పర్వతారోహకుల తాకిడితో పెనుముప్పు
మంట పుట్టిస్తున్న వంటలు, హీటర్లు, లైటింగ్
ఏటా 2,500 టన్నులకు పైగా కరిగిపోతున్న మంచు
రీజనల్ ఎన్విరాన్‌మెంటల్ చేంజ్ జర్నల్ వెల్లడి
సాక్షి, అమరావతి: ‘అతి సర్వత్ర వర్జయేత్...’ అంటోంది ఎవరెస్ట్ శిఖరం. అంతటి దిగ్గజ పర్వతరాజం కూడా మితివీురినస్థాయిలో పర్వతారోహకుల తాకిడికి తల్లడిల్లుతోంది. వ్యర్థాలు, కాలుష్యంతో బెంబేలెత్తుతోంది. కనువిందు చేసే ఎవరెస్ట్ హిమగిరి సొగసులు ప్రమాదకరస్థాయిలో వేగంగా కరిగిపోతున్నాయి. పరిమితికి మించి పర్వతారోహకులు, వారి సహాయకులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు మౌంటెనింగ్‌కు వేలంవెర్రిగా వెళుతుండటం ప్రకృతికి పెనుముప్పు కలిగిస్తోందని స్ప్రింగర్ నేచర్ గ్రూప్ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది.
2023 నుంచి 2026 వరకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద వాతావరణ, పర్యావరణ పరిస్థితులను అధ్యయనం చేసి ఈ నివేదిక రూపొందించింది. ఇదే పరిస్థితి కొనసాగితే 2100 నాటికి ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వద్ద ఉన్న హిమనీనదాల్లో 70 శాతం మంచు కరిగిపోతోందని ఆ నివేదికలో వెల్లడించింది. రీజనల్ ఎన్విరాన్‌మెంటల్ చేంజ్ జర్నల్ తాజాగా ప్రచురించిన ఆ నివేదిక ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ నివేదికలోని ప్రధాన అంశాలు..
ఏటా 50 రోజులు జాతర
పర్వతారోహణ సీజన్‌లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను చూస్తే అది ఒక హిమనీనద ప్రాంతంగా కనిపించడం లేదు. ఆ 50 రోజులు పర్యాటకులతో కిక్కిరిసిపోయిన సాధారణ పర్యాటక విడిది కేంద్రంగా మారుతోంది. పర్వతారోహకుల కోసం బేస్‌క్యాంప్ వద్ద ఏకంగా 1,600 టెంట్లు వేస్తుండటం గమనార్హం. అంటే ఓ సాధారణ జాతర ప్రాంతంగా తయారవుతోంది.
మంచుకొండలకు మంటే
బేస్‌క్యాంప్ వద్ద పర్వతారోహకుల కోసం ఆహారం వండుతున్నారు. అక్కడ వంటకు, చలి నుంచి వెచ్చదనం కోసం, రాత్రివేళల్లో లైటింగ్ కోసం ఏటా సగటున 824 పోర్టబుల్ వంటగ్యాస్ సిలిండర్లు, 18,935 లీటర్ల కిరోసిన్, 5,130 లీటర్ల గ్యాసోలైన్ (పెట్రోల్ ఇంధనం) వినియోగిస్తున్నారు. దీంతో విపరీతంగా కాలుష్యం వెలువడుతోంది. తద్వారా 849.17 మెగా జౌళ్ల థర్మల్ విద్యుత్ శక్తి వెలువడుతోంది. దీంతో ఒక సీజన్‌లోనే 2,492 టన్నుల మంచు కరిగిపోతోంది.
ముప్పు కలిగిస్తున్న మూత్రం
పర్వతారోహకులు, వారి సహాయకులు రోజుకు ఆరువేల లీటర్ల మూత్రవిసర్జన చేస్తున్నారని అంచనా. ఆ మూత్రం కుంభూ హిమనీనదంలోకి చేరుతోంది. సరుకు రవాణా కోసం ఎక్కువగా ఉపయోగించే కంచర గాడిదలు, జడల బర్రె (యాక్)ల మూత్రవిసర్జన కూడా హిమనీనదాల్లోకి చేరుతోంది. అంతటి పరిమాణంలోని మూత్రంతో పుడుతున్న వేడితోనే ఒక్క సీజన్‌లోనే 154 టన్నుల మంచు కరిగిపోతోంది. నాలుగైదేళ్ల కిందటితో పోలిస్తే ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వద్దకు సరుకు రవాణా కోసం ఉపయోగిస్తున్న కంచర గాడిదలు, జడల బర్రెల సంఖ్య అయిదారు రెట్లు పెరిగింది.


