పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేయలని కోరుతూ కాకినాడలో ర్యాలీ నిర్వహిస్తున్న నిరుద్యోగులు
కదంతొక్కిన పోలీసు అభ్యర్థులు
మెగా పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆందోళన
కాకినాడలో నిరుద్యోగుల భారీ ప్రదర్శన
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): పోలీసు అభ్యర్థులు కాకినాడలో కదంతొక్కారు. బాబూ.. జాబ్ ఎక్కడ అంటూ సర్కారును నిలదీశారు. మెగా పోలీస్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఢిల్లీ జెన్‌జీ ఉద్యమ తరహాలో మహోద్యమం తప్పదని హెచ్చరించారు. పోలీసు ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న నిరుద్యోగులు సోమవారం యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాకినాడలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. శారదా దేవి గుడి సర్కిల్‌కు చేరుకుని, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. కొడుకు లోకేశ్‌కు మంత్రి పదవి కట్టబెట్టిన చంద్రబాబూ.. మాకు జాబ్ ఎక్కడ అంటూ నిలదీశారు.
తక్షణం మెగా పోలీసు నోటిఫికేషన్ విడుదల చేయాలి అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా సర్కారు తాత్సారం చేస్తోందని ధ్వజమెత్తారు. వయోపరిమితిపైనా అభ్యర్థులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటూ ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు హామీలు ఇచ్చారని, కానీ ఈ రెండేళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని దుమ్మెత్తిపోశారు.
పీజీలు, డిగ్రీలు చదువుకున్న తాము నిరుద్యోగులుగా మిగిలిపోతుంటే.. ఇంటర్ ఫెయిలైనవారూ ఈ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. సర్కారు తక్షణం స్పందించకుంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ఢిల్లీలో జెన్‌జీ చేపట్టిన ఉద్యమ తరహా పోరాట స్ఫూర్తితో చలో విజయవాడ పేరుతో మహోద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రాంబాబు, రాజేష్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. గంగా సూరిబాబు, అధిక సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొన్నారు.


