ఫండే
క్లూషియల్
డీజీపీ చాంబర్...
మేజర్ సూరజ్ మెహతా మొహంలో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
ఎదురుగా క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ అభిమన్యు.
‘దేశ సరిహద్దు రక్షణకు సంబంధించిన అత్యంత రహస్యమైన డ్రోన్ ఆటోమేషన్ బ్లూప్రింట్స్– కీలకమైన డిఫెన్స్ డాక్యుమెంట్స్ ఉన్న కవరును తీసుకుని ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చారు. మేజర్ సూరజ్ మెహతా– ఆ పత్రాలను ఐటీ కారిడార్‌లోని డిఫెన్ ్స రీసెర్చ్ విభాగానికి అందజేయాల్సి ఉంది.
‘మేజర్ సూరజ్ మెహతా నిన్న రాత్రి బంజారాహిల్స్‌లోని ఒక లగ్జరీ హోటల్‌లో బస చేశారు. రాత్రి ఆయన భద్రంగా దాచుకున్న ఆ రహస్య కవరు ఉదయం చూసేసరికి మాయమైంది. ప్రభుత్వ అధికారిక లక్క ముద్ర ఉన్న ఆ కవరు పోవడం చాలా ప్రమాదకరం...’ డీజీపీ గంభీరంగా చెప్పాడు.
‘అవును మిస్టర్ అభిమన్యు! ఎన్ ఐఏ, సీబీఐ ఇప్పటికిప్పుడు రంగంలోకి దిగే పరిస్థితి లేదు. చాలా కాన్ఫిడెన్షియల్... మీ ప్రతిభ గురించి విన్నాం... మీరే ఈ కేసును సాల్వ్ చేయాలి.’ మేజర్ మెహతా అన్నాడు.
‘డోంట్ వర్రీ... దేశ రక్షణ మన బాధ్యత, మీరు నిశ్చింతగా వుండండి.’ చెప్పి బయటకు నడిచాడు అభిమన్యు.
అతడిని అనుసరించాడు మేజర్ సూరజ్ మెహతా.
అభిమన్యు వెంటనే మేజర్ సూరజ్ మెహతాతో కలిసి హోటల్ రూమ్ నంబర్ 404కి చేరుకున్నాడు. రూమ్‌లో ఎలాంటి గొడవ జరిగిన ఆధారాలు లేవు. లాకర్ తాళాలు మేజర్ సూరజ్ పాకెట్‌లోనే ఉన్నాయి. ‘రాత్రి నేను గది తాళం వేసుకుని పడుకున్నాను. కిటికీలు కూడా లోపలి నుంచే బంధించి ఉన్నాయి. మరి కవరు ఎలా మాయమైంది?’
హోటల్‌లో ఉన్న అన్ని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న అభిమన్యుకు గ్రౌండ్ ఫ్లోర్‌లో డస్ట్ బిన్లను తీసుకువెళ్తున్న రూమ్ బాయ్ కనిపించాడు. ఆ డస్ట్ బిన్లలో ఉన్న చెత్తను ఇంకా మునిసిపల్ వ్యాన్‌లో తరలించలేదు. వెంటనే ఆ చెత్తలో వెతికితే కవర్ దొరికింది.
‘కవర్ దొరికింది. కానీ డస్ట్ బిన్‌లోకి ఎలా వెళ్ళింది?’ తనలో తానే గొణుక్కుంటున్నట్టు అన్నాడు మేజర్ సూరజ్ ఆ కవర్ వంక చూసి.
ఇన్‌స్పెక్టర్ అభిమన్యు తన ట్రెంచ్ కోట్ జేబులోంచి భూతద్దం తీసి ఆ కవర్‌ను పరిశీలించాడు. ‘లక్క ముద్ర అలాగే ఉంది కానీ, లోపల ఉన్న దేశ రహస్యాలు ఇప్పటికే లీక్ అయిపోయాయి!’ అభిమన్యు అన్నాడు.
మేజర్ సూరజ్ షాకింగ్‌గా చూస్తూ వుండిపోయాడు ‘ ఇప్పుడెలా? అతని గొంతులో ఆందోళన.
‘లీకైన రహస్యాలు బయటకు పొక్కకముందే లాక్ అవుతాయి.’ అభిమన్యు చెప్పాడు. అప్పటికే అతని బ్రెయిన్ మ్యాప్ పనిచేస్తోంది.
అభిమన్యు వెంటనే హోటల్‌లో బస చేసిన వారి రికార్డులను పరిశీలించాడు. అదే ఫ్లోర్‌లో ఉన్న ఒక విదేశీ ప్లాస్టిక్ సర్జన్ ప్రొఫైల్ అతని దృష్టికి వచ్చింది.
వెంటనే డూప్లికేట్ కీతో గది ఓపెన్ చేశాడు.
∙∙
ఫెడరిక్ మాస్టర్ కీతో గది తలుపు తెరిచి షాకయ్యాడు. అతనిలో ఏదో అనుమానం.
‘హలో మిస్టర్ ఫ్రెడరిక్ అమెరికా ఎఫ్‌బీఐకి కూడా దొరక్కుండా మా దేశానికి ఎందుకు వచ్చావ్? ఆ మాటలు విని ఆ స్పై సర్జన్ ఫెడరిక్ జేబులో నుంచి రివాల్వర్ తీయబోయాడు. అప్పటికే అతని వెనుక రివాల్వర్‌తో అభిమన్యు.
∙∙
‘ఫెడరిక్ మిమ్మల్ని ఢిల్లీ నుంచి ఫాలో అవుతూ వచ్చాడు. ఒక ప్రొఫెషనల్ మాత్రమే ఇలా చేయగలడు. అతని గురించి ఆరా తీస్తే డొంక కదిలింది. ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో వున్నాడు.
కవరు సీల్ పాడవకుండా ఉండటానికి, దాని అంచున ఒక చిన్న సూదితో రంధ్రం చేశాడు. ఆ రంధ్రం గుండా 0.5 ఎంఎం వ్యాసం కలిగిన అత్యంత సన్నని ఆప్టికల్ ఫైబర్ ఎండోస్కోపీ స్పై కెమెరా కేబుల్‌ను కవరు లోపలికి చొప్పించాడు. వైద్య రంగంలో శరీర భాగాలను పరీక్షించడానికి వాడే ఈ సాంకేతికతను, నేరగాళ్లు మన దేశ రహస్యాలను దొంగిలించడానికి వాడారు. లోపల ఉన్న పేపర్ల మడతలను, అందులోని అక్షరాలను ఆ కెమెరాకు ఉన్న మైక్రో–లైట్ సాయంతో స్పష్టంగా స్కాన్ చేశాడు. ఆ డేటా మొత్తం వై–ఫై ద్వారా వాళ్ల సర్వర్‌కు సెకన్ల వ్యవధిలో చేరిపోయింది. పని పూర్తయ్యాక, కెమెరాను బయటకు తీసి, ఆ రంధ్రం ఎవరికీ కనపడకుండా ఒక ప్రత్యేకమైన బూడిద రంగు గ్లూతో మూసేసి, కవరును డస్ట్‌బిన్ లో పడేశాడు. కవర్ దొరికిందని మీరు అనుకుంటారు. కానీ రహస్యాలు వెళ్లిపోతాయి.’
ఫెడరిక్ లగేజీని తనిఖీ చేయగా, అందులో ఫెడరిక్ వాడిన మైక్రో–ఎండోస్కోపీ పరికరం ల్యాప్‌టాప్ దొరికాయి. ల్యాప్‌టాప్‌ను పరిశీలించగా, డిఫెన్ ్స పేపర్ల డిజిటల్ కాపీలు అందులో ఉన్నాయి. వాటిని ఇంకా వేరే సర్వర్‌కు అప్‌లోడ్ చేయలేదు. మన దేశ రక్షణకు ఏ సమస్యా లేదు. ఇతడిని ఎఫ్‌బీఐకి అప్పగించండి.
ఒక చిన్న సూది రంధ్రం వెనుక ఉన్న అంతర్జాతీయ సాంకేతిక నేరాన్ని ఇన్‌స్పెక్టర్ అభిమన్యు ఎనలైజ్ చేస్తూ చెప్పాడు.
‘థాంక్యూ మిస్టర్ అభిమన్యు. మీ మేలు మర్చిపోలేను... మీరు జీనియస్.. బుద్ధిబలం, భుజబలం, మీ సొత్తు. మీ శక్తియుక్తులు రెండు రాష్ట్రాలకే కాదు మొత్తం దేశానికే అవసరం. మా ఆర్మీ మీ కోసం ఎదురు చూస్తుంది.’ అంటూ కరచాలనం చేస్తూ వీడ్కోలు తీసుకున్నాడు సూరజ్ మెహతా.
అవును... అభిమన్యుకు ఏదో రోజు దేశ రక్షణకు పిలుపు వస్తుంది.
- శ్రీసుధామయి
ఇదీ చదవండి: కూతురి కోసం తండ్రి మొక్కు.. 75 ఏళ్లుగా దేశానికే పండుగ!


