‘అమ్మా.. నా ఇంటికి నన్ను తీసుకెళ్లు!’ బాలుడి మాటలలో మిస్టరీ! | Four Year Old Boy Past Life Memories Hollywood Mystery | Sakshi
Sakshi News home page

‘అమ్మా.. నా ఇంటికి నన్ను తీసుకెళ్లు!’ బాలుడి మాటలలో మిస్టరీ!

Sep 20 2026 7:20 AM | Updated on Sep 20 2026 7:20 AM

Four Year Old Boy Past Life Memories Hollywood Mystery

డాక్టర్‌ జిమ్‌ టక్కర్‌, తల్లితో ర్యాన్‌ - గత​ జన్మలో మార్టిన్‌(ర్యాన్‌)

ఫండే

మిస్టిక్‌ వరల్డ్‌

2010... ఓక్లహామా
నగరం ప్రశాంతంగా నిద్రపోతోంది. రోడ్డుపై అడపాదడపా వెళ్లే వాహనాలు మినహా ఎలాంటి అలికిడీ లేదు. అంతలో ర్యాన్‌ హ్యామన్స్‌ అనే నాలుగేళ్ల బాలుడు నిద్రలోనే గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. అది విని తల్లి సిండీ మేలుకుంది. ఏదైనా పీడకల వచ్చేందేమో అనుకుని ర్యాన్‌ను దగ్గరకు తీసుకుని ఓదార్చింది. అయినా ఆ బాలుడు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూనే ఉన్నాడు. కాసేపటి తర్వాత నెమ్మదిగా కళ్లు తెరిచాడు.

‘అమ్మా... నన్ను హాలీవుడ్‌లోని నా ఇంటికి తీసుకెళ్లు. అక్కడున్న నా వాళ్లను వెంటనే చూడాలి’ అని అనేసరికి సిండీకి ఏమీ అర్థం కాలేదు. ఏదైనా కల వచ్చి అలా అన్నాడేమో అని సరిపెట్టుకుంది. రోజులు గడిచేకొద్దీ ర్యాన్‌ మాటలు మరింత విచిత్రంగా మారాయి. 
‘నాకు పెద్ద ఇల్లు, కారు ఉండేవి. ఇంటి ముందు స్విమ్మింగ్‌ పూల్‌ కూడా ఉండేది. నేను చాలా డబ్బున్నవాడిని’ అని తరచుగా చెబుతుండేవాడు. తాను గతంలో మరో కుటుంబంతో జీవించానని, అక్కడికి తిరిగి వెళ్లాలని పట్టుబట్టేవాడు. అతడి మాటల్లో ఏౖదైనా నిజం ఉందేమో తెలుసుకోవాలని భావించిన సిండీ, ఓ రోజు లైబ్రరీ నుంచి హాలీవుడ్‌కు సంబంధించిన కొన్ని పుస్తకాలు తెప్పించి కుమారుడికి ఇచ్చింది.

అవి చూస్తున్న ర్యాన్‌కు 1932లో వచ్చిన ‘నైట్‌ ఆఫ్టర్‌ నైట్‌’ సినిమా ఫొటో ఒకటి బాగా ఆకర్షించింది. అందులో ఓ వ్యక్తిని చూపిస్తూ, ‘ఇది నేనే...’ అంటూ బిగ్గరగా అరిచాడు. ఆ వ్యక్తిని చూసిన తల్లికి ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ వ్యక్తి సినిమాలో హీరో కాదు. పెద్ద నటుడు కూడా కాదు. ఆయన పేరు కూడా ఫొటోలో లేదు. ఆ ఫొటోలోని ఓ వ్యక్తిని చూపించి, అతడు జార్జ్‌ అని చెప్పాడు. నిజంగానే అతడు ప్రముఖ నటుడు జార్జ్‌ రాఫ్ట్‌ కావడంతో సిండీ అయోమయానికి గురైంది.

‘ఇది కేవలం ఓ చిన్నారి ఊహా? లేక నిజంగా అతడి జ్ఞాపకాల్లో దాగిన ఏదైనా గతం ఉందా?’ ఈ ప్రశ్నే చివరకు ఈ కేసును డాక్టర్‌ జిమ్‌ టక్కర్‌ వద్దకు తీసుకెళ్లింది. గత జన్మ జ్ఞాపకాలపై పరిశోధనలు చేస్తున్న ఆయన, ఈ ఉదంతంపై లోతుగా అధ్యయనం చేశారు. ఆ ఫొటోలోని వ్యక్తిని మార్టీ మార్టిన్‌ అని గుర్తించారు. ‘నైట్‌ ఆఫ్టర్‌ నైట్‌’ సినిమాలో చిన్న పాత్ర చేసిన మార్టిన్, తర్వాత నటనను పక్కనపెట్టి హాలీవుడ్‌లో టాలెంట్‌ ఏజెంట్‌గా ఎదిగాడని, 1964లో మరణించాడని తెలుసుకున్నారు.

ఇక్కడి నుంచి ర్యాన్‌ కథ మరింత ఆసక్తికరంగా మారింది. దీంతో అతడు చెబుతున్న విషయాలను సిండీ డైరీలో రాయడం ప్రారంభించింది. తనకు ఒక కుమార్తె ఉందని చెప్పిన ర్యాన్, తాను ఎన్నో సముద్ర ప్రయాణాలు చేశానని, అందమైన మహిళలతో కలిసి డ్యాన్స్‌ చేశానని చెప్పాడు. ఇవన్నీ సరిపోల్చుకోవాలని టక్కర్‌ భావించారు. దీంతో ర్యాన్‌ కు కొన్ని ఫొటోలను చూపించారు. వాటిలో మార్టీకి తెలిసిన వ్యక్తులతోపాటు ఎలాంటి సంబంధంలేని వారు కూడా ఉన్నారు.

‘వీరిలో ఎవరైనా నీకు పరిచయంగా అనిపిస్తున్నారా?’ అని టక్కర్‌ అడిగితే, ర్యాన్‌ కొన్ని ఫొటోలను ఎంచుకున్నాడు. అందులో ఒకరు మార్టీకి పరిచయం ఉన్న వ్యక్తిగా తేలారు. మార్టీ నాలుగో భార్య ఫొటోను కూడా చూపించాడు. అయితే ఈ పరీక్షలో కొన్ని విషయాలు సరిపోలలేదు. దీంతో టక్కర్‌ ఈ కేసును మరింత జాగ్రత్తగా పరిశీలించారు.

ఈ క్రమంలో మార్టిన్‌ కుమార్తెతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అప్పటిదాకా బయటి ప్రపంచానికి తెలియని, కుటుంబానికి మాత్రమే తెలిసిన చాలా అంశాలను ఆ బాలుడు చెప్పడంతో ఆమె నిశ్చేష్టురాలైంది. మార్టిన్‌ నివసించిన పాత ఇంటి అడ్రస్, ఆయనకు నలుగురు భార్యలు ఉన్నారనే రహస్యం వంటివి చెప్పడంతో ఆశ్చర్యపోయింది. ర్యాన్‌ చెప్పిన చాలా అంశాలు సరైనవేనని నిర్ధారించింది.

అయితే ర్యాన్‌ది నిజంగానే పునర్జన్మా? అనే విషయంలో పూర్తి స్పష్టత రాలేదు. డాక్టర్‌ జిమ్‌ టక్కర్‌ పరిశోధనలు ఈ కేసును అసాధారణమైనదిగా తేల్చినా, శాస్త్రీయంగా ‘పునర్జన్మకు రుజువు’ అని చెప్పలేకపోయాయి. 
నాలుగేళ్ల వయసులో ఎంతో స్పష్టంగా కనిపించిన ఆ ప్రపంచం, కాలం గడిచేకొద్దీ మసకబారిపోయింది. పెద్దయ్యేసరికి ర్యాన్‌ కు ఆ జ్ఞాపకాలు దాదాపుగా కనుమరుగయ్యాయి. నిజంగా అది గత జన్మ జ్ఞాపకమా? బాల్యంలో ఏర్పడిన ఏదైనా మానసిక ప్రభావమా? లేక ఇప్పటికీ శాస్త్రానికి అంతుపట్టని మరో రహస్యమా?

సమాధానం ఏదైనా కావచ్చు కానీ, 1932 నాటి ఓ సినిమాలోని మరుగునపడిన వ్యక్తిని నాలుగేళ్ల బాలుడు గుర్తించిన ఆ క్షణం మాత్రం ఇప్పటికీ ఓ ప్రశ్నగానే మిగిలిపోయింది.
- సత్యకిశోర్‌ కొండ్రెడ్డి

ఇదీ చదవండి: పాస్ పోర్ట్ కెనడాది... పల్స్ ఇండియాది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement