ఉమెన్ పవర్
మేజర్ నవ్య షెకావత్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏడీసీ(ఎయిడ్–డి–క్యాంప్)గా బాధ్యతలు చేపట్టారు. జూలై 2026లో ఆమె నియామకం జరిగింది. ఈ ఘనత సాధించిన తొలి మహిళా ఆర్మీ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించారు నవ్య. దేశంలోని అత్యున్నత సైనిక గౌరవాలు, మర్యాదలతో కూడిన రాష్ట్రపతి ఏడీసీ (మిలిటరీ సెక్రటరీ) పదవిని చేపట్టి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.
సాయుధ దళాల్లో పెరుగుతున్న మహిళల ప్రాతినిధ్యానికి ‘ఏడీసీ’గా ఆమె నియామకం అద్దం పడుతుంది. అధికారిక కార్యక్రమాలలో రాష్ట్రపతికి సహకరించడం, లాంఛన ప్రాయమైన ప్రోటోకాల్‌ను పాటించడం, సీనియర్ సైనిక అధికారులతో సమన్వయం చేసుకోవడం వంటి కీలక బాధ్యతలను ఏడీసీ నిర్వహిస్తుంది. సాధారణంగా ఆర్మీ నుంచి ముగ్గురు, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి ఒకరు రాష్ట్రపతికి ఐదుగురు ఏడీసీలు ఉంటారు.
ఎంతోకాలంగా పురుషులకే పరిమితమైన ఈ హోదా మేజర్ నవ్య షెకావత్‌ను వరించడం విశేషంగా మారింది. రాజస్థాన్‌లోని సికార్ జిల్లా కెర్పూర గ్రామానికి చెందిన నవ్య షెకావత్ యూపీఎస్‌సీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్ష రాసి చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(వోటీఏ)లో షార్ట్ సెలెక్షన్ కమిషన్ ఉమెన్ నాన్–టెక్నికల్ కోర్స్‌కు ఎంపికయ్యారు. సైనిక నైపుణ్యాలలో శిక్షణ పూర్తి చేసుకొని 2021లో ఆర్మీ సర్వీసెస్ కార్ప్స్(ఎఎస్‌సి)లో ఆఫీసర్‌గా నియామకం అయ్యారు.
అయిదేళ్ల సర్వీసులోనే మేజర్ హోదాకు చేరుకున్నారు. మేజర్ హోదాలో ఉన్న నవ్య షెకావత్‌కు రాష్ట్రపతిభవన్‌లో అత్యుత్తమ వీవీఐపీ వసతి, ప్రత్యేక రక్షణ వాహనం, ఉచిత వైద్య సౌకర్యాలు లభిస్తాయి. అధికారిక పర్యటనలలో, రాష్ట్రపతితో పాటు నవ్య షెకావత్ ఉండాల్సి ఉంటుంది. కల.. ఆ కలను సాకారం చేసుకునే కష్టం, క్రమశిక్షణ ఉంటే రాష్ట్రపతి పక్కన హుందాగా నిలబడవచ్చునని నవ్య షెకావత్ చెప్పకనే చెబుతున్నారు. కలలు కనే యువతకు స్ఫూర్తిని ఇస్తున్నారు.


