సైబర్ వేధింపులు, ఆన్‌లైన్ లైంగిక దోపిడీ నుంచి వారికి రక్షణ కల్పించాలి
వారి సంక్షేమానికి ప్రభుత్వ శాఖలు, న్యాయవ్యవస్థ సమన్వయంతో పనిచేయాలి
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పిలుపు
జువెనైల్ జస్టిస్ యాక్ట్‌పై జరిగిన సమావేశంలో ప్రసంగం
సాక్షి, అమరావతి: పేదరికం, సామాజిక నిర్లక్ష్యం, ప్రతికూల పరిస్థితుల కారణంగానే ఎక్కువ మంది చిన్నారులు జువెనైల్ జస్టిస్ వ్యవస్థ పరిధిలోకి వస్తున్నారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. బాలలు దేశానికి అత్యంత విలువైన మానవ వనరు, గొప్ప ఆస్తి అని ఆమె కొనియాడారు. జువెనైల్ జస్టిస్ (బాలల న్యాయ సంరక్షణ, భద్రత) చట్టం–2015 అమల్లోకివచ్చి పదేళ్లయిన సందర్భంగా విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సంప్రదింపుల సమావేశం–2026లో ఆమె ప్రసంగిస్తూ, ‘జువెనైల్ జస్టిస్ బోర్డులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, బాలల సంరక్షణ సొసైటీలు, జిల్లా బాలల సంరక్షణ విభాగాలు, ప్రత్యేక జువెనైల్ పోలీసు యూనిట్లు, బాలల సంరక్షణ సంస్థలను ఏర్పాటు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు వస్తున్నాయా? అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి.
సైబర్ వేధింపులు, నియంత్రణలేని డిజిటల్ కంటెంట్ చిన్నారుల భద్రతకు ముప్పుగా మారుతున్నాయి. ఈ సమస్యలను అధిగవిుంచడానికి తగిన ప్రయత్నం జరగాలి. బాలల సంరక్షణలో పోలీసు, మహిళా–శిశు సంక్షేమ, సాంఘిక సంక్షేమ, విద్యాశాఖలతోపాటు న్యాయవ్యవస్థ, రాష్ట్ర–జిల్లా న్యాయసేవాధికార సంస్థలు, పౌర సమాజ సంస్థలు సమన్వయంతో పనిచేయాలి. స్వల్ప నేరాలకు సంబంధించిన కేసుల్లో బాలలను సాధ్యమైనంత వరకు అధికారిక న్యాయస్థాన ప్రక్రియకు దూరంగా ఉంచాలి’ అని పేర్కొన్నారు.
సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.సురేష్‌రెడ్డి, జస్టిస్ బీఎస్ భానుమతి, జస్టిస్ వి.సుజాత, జస్టిస్ డాక్టర్ వెంకటజ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ కిరణ్మయి మండవ, జస్టిస్ రవినాథ్ తిల్హరి, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎ.సూర్యకుమారి, డైరెక్టర్ ఎం. వేణుగోపాలరెడ్డి, సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. పోలీస్, మహిళా, శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ అధికారులతో పాటు బాలల కోసం పని చేస్తున్న వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
ఎవరెస్ట్ అధిరోహకులకు సత్కారం
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన 21 మంది విద్యార్థులను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ఈ సందర్భంగా సత్కరించారు. దేశంలోని ఇతర పిల్లలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. బాలల సంరక్షణ కోసం చేసే ప్రతి ప్రయత్నం దేశ భవిష్యత్‌పై పెట్టే అత్యంత కీలకమైన పెట్టుబడి అని జస్టిస్ లీసా గిల్ స్పష్టం చేశారు.


