మణిపూర్‌లోని కామ్‌జోంగ్ జిల్లాలో నలుగురు గ్రామస్థులు తుపాకీ గాయాలతో మృతిచెందారు. మయన్మార్ నుంచి సరిహద్దు దాటి వచ్చిన మిలిటెంట్లే ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం జరిగిన ఈ దాడి తర్వాత పోలీసులు, గ్రామస్థులు సుదీర్ఘంగా గాలించి శుక్రవారం తెల్లవారుజామున మృతదేహాలను గుర్తించారు.
మృతులను వారీషిమ్ జాజో, ఫామి జాజో, బెటర్‌సన్ జాజో, నింగ్‌థెమ్ కషక్‌గా గుర్తించారు. వీరంతా తాంగ్‌ఖుల్ నాగ తెగకు చెందినవారని పోలీసులు తెలిపారు. మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని మారుమూల పైలాంగ్ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో మృతదేహాలు కనిపించాయి. ఈ ప్రాంతం జిల్లా కేంద్రానికి సుమారు 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం కామ్‌జోంగ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
గురువారం మిలిటెంట్లు మయన్మార్ నుంచి మణిపూర్‌లోకి ప్రవేశించి ఐదుగురు గ్రామస్థులపై మెరుపుదాడి చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. వారిలో ఒకరు తప్పించుకుని అధికారులకు సమాచారం అందించడంతో దాడి విషయం వెలుగులోకి వచ్చింది. మృతులంతా నిరాయుధులేనని స్థానిక ఎమ్మెల్యే ఎల్. కైషింగ్ తెలిపారు. సరిహద్దు భద్రతను మరింత పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
ముఖ్యమంత్రి వై.ఖేమ్‌చంద్ సింగ్ ఈ హత్యలను ఖండించారు. ఇలాంటి హింసకు సమాజంలో చోటు లేదని, దీనిని సహించబోమని తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నాగ పీపుల్స్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు అవాంగ్‌బౌ న్యూమై కూడా దాడిని ఖండించారు. కుకి నేషనల్ ఆర్మీ (బర్మా) సభ్యులే ఈ దాడి వెనుక ఉన్నారని ఆయన ఆరోపించారు. అయితే దీనిపై పోలీసులు మయన్మార్ నుంచి వచ్చిన మిలిటెంట్ల ప్రమేయాన్ని మాత్రమే అనుమానిస్తున్నారు.


