30 శాతం ఐఆర్ వెంటనే ప్రకటించాలి
ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలు రూ.40 వేల కోట్లు ఎప్పుడు చెల్లిస్తారు?
ఆస్పత్రులకు ఈహెచ్‌ఎస్ బకాయిలు చెల్లించాలి
వైఎస్సార్‌సీపీ ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి
సాక్షి, అమరావతి: ఉద్యోగులు, పెన్షనర్లను చంద్రబాబు కూటమి ప్రభుత్వం మరోసారి తీవ్ర నిరాశకు గురిచేసిందని వైఎస్సార్‌సీపీ ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఉద్యోగులు, పెన్షనర్లకు మంచి పీఆర్‌సీ ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అప్పటికే నియమించిన పీఆర్‌సీ కమిషనర్‌ను పంపించేసి, 27 నెలల తర్వాత కొత్త కమిషనర్‌ను నియమించడం వల్ల ఉద్యోగులకు ఒరిగేదేమిటని ప్రశ్నించారు.
మంచి ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ఇవ్వాల్సిన ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆక్షేపించారు. పీఆర్‌సీ అమలుకు ఇంకా సమయం పడుతుందని, ఈలోగా ఉద్యోగులు, పెన్షనర్లు కోరుతున్న 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్)ని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చిందని గుర్తుచేశారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీ మేరకు కనీసం 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.40 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని, వాటిని ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాల్సిందేనని అన్నారు.
ఒక్క సరెండర్ లీవ్‌ను.. అదీ సంక్రాంతి సమయంలో ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని, మిగతా సరెండర్ లీవ్ బకాయిలపై ఎందుకు మాట్లాడటంలేదని నిలదీశారు. 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ పెన్షన్‌ను 7 శాతం నుంచి 10 శాతానికి, 75 ఏళ్లు దాటిన వారికి 12 శాతం నుంచి 15 శాతానికి పెంచుతామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్ల నుంచి ప్రతి నెలా వారి వాటాను ప్రభుత్వం మినహాయించుకుంటోందని, దానికి ప్రభుత్వం తన వాటాను కలిపి ఎప్పటికప్పుడు సంబంధిత ఆస్పత్రులకు చెల్లించాల్సి ఉందన్నారు.
ప్రభుత్వం ఈ బకాయిలు చెల్లించకపోవడంతో కొన్ని ఆస్పత్రుల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవలను నిరాకరిస్తున్నారని తెలిపారు. ఈహెచ్‌ఎస్‌ను సక్రమంగా అమలు చేసి, ఆస్పత్రుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగులు, పెన్షనర్ల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. ప్రభుత్వం ఉద్యోగులతో పెట్టుకుంటే ఎన్నికల సమయంలో ఏం జరగుతుందో ఆలోచించుకోవాలని చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు.


