మీరు నిజమైన రైతులేనా! | Fisheries Commissioner Under Fire for Inappropriate Remarks | Sakshi
Sakshi News home page

మీరు నిజమైన రైతులేనా!

Sep 8 2026 5:17 AM | Updated on Sep 8 2026 5:17 AM

Fisheries Commissioner Under Fire for Inappropriate Remarks

మత్స్యశాఖ కమిషనర్‌ను చుట్టుముట్టి నినాదాలు చేస్తున్న ఆక్వా రైతులు

మత్స్యశాఖ కమిషనర్‌ అనుచిత వ్యాఖ్యలు  

మండిపడిన ఆక్వా రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

సాక్షి, అమరావతి: రొయ్యల మేత ధరల పెంపును నిరసిస్తూ సోమవారం విజయవాడ సమీపంలోని పోరంకిలో గల మత్స్యశాఖ కమిషనర్‌ కార్యాల­యం ఎదుట ధర్నా చేసేందుకు వచ్చిన రైతులను ఉద్దేశించి మత్స్యశాఖ కమిషనర్‌ రామ్‌శంకర్‌నాయక్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు రైతుల ఆగ్రహానికి కారణమయ్యాయి. అప్సడా చట్టానికి వ్యతిరేకంగా ఏకపక్షంగా పెంచిన రొయ్యల మేత ధరలను తక్షణమే ఉపసంహరింపజేయాలని కోరుతూ ఏపీ ఆక్వా రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో  రైతులు కమిషనర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి, మేత కంపెనీలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం మత్స్య శాఖ కమిషనర్‌ రామ్‌శంకర్‌నాయక్‌కు వినతిపత్రం ఇచ్చారు. 

ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. ఫీడ్‌ తయారీలో వినియోగించే ముడి పదార్థాల ధరలు పెరిగాయని, అందువల్లే ఫీడ్‌ ధరలు పెంచాల్సి వస్తోందని చెప్పగా.. రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫీడ్‌ కంపెనీలు ముడి పదార్థాలను ప్రతినెలా కొనుగోలు చేయవని, అలాంటప్పుడు 45 రోజులకు ఒకసారి ఫీడ్‌ ధరలను సమీక్షిస్తూ ధరలు పెంచడంలో హేతుబద్ధత ఏమిటని ప్రశ్నించారు. ఈ సందర్భంలో రైతుల ప్రశ్నలకు బదులివ్వలేక ‘మీరు నిజమైన రైతులేనా?’ అని కమిషనర్‌ చేసిన వ్యాఖ్యలపై రైతులు తీవ్రంగా మండిపడ్డారు. రైతులను ఇలా అవమానపర్చడం దారుణమంటూ కమిషనర్‌ ఎదుటæ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. 

ఫీడ్‌ ధరలు తగ్గించాల్సిందే 
అనంతరం వారంతా మీడియాతో మాట్లాడుతూ.. ఫీడ్‌ ధరలు తగ్గించాల్సిందేనని కోరారు. ఫీడ్‌ ధరల పెంపును నియంత్రించడంతో పాటు కంపెనీల ధరల విధానాన్ని పారదర్శకంగా పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ఫీడ్‌ ధరలు, రొయ్యల ధరలను పర్యవేక్షించే కమిటీల్లో రైతుల పేరుతో ఫీడ్‌ కంపెనీల డీలర్లు, రొయ్యల ఎగుమతిదారుల బ్రోకర్లు ఎలా ఉంటారని రైతులు ప్రశ్నించారు. 

ఇలాంటి ప్రతినిధులు కమిటీల్లో ఉండటం వల్ల నిర్ణయాలు రైతుల ప్రయోజనాలకు కాకుండా ఫీడ్‌ కంపెనీలు, ఎగుమతిదారులకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందన్నారు. రైతులే నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములు కావాలని, ఫీడ్‌ ధరలు–రొయ్యల ధరలపై పారదర్శకమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో సమాఖ్య కన్వీనర్‌ దుగ్గినేని గోపీనాథ్, వివిధ జిల్లాల సమాఖ్య ప్రతినిధులు శ్రీనాథ్‌రెడ్డి, మేకా వెంకటేశ్వరరావు, పి.వెంకురెడ్డి, పమిడి సుబ్బానాయుడు, బత్తుల రమేష్‌రెడ్డి, ఎస్‌.అంజిబాబు, బి.భాస్కర్‌రెడ్డి, సతీష్ రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement