గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు
కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయాలకు వెళ్లిన వృద్ధులు, వితంతువులు
తొలిరోజు సాంకేతిక ఇబ్బందులు
సర్వర్ పనిచేయక సాయంత్రం వరకూ పడిగాపులు
సాక్షి, అమరావతి: రెండేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఎట్టకేలకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించగా.. తొలిరోజే సర్వర్ మొరాయించడంతో వృద్ధులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లిన దరఖాస్తుదారులు సాంకేతిక సమస్యల కారణంగా గంటల తరబడి పడిగాపులు పడాల్సి వచ్చింది.
సోమవారం నుంచి ఏడు రోజులు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా పింఛన్ల దరఖాస్తులు నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఉదయం సచివాలయాలు తెరవకముందే వృద్ధులు, వితంతువులు వాటి ఎదుట బారులుతీరారు. ఉదయం ఆన్‌లైన్ పోర్టల్ పనిచేయలేదు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సర్దుబాటు చేసిన తర్వాత కూడా అనేకచోట్ల పోర్టల్ పనిచేయలేదు. దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అవ్వాతాతలు సాయంత్రం వరకు సచివాలయాల వద్ద వేచిచూడగా.. తగిన పత్రాలు తీసుకురాలేదని సిబ్బంది చెప్పడంతో ఉసూరుమంటూ వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.


