breaking news
september 11
-
9/11 వేళ.. గాల్లోకి లేచిన ఒకేఒక్క విమానం!
సెప్టెంబర్ 11, 2001.. అమెరికా చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజు. విమానాలను హైజాక్ చేసి అమెరికాపై భీకర దాడులకు పాల్పడింది ఉగ్రసంస్థ అల్‌ఖైదా. అయితే ఆ దాడుల వేళ దేశవ్యాప్తంగా పౌర విమాన రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఆకాశం దాదాపు నిర్మానుష్యంగా మారింది. కానీ.. ఆ భయానక పరిస్థితుల్లోనూ ఓ విమానానికి ప్రత్యేక అనుమతితో గాల్లోకి ఎగిరింది.సెప్టెంబర్ 9/11 దాడుల తర్వాత.. అనంతరం అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దేశవ్యాప్తంగా పౌర విమానాలను నేలకే పరిమితం చేసింది. అమెరికా చరిత్రలో ఇలాంటి దేశవ్యాప్త పౌర విమానాల నిలిపివేత ఇదే తొలిసారి. అయితే ఆనాడు అత్యవసర పరిస్థితుల దృష్ట్యా.. సైనిక, అత్యవసర వైద్య విమానాలే తిరిగాయి. ఈ క్రమంలో.. ఎఫ్ఏఏకు ఓ ఎమర్జెన్సీ కాల్ వచ్చింది.ఫ్లోరిడాకు చెందిన స్నేక్ ఎక్స్పర్ట్ లారెన్స్ వాన్ సెర్టిమా.. ఒక ఇన్లాండ్ టైపాన్ పామును తిరిగి దాని బోనులో పెట్టే ప్రయత్నం చేయగా అది ఆయన బొటనవేలిని కాటేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఇన్లాండ్ టైపాన్ అనేది అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. కాటు తర్వాత ఆయన పరిస్థితి వేగంగా విషమించింది. స్పృహ కోల్పోవడంతోపాటు కళ్ల నుంచి, చెవుల నుంచి, నోటి నుంచి రక్తస్రావం మొదలైంది. మయామిలోని వైద్యులు అందుబాటులో ఉన్న యాంటీవెనమ్తో చికిత్స ప్రారంభించారు. అయితే అది సరిపోలేదు. ఇన్లాండ్ టైపాన్ విషానికి ప్రత్యేకంగా ఉపయోగించే యాంటీవెనమ్ అవసరమైంది. ఆ మందు అప్పట్లో న్యూయార్క్, శాన్‌డియాగోలోని జంతుప్రదర్శనశాలల్లో మాత్రమే లభ్యమవుతోంది. 9/11 దాడులతో న్యూయార్క్ పూర్తిగా కల్లోలంలో ఉండటంతో.. వైద్య బృందం దృష్టి శాన్డియాగోపై పడింది. వాన్ సెర్టిమా పరిస్థితి మరింత విషమించడంతో వైద్య, అగ్నిమాపక అధికారులు విమాన ప్రయాణానికి ప్రత్యేక అనుమతి కోరారు. గంటలపాటు చర్చల అనంతరం FAA అనుమతించింది. 2001 సెప్టెంబర్ 12న శాన్‌డియాగో నుంచి ఒక చిన్న లియర్‌జెట్ బయలుదేరింది. విమానం అమెరికా మీదుగా ప్రయాణిస్తుండగా రెండు ఫైటర్ జెట్లు దానికి ఎస్కార్ట్‌గా వెళ్లాయి. శాన్‌డియాగో నుంచి తెచ్చిన అదనపు యాంటీవెనమ్ మయామికి చేరిన తర్వాత వైద్యులు వెంటనే వాన్ సెర్టిమాకు అందించారు. చికిత్సకు స్పందించిన ఆయన చివరకు ప్రాణాలతో బయటపడ్డారు. రెండు రోజుల తర్వాత టీవీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. పాముదేం తప్పు లేదు..తన నిర్లక్ష్యమే కారణమంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారాయన.అమెరికా చరిత్రలో చీకటి రోజుసెప్టెంబర్ 9, 2001.. 19 మంది ఆల్‌ఖైదా ఉగ్రవాదులు నాలుగు వాణిజ్య విమానాలను హైజాక్ చేశారు. రెండు విమానాలను న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్‌ను ఢీకొట్టించారు. మూడో విమానాన్ని వాషింగ్టన్ సమీపంలోని పెంటగాన్‌పైకి దించారు. నాలుగో విమానం ఫ్లైట్ 93ను ప్రయాణికులు తిరగబడటంతో పెన్సిల్వేనియాలోని ఖాళీ ప్రదేశంలో కూల్చివేశారు.ఉదయం 8.46 గంటలకు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 11 ఉత్తర టవర్‌ను ఢీకొట్టింది. 9.03 గంటలకు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 175 దక్షిణ టవర్‌ను ఢీకొట్టింది. 9.37 గంటలకు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 77 పెంటగాన్‌ను ఢీకొట్టింది. 10.03 గంటలకు ఫ్లైట్ 93 పెన్సిల్వేనియాలో కూలిపోయింది. కొద్దిసేపటికే ట్విన్ టవర్స్ రెండూ కుప్పకూలాయి.దాదాపు 3 వేల మంది బలి..9/11 దాడుల్లో 2,977 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో న్యూయార్క్‌లో 2,753 మంది, పెంటగాన్‌లో 184 మంది, ఫ్లైట్ 93లో 40 మంది ఉన్నారు. 90కుపైగా దేశాలకు చెందిన ప్రజలు బాధితుల్లో ఉన్నారు. ఈ దాడులకు బాధ్యులు ఆల్‌ఖైదాకు చెందిన 19 మంది హైజాకర్లు. వారంతా ఆల్‌ఖైదా శిక్షణ పొందినవారేనని ఎఫ్‌బీఐ దర్యాప్తులో తేలింది. ఈ దాడుల వెనుక ఆల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఉన్నట్లు దర్యాప్తు నిర్ధారించింది. బిన్ లాడెన్ 2011 మే 2న పాకిస్థాన్‌లోని అబ్బొట్టాబాద్‌లో అమెరికా ప్రత్యేక దళాల ఆపరేషన్‌లో హతమయ్యాడు. ఇదీ చదవండి: పారిస్‌లోనూ ఇదెక్కడి వివక్ష! -
'విమానం ఢీకొట్టిన అంతస్తుపైనే నాన్న'
న్యూయార్క్: సెప్టెంబర్, 11, 2001. ఆ రోజు అమెరికా చరిత్రలోనే చెరిగిపోని మచ్చ. మరిచిపోలేని ఓ పీడకల. తలుచుకుంటేనే బాధితులకే కాకుండా అమెరికన్లందరికి అమ్మో అని గుండెలను తడుముకునేలా చేసిన ఓ భయంకర సంఘటన. అదే ట్విన్ టవర్స్ బ్లాస్ట్. అమెరికాలోని ప్రముఖ రెండు వాణిజ్య సముదాయాలపై ఉగ్రవాద సంస్థ అల్ ఖాయిదా విమానాలను హైజాక్ చేసి మరి దాడి చేసిన సందర్భం. ఈ ఘటనలో 3000మందికి పైగా చనిపోగా ఎంతోమంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ సమయంలో ఊపిరి బిగపట్టుకొని ఉత్కంఠగా తమవారి జాడకోసం ఎదురుచూసిన వారు ఎందరో.. అలాంటి వారిలోనే ఆ సమయంలో పదకొండేళ్ల ప్రాయంలో ఉన్న ఓ అమ్మాయి తన తండ్రిని కోల్పోయింది. ఈ ఘటన జరిగి దాదాపు నేటికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా క్రిస్టినా రాంకే అనే అమ్మాయి తన తండ్రిని కోల్పోయిన తీరు, ఆ సమయంలో ఆ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితి ఓసారి ఆమె మాటల్లోనే చూస్తే.. '9/11న జరిగిన సంఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడే 15 ఏళ్లు గడిచిపోయాయని అనుకుంటేనే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఈ సంఘటన జరిగినప్పుడు నాకు 11 ఏళ్లు. మా నాన్న దాడికి గురైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ లోని దక్షిణ టవర్ లో ఉద్యోగం చేసేవారు. మేమంతా జిమ్ లో ఉండగా కొంతమంది వచ్చి మా స్కూల్ ఆఫీసుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత జరిగిన విషయం చెప్పారు. నన్ను ఇంటికి తీసుకెళ్లగా అంతా టీవీల ముందు టెన్షన్ గా ఉన్నారు. టవర్లు తగలబడిపోతున్న దృశ్యాలు నా కళ్లకు టీవీలో కనిపించాయి. అవి ఇప్పటికీ నా కళ్లలోనే కనిపిస్తాయి. 3000మంది చనిపోయారు. ఆ సమయంలో నాకు ఆ విషయం తెలియదు. అందులోనే పనిచేస్తున్న నాన్న కనిపించడం లేదని తెలిసింది. అమ్మకు దిగులు మొదలైంది. ఎన్ని ఆస్పత్రులకు పరుగులు పెట్టి నాన్న కోసం గాలించిందో లెక్కే లేదు. ఆ రోజు అమ్మకష్టం అంతాఇంత కాదు. మా చుట్టూ అప్పుడు ఎన్నో ప్రశ్నలు. చివరకు మా దురదృష్టంకొద్ది ఆయన మృతదేహం కూడా లభ్యంకాని పరిస్థితి. ఆ ప్రమాదంలో నాన్న లేడు తిరిగొస్తాడని ఎదురుచూశాం. నాలుగు నెలల తర్వాత ఆయన ఇక లేనట్లేనని నిర్ణయానికి వచ్చాం. నా మిత్రులను కూడా ఎంతోమందిని పోగొట్టుకున్నాను. అమ్మ ప్రతి రోజు ఏడుస్తుండేది. అది నాపై చాలా ప్రభావం పడింది. మా నాన్నకు నేను చాలా ఇష్టం. ఓ ఉగ్ర విమానం ఢీకొట్టిన ఎత్తయిన అంతస్తులో పనిచేసేవారు. నన్ను కొన్నిసార్లు తీసుకెళ్లారు. అప్పుడప్పుడు సరదాగా లిఫ్ట్‌లో చివరి వరకు వెళ్లే వాళ్లం. ఆయనకు సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలు నాతోనే ఉన్నాయి. నా కుటుంబంలో నేనే పెద్దదాన్ని అయినందున ఏదో ఒకటి కుటుంబం కోసం చేయాలని అనుకున్నాను. ప్రస్తుతం వెంచర్ క్యాపిటలిస్టుగా పనిచేస్తున్నాను. 9/11 ఘటన బారిన పడ్డ బాధితుల కుటుంబాల్లోని పిల్లల విద్యావకాశాలకు కూడా నేను కృశిచేస్తున్నాను. ఇది నాకు చాలా ముఖ్యమైనది కూడా' అంటూ క్రిస్టినా చెప్పుకొచ్చింది. (చిన్నప్పుడు తండ్రితో క్రిస్టినా రాంకే(ఫైల్))


