జనరల్ అభ్యర్థికి రూ.5 వేల డిపాజిట్.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.2,500
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీచేసింది. మేయర్ ఎన్నికను ప్రత్యక్ష విధానంలో నిర్వహిస్తుండడంతో అందుకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. మేయర్, కార్పొరేటర్ల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ‘ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్స్ (కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ మేయర్ అండ్ వార్డు మెంబర్స్) రూల్స్–2026’ను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ శనివారం జీఓఎంఎస్ నంబర్ 211 జారీచేసింది. ఈ కొత్త నిబంధనలు మున్సిపల్ కార్పొరేషన్లకు మాత్రమే వర్తిస్తాయి.
ఒక ఓటరు.. రెండు ఓట్లు..
» ఒక ఓటరు ఈ ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థికి ఒక ఓటు, మేయర్‌కు ఒక ఓటు వేయాల్సి ఉంటుంది. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరికీ ఓటు వేయకూడదనుకునే వారికి నోటా అవకాశం కల్పించారు.
ూ మేయర్ లేదా కార్పొరేటర్‌గా పోటీచేసే సాధారణ అభ్యర్థి రూ.5,000 డిపాజిట్ చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.2,500గా నిర్ణయించారు. ఒకే వార్డుకు ఒక అభ్యర్థి నాలుగు నామినేషన్లు దాఖలు చేసినా ఒక డిపాజిట్ సరిపోతుంది. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా నాలుగు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. నామినేషన్‌తో పాటు క్రిమినల్ కేసులు, ఆస్తులు, అప్పులు, విద్యార్హతల వివరాలతో అఫిడవిట్ సమర్పించాలి.
» అంధులు, శారీరక వైకల్యం కారణంగా స్వయంగా ఓటు వేయలేని వారికి 18 ఏళ్లు నిండిన సహాయకుడి ద్వారా ఓటువేసే అవకాశం ఉంటుంది. అయితే, ఒకే సహాయకుడు ఒకరి కంటే ఎక్కువమందికి సాయం చేయకూడదు.
» పోలింగ్ ఏజెంట్ ఓటరు గుర్తింపును సవాలు చేయవచ్చు. ఇందుకు రూ.10 డిపాజిట్ చేయాలి. ప్రిసైడింగ్ అధికారి విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటారు.
» ఎన్నికల విధుల్లో ఉన్న అర్హులైన సిబ్బంది, రాష్ట్రం వెలుపల విధుల్లో ఉన్న సాయుధ దళాల సిబ్బంది, చట్టపరమైన నిర్బంధంలో ఉన్న అర్హులైన ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటువేసే అవకాశం ఉంటుంది.
» ఫలితాలు ప్రకటించిన తర్వాత అభ్యర్థి లేదా అతని ఎన్నికల ఏజెంట్ రాతపూర్వకంగా రీకౌంటింగ్ కోరవచ్చు. దానిపై నిర్ణయం తీసుకునే అధికారం రిటర్నింగ్ అధికారికి ఉంటుంది.
» ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థికి వచ్చిన చెల్లుబాటు అయ్యే ఓట్లు మొత్తం చెల్లిన ఓట్లలో 1/6 కంటే ఎక్కువ లేకపోతే డిపాజిట్ జప్తు అవుతుంది.
» పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల పత్రాలు, ఓటర్ల జాబితాలను సీలు చేసి సురక్షితంగా భద్రపరుస్తారు. ఎన్నికల పత్రాలను నిర్ణయించిన కాలపరిమితి వరకు భద్రపరిచే విధానాన్ని కూడా ప్రభుత్వం నిర్దేశించింది.


