సీఎం నివాసం వద్ద గొడవ పడుతున్న ఉద్యోగ సంఘాల నాయకులు
ఐఆర్ ప్రకటించకపోతే చర్చలు ఎలా ఫలప్రదమైనట్లు?
పెండింగ్ బకాయిల ఊసే లేకపోతే ఉద్యోగులకు ఏం చెప్పాలి?
సీఎం ప్రకటనపై ఉద్యోగ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు
ఇదే విషయమై సీఎం నివాసం వద్ద ఉద్యోగ సంఘాల నేతల ఘర్షణ
పరస్పరం కాలర్లు పట్టుకుని తోపులాట
సాక్షి, అమరావతి/మంగళగిరి టౌన్: ‘ఇవేం చర్చలు.. అసలు ఐఆర్ చాలా ముఖ్యమైన విషయం కదా.. దాని ప్రస్తావనే లేకుండా చర్చలు ఎలా ఫలప్రదమైనట్లు.. ఇలాగైతే ఎలా? బకాయిల గురించి కూడా స్పష్టమైన హామీ లేదు. ఇప్పుడు ప్రజలకు మనం ఏం చెప్పాలి?’ అని ఉద్యోగులకు చంద్రబాబు తాజాగా ఇచ్చిన హామీలపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఐఆర్ ఇవ్వకపోయినా చర్చలు ఫలప్రదమైనట్లు చెప్పుకోవడాన్ని కొన్ని సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ క్రమంలో చర్చలు ముగిసిన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులు బయటకు వచ్చి మాట్లాడే సమయంలో తోపులాట చోటుచేసుకుంది.
ఉద్యోగ సంఘ నాయకుడు సూర్యనారాయణ మైకును వదలకుండా అదే పనిగా మాట్లాడుతుండడంపై ఏపీ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎంతో మాట్లాడి ప్రకటన చేయించింది తామైతే నీ హడావుడి ఏమిటంటూ పలువురు సూర్యనారాయణను నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాల నేతలు పరస్పరం కాలర్లు పట్టుకుని తోసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
సమావేశంలో చర్చించిన అంశాలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలపై వివిధ సంఘాల నేతలు తమ అభిప్రాయాలను మీడియాకు వెల్లడించే క్రమంలో పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలకు వ్యతిరేకంగా ఏపీ ఎన్‌జీవో సంఘం నేతలు, ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరగడంతో తోపులాట జరిగింది.
ప్రభుత్వానికి తలొగ్గారంటూ ఆరోపణలు
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారని, వారు ప్రభుత్వానికి తలొగ్గారని కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపించారు. సీఎం చర్చలకు పిలవడం.. చాలా సమస్యలున్నప్పటికీ ఒకటి రెండు సమస్యలనే అరకొరగా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇవ్వడం.. ఇందుకు అన్ని సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం తాజా వివాదానికి కారణమైంది. తమ డిమాండ్ల సాధన విషయంలో ఉద్యోగ సంఘాలన్నీ ఐక్యంగా పోరాడాల్సిన సమయంలో ఒకటి రెండు అరకొర హామీలకే ఒప్పుకోవడంపై ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధానంగా పెండింగ్ బకాయిలు ఎప్పుడు, ఎలా ఇస్తారన్న దానిపై స్పష్టత రాకపోవడాన్ని ఉద్యోగులు ఎత్తి చూపుతున్నారు.
జిల్లా నేతలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ
ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఐఆర్‌పై సీఎం ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్న ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించి ఉంటే బావుండేది. సీఎంతో జరిగిన చర్చలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో ఉన్న 21 సంఘాలను ఆహ్వానించాల్సి ఉన్నా, కేవలం 11 సంఘాలను మాత్రమే పిలవడం బాధాకరం. సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే వరకు ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తాం.
ఆదివారం మా జేఏసీలోని 28 జిల్లాల నాయకులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన హామీలు కూడా మేము చేపట్టిన ఉద్యమం ఫలితంగానే సాధ్యమయ్యాయి. బకాయిలపై స్పష్టత ఇవ్వకపోవడంపైనా అసంతృప్తి ఉంది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఇంక్రిమెంట్‌లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 62 ఏళ్లకు రిటైర్‌మెంట్ వయస్సు పెంచాలని కోరాం. ఈ విషయాన్ని కూడా పరిశీలించి నివేదిక ఇవ్వాలని సీఎం ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు
తర్వాత దశలో ఐఆర్ చూస్తామన్నారు
రెండు డీఏలను అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఇస్తామని సీఎం చెప్పారు. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున ఉద్యోగులు సంయమనం పాటించాలని సీఎం సూచించారు. సీఎం ఉద్యోగులకు ప్రకటించిన అంశాలకు సంబంధించి ఏటా రూ.2,880 కోట్ల అదనపు వ్యయం అవుతుందని చెప్పారు. ఈ రెండేళ్లలో కామన్ ఎంప్లాయీస్‌కు ఎటువంటి లబ్ధి కలగలేదని చెప్పాం. ప్రకటించిన నిర్ణయాలను సత్వరమే అమలు చేయాలని, మిగిలిన సమస్యలను కూడా దశల వారీగా పరిష్కరించాలని కోరాం. – విద్యాసాగర్, ఏపీ జేఏసీ, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు
ఈ చర్చలు ఎలా సఫలమైనట్లు?
ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వకపోవడం అన్యాయం. దీని గురించి ప్రకటన చేయకుండా చర్చలు సఫలమైనట్లు చెప్పుకోవడం సరికాదు. అధికారంలోకి రాగానే మంచి పీఆర్సీ ఇస్తామని, ఐఆర్ ప్రకటిస్తామని చెప్పారు. 30 నెలలు గడిచింది. ఏమీ లేదు. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను తొలగించి కాలయాపన చేశారు. సీఎంతో జరిగిన చర్చల్లో ఐఆర్ ప్రకటిస్తారని ఉద్యోగులంతా ఎదురు చూశారు. కేవలం పీఆర్సీ కమిషన్ నియామకం, రెండు డీఎలతో చర్చలు ముగించడం సరికాదు. 30% ఐఆర్ వెంటనే ప్రకటించాలి., నిర్దిష్ట కాలపరిమితితో పీఆర్సీ కమిషన్ ఛైర్మన్‌ను నియమించాలి. ప్రకటించిన డీఏలకు అరియర్స్‌పై ప్రకటన చేయాలి. మిగిలిన 3 డీఏలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. – జాలిరెడ్డి, షేక్ జంషీద్, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్


