ఎన్నికల హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు
ఐదు డీఏలు పెండింగ్ ఉంటే రెండే ఇస్తారా?
ఈమాత్రం దానికే ఉద్యోగ సంఘం నేతలు బాణాసంచా కాల్చాలా?
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి
కడప వైఎస్సార్ సర్కిల్: చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు అయినా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయకుండా వారిని మోసం చేస్తోందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఆయన శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చర్చలకు పిలిస్తే ఏదో చేస్తారని ఆశపడి వెళ్లారని, చివరికి రెండు డీఏలు, పోలీసులకు ఒక సరెండర్ లీవు ఇచ్చి నిరాశే మిగిల్చారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఐదు డీఏలు పెండింగ్ ఉంటే రెండే ఇస్తారా అని ప్రశ్నించారు.
ఈమాత్రం దానికే ఉద్యోగ సంఘం నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకోవడం విచిత్రంగా ఉందన్నారు. పీఆర్సీ కమిషన్, ముఖ్యమైన ఐఆర్ ఎక్కడని నిలదీశారు. సీపీఎస్ విషయంలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలు కూటమి ప్రభుత్వం ఇచ్చిందో లేదో సమాధానం చెప్పాలన్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించామని చెబుతున్న చంద్రబాబు సర్కారు ఆ వివరాలు ఇవ్వాలని కోరితే ఆర్థిక శాఖ వద్ద లేవంటున్నారన్నారు. మరి బకాయిలు చెల్లించామని ఎలా చెప్పుకొంటారని ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే ఉద్యోగులకు మేలు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే ఉద్యోగులకు మేలు జరిగిందని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 27 శాతం ఐఆర్ ఇచ్చిందని, అన్ని వర్గాల వారికి జీతాలు పెంచిందని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకుందని గుర్తు చేశారు. కరోనా సమయంలో కేంద్రం డీఏలను ఫ్రీజ్ చేస్తే.. అది అయిపోగానే గత ప్రభుత్వం ఒక్కసారే ఐదు డీఏలు ఇచ్చిందని తెలిపారు. కరోనా సంక్షోభం కారణంగా ఫిట్‌మెంట్ 23 శాతం ఇస్తే రివర్స్ పీఆర్సీ అని చంద్రబాబు అంటున్నారని, మీకు చేతనైతే ఆ రివర్స్ పీఆర్సీ అయినా ఇవ్వండని అన్నారు. రెండున్నరేళ్లుగా ఐఆర్ లేకుండా ఉండటం ఎప్పుడూ జరగలేదన్నారు. ఈరోజు ఐఆర్ లేదు, పీఆర్సీ లేదు, పింఛను స్కీమ్ కూడా లేవన్నారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి భజన చేయడం మొదలు పెడితే ఇక ప్రభుత్వం సమస్యలు ఎందుకు పరిష్కరిస్తుందని ప్రశ్నించారు.
ఉపాధ్యాయుల సస్పెన్షన్లపై ఆగ్రహం
చంద్రబాబు ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడి పెంచడం తప్ప జీతాల పెంపు, ప్రమోషన్లు లేవన్నారు. వందలాది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఉన్న టీచర్లను టెట్ రాయాలంటారు కానీ.. వాళ్లు మాత్రం టెట్ లేకుండానే ఉద్యోగాలిస్తారని ఎద్దేవా చేశారు. డీఎస్సీలో ఎంపికైన ఉద్యోగులతో ర్యాలీలు చేయిస్తూ రాజకీయాలకు వాడుకోవడం దారుణమన్నారు.
టెట్ గురించి కేంద్ర మంత్రిని కలిస్తే వారిపై అబద్ధపు ప్రచారం చేసి సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఏమీ చేయదని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి వరదారెడ్డి, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఎస్వీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


