కేర్ గివర్లకు పెరుగుతున్న భారీ డిమాండ్
దేశంలో వేగంగా పెరుగుతున్న వృద్ధ జనాభా
సాక్షి, అమరావతి: దేశంలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని నీతి ఆయోగ్ తన తాజా నివేదికలో పేర్కొంది. 2022లో 14.9 కోట్లు ఉన్న వృద్ధుల సంఖ్య 2031లో 19.4 కోట్లకు చేరుతుందని, 2050 నాటికి ఈ సంఖ్య ఏకంగా 34.7 కోట్లకు పెరుగుతుందని వివరించింది. మొత్తం జనాభాలో 2022లో 10.5 శాతంగా ఉన్న వృద్ధుల సంఖ్య 2050 నాటికి 20.8 శాతానికి చేరుతుందని విశ్లేషించింది. ఈ నేపథ్యంలో కేర్ గివింగ్ (సంరక్షణ) రంగానికి మంచి డిమాండ్ ఉంటుందని అంచనా వేసిన నీతి ఆయోగ్, ఇందుకు సంబంధించి జాతీయ ‘సంరక్షణ’ విధానాన్ని రూపొందించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించింది.
దేశంలో కేర్ ఎకానమీ అభివృద్ధికి నియంత్రణ సంస్థ (నేషనల్ కేర్ గివింగ్ కౌన్సిల్) ఏర్పాటును ప్రతిపాదించింది. 2023లో 2,962 కోట్ల డాలర్లుగా (సుమారు రూ.2.78 లక్షల కోట్లు) ఉన్న భారత సంరక్షణ సేవల మార్కెట్ 2030 నాటికి 7,231 కోట్ల డాలర్లకు (సుమారు రూ.6.80 లక్షల కోట్లు) చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. వ్యవస్థీకృత సంరక్షణ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌కు ఇది నిదర్శనమని నివేదిక పేర్కొంది. ‘వికసిత్ భారత్ : 2047లో సంరక్షకులకు సాధికారత.. సంరక్షణ రంగానికి కొత్త వ్యూహాలు’ పేరుతో రూపొందించిన నివేదికలో ఈ అంశాలను స్పష్టంచేసింది. నివేదికలోని మరికొన్ని అంశాలు..
» వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక సంరక్షణ అవసరమయ్యే ఇతరులకు అందించే సేవల నాణ్యతను మెరుగుపరచడంతో పాటు, సంరక్షణ సేవలను వృత్తిపరంగా తీర్చిదిద్దడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మహిళల కార్మిక భాగస్వామ్యం మెరుగుపడుతుంది.
» శిక్షణ పొందిన సంరక్షణ సిబ్బందిని అందించే విశ్వసనీయమైన గ్లోబల్ హబ్‌గా భారత్‌ను నిలబెట్టేందుకు ఇది దోహదపడుతుంది.
» సంరక్షకులను, సంరక్షణ అవసరమైన వారిని అనుసంధానించడంతో పాటు సేవలకు సులభంగా చేరుకునేలా జాతీయ డిజిటల్ కేర్ గివింగ్ పోర్టల్‌ను ఏర్పాటు చేయాలి.
» సంరక్షకుల పని పరిస్థితులను మెరుగుపరచడంతోపాటు మరింత వ్యవస్థీకృతమైన, నైపుణ్యవంతమైన, సుస్థిరమైన సంరక్షణ ఆర్థిక వ్యవస్థను నిర్మించాలి. ఇందులో భాగంగా సంరక్షకులకు సామాజిక భద్రత, సంక్షేమ ప్రయోజనాలు కల్పించాలి.
» దేశంలో 2.68 కోట్ల మంది దివ్యాంగులు ఉన్న నేపథ్యంలో వ్యవస్థీకృత సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
ప్రపంచవ్యాప్తంగానూ డిమాండ్
ప్రపంచవ్యాప్తంగా సంరక్షకుల కొరత కారణంగా ఏర్పడుతున్న ఆర్థిక అవకాశాన్ని నీతి ఆయోగ్ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. 38 సభ్య దేశాలతో కూడిన ఆర్గనైజేషన్ ఫర్ ఎకనావిుక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ)లో ప్రస్తుత సంరక్షకులు–వృద్ధుల నిష్పత్తిని కొనసాగించాలంటే 2040 నాటికి మరో 60 శాతం మంది కేర్ వర్కర్లు అవసరమవుతారని అంచనా వేసింది. అంటే అదనంగా 1.35 కోట్ల మంది సంరక్షకుల అవసరం ఏర్పడనుందని పేర్కొంది.
అలాగే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనా ప్రకారం 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1.1 కోట్ల మంది ఆరోగ్య, సంరక్షణ సిబ్బంది కొరత ఏర్పడనుందని, దీంతో శిక్షణ పొందిన కేర్ గివింగ్ నిపుణులను అందించే దేశంగా భారత్ ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. ప్రపంచ జనాభా వృద్ధి నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 65 సంవత్సరాలపైన వయస్సు గల జనాభా 70.3 కోట్లు ఉండగా, ఈ సంఖ్య 2050 నాటికి 1.5 బిలియన్లకు చేరుకుంటుంది. ఒక్క అమెరికాలో 2030 నాటికి 1,51,000 మంది సంరక్షణ కార్యకర్తల కొరత ఉంటుందని అంచనా. ఇది 2040 నాటికి 355,000కి పెరుగుతుందని భావిస్తున్నారు.
కోర్సులు సిద్ధం
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ మూడు నుంచి నాలుగు నెలలపాటు వృద్ధుల సంరక్షణ ప్రదాతల కోర్సులో శిక్షణ ఇస్తోంది. వృద్ధులకు అవసరమైన పడక వద్ద సంరక్షణ, సహాయం అందించడం వంటి ప్రధాన అంశాలతో ఈ కోర్సును రూపొందించింది. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి, శిక్షణ పొందిన వారిని ఆసుపత్రులు, వృద్ధుల సంరక్షణ యూనిట్లు, వృద్ధాశ్రమాలలో పూర్తికాల ప్రాతిపదికన నియమిస్తారు. ప్రారంభంలో నెలకు సగటున రూ.16,000 నుంచి రూ. 30,000 వరకు జీతం ఉంటుంది. తరువాత రూ.40,000 నుండి రూ.50,000 వరకు పెరుగుతుంది. పార్ట్ టైమ్ ప్రాతిపదికన సంరక్షణ సేవలు అందించేవారు రోజుకు సుమారు రూ.1,200 నుంచి 1,500 వరకు సంపాదిస్తారు.
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్.. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సహకారంతో 21–45 సంవత్సరాల వయస్సు గల, బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ఇంటిగ్రేటెడ్ జెరియాట్రిక్ కేర్‌లో పీజీ డిప్లొమా కోర్సును అందుబాటులోకి తెచ్చింది. సోషల్ వర్క్, నర్సింగ్ వంటి సంబంధిత రంగాలలో ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి సైద్ధాంతిక జ్ఞానాన్ని, ఆచరణాత్మక నైపుణ్యాలను అందించి, వారిని ఒక మేనేజర్ పాత్రలో వివిధ సంరక్షణ కేంద్రాలలో వృద్ధుల సంక్లిష్ట అవసరాలను తీర్చడానికి సిద్ధం చేస్తుంది. ప్రాథమిక కోర్సు పూర్తి చేసిన తర్వాత శిక్షణార్థులు నెలకు సగటున రూ. 40,000 నుండి రూ. 80,000 వరకు జీతం పొందుతారు.


