇరు రాష్ట్రాల అధికారులను సీడబ్ల్యూసీ చైర్మన్ కోరినా ఇప్పటిదాకా అజెండాను రెండు రాష్ట్రాలు ప్రతిపాదించలేదు. దీంతో అజెండాను ఖరారు చేసేందుకు రెండో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి, గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనం, గోదావరి జలాల్లో రెండు రాష్ట్రాల వాటాలు తేల్చడం, కృష్ణాపై అనుమతిలేకుండా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించాలని ఏపీ అధికారులు సూచించగా.. బ్రిజేష్కుఆర్ ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చేవరకు కృష్ణా జలాల్లో 50 శాతం వాటా వినియోగించుకునే అవకాశం కల్పించడం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల నీటి హక్కులను కల్పించడం, గోదావరి మిగులు జలాల వినియోగం, పోలవరం–నల్లమలసాగర్ లింక్, అంతర్రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు వంటి అంశాలపై చర్చించాలని తెలంగాణ అధికారులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. లభ్యత జలాల లెక్కలపై ఏపీ అభ్యంతరాలు.. గోదావరిలో ప్రవాహాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేయించి నీటి లభ్యతను తేల్చాలని సీడబ్ల్యూసీ చైర్మన్‌ను ఏపీ అధికారులు కోరారు. నీటి లభ్యత తేల్చాక ఏపీ, తెలంగాణ వాటాలను తేల్చాలన్నారు. గోదావరి ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేసి రెండు రాష్ట్రాల వాటాలను తేల్చాలని తమ ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసిందని వారు గుర్తుచేశారు. నీటి వాటాలు తేలకముందే తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల వంటి ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆ ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినవేనని.. రీ–ఇంజినీరింగ్, డిజైన్ చేసి చిన్నచిన్న మార్పులు మాత్రమే చేశామని వివరించారు. ప్రస్తుత సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 65 రోజుల్లో వెయ్యి టీఎంసీలకు పైగా వరద జలాలు సముద్రంలో కలిశాయని.. అందులో 200 టీఎంసీలను వినియోగించుకోవడానికి చేపట్టిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతివ్వాలని ఏపీ అధికారులు కోరగా.. తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. వీటిపై సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ జోక్యం చేసుకుంటూ అజెండాలో చేర్చితే వాటిపై చర్చిద్దామని రెండు రాష్ట్రాల అధికారులకు సూచించారు. మాకు తాగునీరు, విద్యుత్ అవసరాలే ముఖ్యం : తెలంగాణ శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలో తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ ప్రాజెక్టును ఖాళీచేస్తోందని.. నీటి మట్టం 854 అడుగుల కంటే దిగువకు చేరితే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు నీళ్లందించలేని.. రాయలసీమ, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయలేమని ఏపీ అధికారులు సీడబ్ల్యూసీ చైర్మన్‌కు వివరించారు. విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను నిలువరించాలని ఏపీ అధికారులు కోరడంపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తంచేశారు. అయితే, తమకు తాగునీరు, విద్యుత్ అవసరాలే అత్యంత ముఖ్యమని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిపై నిర్ణయాలు తీసుకుంటామని తెలంగాణ అధికారులు వివరించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జునసాగర్‌లో తగిన నిల్వలు అవసరమని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఏపీ తన వాటాకు మించి నీళ్లను తరలిస్తోందన్నారు. వీటిపై సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ జోక్యం చేసుకుంటూ తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని రెండు రాష్ట్రాల అధికారులకు సూచించారు.గోదావరి–కావేరి బ్లూప్రింట్ మేమే రూపొందిస్తాం : సీడబ్ల్యూసీ ఇక తెలంగాణలోని సమ్మక్క బ్యారేజ్ నుంచి గోదావరి జలాలను కావేరికి తరలించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుండగా.. పోలవరం ప్రాజెక్టు నుంచి కావేరికి గోదావరి జలాలను తరలించేలా గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. పోలవరం నుంచి గోదావరి జలాలను కావేరికి తరలిస్తే తమ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలంగాణ అభ్యంతరం తెలుపుతోంది. సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. గోదావరి–కావేరి అనుసంధానం ప్రాజెక్టు బ్లూప్రింట్ తామే రూపొందిస్తామని సీడబ్ల్యూ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ స్పష్టంచేశారు. -
మళ్లీ తెరపైకి ‘దుమ్ముగూడెం’
మిర్యాలగూడ, న్యూస్‌లైన్:కృష్ణా-గోదావరి జలాల అనుసంధానం పేరుతో కృష్ణానది మిగులు జలాల్లో కోత విధించే ప్రయత్నం మొదలైంది. ఇప్పటికే బ్రిజేష్‌కుమార్ తీర్పు ప్రకారం నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల పరిధిలో 145 టీఎంసీల నీటిని వచ్చే ఏడాదికి నిల్వ చేసుకోవాలి. దీంతో మిగులు జలాల ఆధారంగా నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీకి చుక్కనీరు కూడా వచ్చే అవకాశాలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్ ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రాజెక్ట్ టెక్నికల్ కమిటీ నిర్ణయం మేరకు 2018 లోగా ప్రాజెక్ట్ పూర్తికి ప్రభుత్వం గడువు పొడిగించింది. దీంతో నల్లగొండ జిల్లా ప్రజల్లో మళ్లీ అలజడి మెదలైంది. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో అదనంగా ఒక్క ఎకరానికి నీరు రాక పోగా, భూసేకరణ కోసం పంట భూములు కోల్పోవలసి వస్తుంది. దుమ్ముగూడెం-టెయిల్పాంట్ ప్రాజెక్టు ద్వారా 165 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించుకునే అవకాశం ఉందంటూ టెక్నికల్ కమిటీ పేర్కొనడం కృష్ణా జలాల్లో కోత విధించడానికే అని స్పష్టంగా తెలుస్తుంది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం గతంలో రూ. 19,521 కోట్లకు అంచనా వేయగా, ప్రస్తుతం అది సుమారు రూ. 30 వేల కోట్లకు చేరింది. వాస్తవానికి 2009లోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని భావించగా, నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. అప్పటి సీఎం రోశయ్యను కలిశారు. దీంతో పనులు నిలిచిపోయాయి. ఇదే సమయంలో 2014లోగా ప్రాజెక్టు పూర్తి చేయాలనే గడువు దగ్గరికి వచ్చింది. దీంతో టెక్నికల్ కమిటీ సూచనల మేరకు ఇటీవల ప్రాజెక్టు నిర్మాణ గడువు 2018 సంవత్సరానికి పెంచారు. ఎత్తిపోతలు సాధ్యమయ్యేనా? దుమ్ముగూడెం ప్రాజెక్టు భాగంగా ఖమ్మం జిల్లా బయ్యారం నుంచి నాగార్జునసాగర్ దిగువన నల్లగొండ జిల్లాలోని హాలియా సమీపంలో ఉన్న టెయిల్‌పాండ్ ప్రాజెక్టులోకి లింకు కాలువ ను ఏర్పాటు చేయాలి. దీని కోసం 244 కిలోమీటర్ల పొడువునా కాల్వ తవ్వకం పనులు చేపట్టాలి. అంతే కాకుండా మొత్తం 127 మీటర్ల ఎత్తులో ఎత్తిపోతల పథకాలు పనిచేయాల్సి ఉంది. అందుకు 1,136 మెగావాట్ల విద్యుత్ కూడా అవసరమవుతుంది. ఖమ్మం జిల్లాలోని మొద్దులగూడెం (19 మీటర్ల ఎత్తు), కళ్యాణపురం (16 మీటర్ల ఎత్తు), రేగల్ల (25 మీటర్ల ఎత్తు), ఒడ్డుగూడెం (12 మీటర్ల ఎత్తు), కోయగూడెం (19 మీటర్ల ఎత్తు), బయ్యారం వద్ద 35 మీటర్ల ఎత్తున ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారీగా నిర్మించే ఎత్తిపోతల పథకాలు పని చేసే పరిస్థితులు లేవు. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో భూసేకరణ ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కాలువ తవ్వకానికి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలో 3,701 ఎకరాల అటవీభూమి, 16,084 ఎకరాల ప్రైవేటు భూమిని రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఈ పనులను 10 ప్యాకేజీలుగా విభజించారు. ఖమ్మం జిల్లాలో 1 నుంచి 6 ప్యాకేజీలు (159.80 కిలోమీటర్లు), నల్లగొండ జిల్లాలో 7 నుంచి 10వ ప్యాకేజీ వరకు 84 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. కాగా, ఖమ్మం జిల్లాలోని బయ్యారం నుంచి ప్రారంభమవుతున్న ఈ లింకు కాలువ బయ్యారం, గార్ల, తిమ్మాయిపాలెం మీదుగా నల్లగొండ జిల్లాలోని మోతె మండలానికి ప్రవేశించి అక్కడి నుంచి చివ్వెంల, మునగాల, పెన్‌పహాడ్, వేములపల్లి, త్రిపురారం, నిడమనూరు, అనుముల మీదుగా టెయిల్‌పాండ్ ప్రాజెక్టులో కలుస్తుంది. సాగర్ ఆయకట్టును దీని పరిధిలో చూపేందుకు ప్రయత్నం నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు దిగువభాగంలో ఉన్న టెయిల్‌పాండ్ ప్రాజెక్టులో ఈ లింకు కాలువను కలిపినా, దాని పరిధిలోని ఆయకట్టు పూర్తిగా దీని కిందనే ఉన్నట్లు టెక్నికల్ కమిటీ చూపేందుకు ప్రయత్నిస్తుందనే ఆరోపణలున్నాయి. టెయిల్‌పాండ్ వద్ద ఉన్న రివర్సబుల్ టర్బైన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు ఆయకట్టుకు నీటిని వినియోగించుకోవచ్చని వారి లెక్కల్లో పేర్కొన్నారు. వరదల సమయంలోనే కేవలం 80రోజుల్లో మాత్రమే నీటిని మళ్లించే అవకాశముండే ఈ ప్రాజెక్టు పరిధిలోకి 14,12,870 ఎకరాల ఆయకట్టు చూపిస్తున్నారు. టెక్నికల్ కమిటీ సూచనల మేరకు తెలంగాణ ప్రాంతంలో 8,53,870 ఎకరాలు (ఖమ్మం జిల్లాలో 2,05,200 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 3,68,070 ఎకరాలు (ఎడమకాల్వ పరిధి), నల్లగొండ జిల్లాలో 2,80600 ఎకరాలు), ఆంధ్రా ప్రాంతంలో 5,59,000 ఎకరాలు (గుంటూరు జిల్లాలో 3,40,000 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 2,19,000 ఎకరాలు ఆయకట్టును చూపుతున్నారు. కానీ వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు సాగుకు ఈ నీరు ఏ విధంగా ఉపయోగపడే అవకాశాలు లేవు. ప్రాజెక్టుపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: జూలకంటి రంగారెడ్డి, ఎమెల్యే మిర్యాలగూడ దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్ ప్రాజెక్టుతో నల్లగొండ జిల్లాకు ఎలాంటి ఉపయోగం లేదు. పనులు నిలిపివేయాలని గతంలోనే అప్పటి సీఎం రోశయ్యకు వినతిపత్రం ఇచ్చాం. ఇటీవల సీఎం కిరణ్‌ను కూడా కలిశాం. ఈ ప్రాజెక్ట్ నల్లగొండ జిల్లా ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందో టెక్నికల్ కమిటీ చెప్పిన విషయాలను ప్రభుత్వం అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి వివరించాలి. ప్రజలు అడిగిన ప్రాజెక్టులను నిర్మించని ప్రభుత్వం అవసరం లేని దానిని నిర్మించే ప్రయత్నం విరమించుకోవాలి.


