సెప్టెంబర్ 11, 2001.. అమెరికా చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజు. విమానాలను హైజాక్ చేసి అమెరికాపై భీకర దాడులకు పాల్పడింది ఉగ్రసంస్థ అల్‌ఖైదా. అయితే ఆ దాడుల వేళ దేశవ్యాప్తంగా పౌర విమాన రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఆకాశం దాదాపు నిర్మానుష్యంగా మారింది. కానీ.. ఆ భయానక పరిస్థితుల్లోనూ ఓ విమానానికి ప్రత్యేక అనుమతితో గాల్లోకి ఎగిరింది.
సెప్టెంబర్ 9/11 దాడుల తర్వాత.. అనంతరం అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దేశవ్యాప్తంగా పౌర విమానాలను నేలకే పరిమితం చేసింది. అమెరికా చరిత్రలో ఇలాంటి దేశవ్యాప్త పౌర విమానాల నిలిపివేత ఇదే తొలిసారి. అయితే ఆనాడు అత్యవసర పరిస్థితుల దృష్ట్యా.. సైనిక, అత్యవసర వైద్య విమానాలే తిరిగాయి. ఈ క్రమంలో.. ఎఫ్‌ఏఏకు ఓ ఎమర్జెన్సీ కాల్ వచ్చింది.
ఫ్లోరిడాకు చెందిన స్నేక్ ఎక్స్‌పర్ట్ లారెన్స్ వాన్ సెర్టిమా.. ఒక ఇన్‌లాండ్ టైపాన్ పామును తిరిగి దాని బోనులో పెట్టే ప్రయత్నం చేయగా అది ఆయన బొటనవేలిని కాటేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఇన్‌లాండ్ టైపాన్ అనేది అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. కాటు తర్వాత ఆయన పరిస్థితి వేగంగా విషమించింది. స్పృహ కోల్పోవడంతోపాటు కళ్ల నుంచి, చెవుల నుంచి, నోటి నుంచి రక్తస్రావం మొదలైంది. మయామిలోని వైద్యులు అందుబాటులో ఉన్న యాంటీవెనమ్‌తో చికిత్స ప్రారంభించారు. అయితే అది సరిపోలేదు.
ఇన్‌లాండ్ టైపాన్ విషానికి ప్రత్యేకంగా ఉపయోగించే యాంటీవెనమ్ అవసరమైంది. ఆ మందు అప్పట్లో న్యూయార్క్, శాన్‌డియాగోలోని జంతుప్రదర్శనశాలల్లో మాత్రమే లభ్యమవుతోంది. 9/11 దాడులతో న్యూయార్క్ పూర్తిగా కల్లోలంలో ఉండటంతో.. వైద్య బృందం దృష్టి శాన్‌డియాగోపై పడింది. వాన్ సెర్టిమా పరిస్థితి మరింత విషమించడంతో వైద్య, అగ్నిమాపక అధికారులు విమాన ప్రయాణానికి ప్రత్యేక అనుమతి కోరారు. గంటలపాటు చర్చల అనంతరం FAA అనుమతించింది.
2001 సెప్టెంబర్ 12న శాన్‌డియాగో నుంచి ఒక చిన్న లియర్‌జెట్ బయలుదేరింది. విమానం అమెరికా మీదుగా ప్రయాణిస్తుండగా రెండు ఫైటర్ జెట్లు దానికి ఎస్కార్ట్‌గా వెళ్లాయి. శాన్‌డియాగో నుంచి తెచ్చిన అదనపు యాంటీవెనమ్ మయామికి చేరిన తర్వాత వైద్యులు వెంటనే వాన్ సెర్టిమాకు అందించారు. చికిత్సకు స్పందించిన ఆయన చివరకు ప్రాణాలతో బయటపడ్డారు. రెండు రోజుల తర్వాత టీవీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. పాముదేం తప్పు లేదు..తన నిర్లక్ష్యమే కారణమంటూ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారాయన.

అమెరికా చరిత్రలో చీకటి రోజు
సెప్టెంబర్ 9, 2001.. 19 మంది ఆల్‌ఖైదా ఉగ్రవాదులు నాలుగు వాణిజ్య విమానాలను హైజాక్ చేశారు. రెండు విమానాలను న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్‌ను ఢీకొట్టించారు. మూడో విమానాన్ని వాషింగ్టన్ సమీపంలోని పెంటగాన్‌పైకి దించారు. నాలుగో విమానం ఫ్లైట్ 93ను ప్రయాణికులు తిరగబడటంతో పెన్సిల్వేనియాలోని ఖాళీ ప్రదేశంలో కూల్చివేశారు.
ఉదయం 8.46 గంటలకు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 11 ఉత్తర టవర్‌ను ఢీకొట్టింది. 9.03 గంటలకు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 175 దక్షిణ టవర్‌ను ఢీకొట్టింది. 9.37 గంటలకు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 77 పెంటగాన్‌ను ఢీకొట్టింది. 10.03 గంటలకు ఫ్లైట్ 93 పెన్సిల్వేనియాలో కూలిపోయింది. కొద్దిసేపటికే ట్విన్ టవర్స్ రెండూ కుప్పకూలాయి.
దాదాపు 3 వేల మంది బలి..
9/11 దాడుల్లో 2,977 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో న్యూయార్క్‌లో 2,753 మంది, పెంటగాన్‌లో 184 మంది, ఫ్లైట్ 93లో 40 మంది ఉన్నారు. 90కుపైగా దేశాలకు చెందిన ప్రజలు బాధితుల్లో ఉన్నారు. ఈ దాడులకు బాధ్యులు ఆల్‌ఖైదాకు చెందిన 19 మంది హైజాకర్లు. వారంతా ఆల్‌ఖైదా శిక్షణ పొందినవారేనని ఎఫ్‌బీఐ దర్యాప్తులో తేలింది. ఈ దాడుల వెనుక ఆల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఉన్నట్లు దర్యాప్తు నిర్ధారించింది. బిన్ లాడెన్ 2011 మే 2న పాకిస్థాన్‌లోని అబ్బొట్టాబాద్‌లో అమెరికా ప్రత్యేక దళాల ఆపరేషన్‌లో హతమయ్యాడు.
ఇదీ చదవండి: పారిస్‌లోనూ ఇదెక్కడి వివక్ష!


