అవార్డుల ఆనందంలో ఆటపాటలు! | Tollywood National Awards Team Enjoys at Vadodara airport | Sakshi
Sakshi News home page

National Film Awards: అవార్డుల ఆనందంలో ఆటపాటలు!

Sep 25 2026 5:14 PM | Updated on Sep 25 2026 7:19 PM

Tollywood National Awards Team Enjoys at Vadodara airport

విజయం ఎవరికైనా ఆనందాన్నిచ్చే అనుభూతి, ఓ తీపి జ్ఞాపకం. సినిమా విషయంలో వాణిజ్య విజయంతో పాటు... పురస్కారాల గుర్తింపు దక్కితే అది మరపురాని ఆనందానుభూతి, మరింత మధుర జ్ఞాపకం. ఆ అవార్డు ఏకంగా జాతీయ పురస్కారమైతే, ఇక చెప్పేదేముంది! తాజా 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో మన తెలుగు సినిమా ఏకంగా 9 అవార్డులు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ నేషనల్ అవార్డులు గెలుచుకున్న మన తారలు, దర్శక, నిర్మాతల ముఖాల్లోనే కాదు... మాటల్లో, చేతల్లోనూ ఆ ఆనందం చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీద నుంచి జాతీయ అవార్డులు అందుకుని హైదరాబాద్‌కు ఇంటి ముఖం పట్టినవారు వడోదరా విమానాశ్రయంలో ఆత్మీయంగా మాట్లాడుకుంటూ కనిపించారు. హైదరాబాద్ విమానం ఎక్కేందుకు చాలా సమయం ఉండడంతో ఆటపాటలతో గడుపుతూ కనిపించారు.

పెద్దలు ఆడిన పిల్లల ఆట కథ..
ఉత్తమ బాలల చిత్రం కేటగిరీలో నేషనల్ అవార్డు గెలుచుకున్న ‘35... చిన్న కథ కాదు’ టీమ్, అలాగే ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన ‘కమిటీ కుర్రోళ్ళు’ టీమ్స్ ఉత్సాహంగా కనిపించాయి. యువతరానికి చెందిన ఈ టీమ్‌లు రెండూ మరింత పిన్న వయస్కులైపోయి, ఎయిర్‌పోర్ట్‌లోని ప్లే జోన్ వద్ద ఆటపాటల్లో పోటీపడుతూ సందడి చేశాయి. ‘35... చిన్న కథ కాదు’ సినిమా దర్శకుడు ఈమని నందకిశోర్, ఆ చిత్ర నటుడు – నిర్మాత విశ్వదేవ్ రాచకొండ, ఆ చిత్రం నుంచే ఉత్తమ బాలనటుడిగా నిలిచిన అరుణ్‌దేవ్ పోతుల, అలాగే ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రాన్ని అందించిన నటి నిహారిక కొణిదెల, ఆ చిత్రానికే ఉత్తమ మేకప్ విభాగంలో జాతీయ అవార్డు అందుకున్న పసుపులేటి రవికుమార్ అందరూ కలసి రెండు జట్లుగా ఏర్పడి బంతులను దూరం నుంచి బాస్కెట్‌లోకి విసిరే ఆట ఆడారు.

అప్పుడు ‘రుద్రవీణ’... ఇప్పుడు ‘కమిటీ కుర్రోళ్లు’
అందరూ తమ తమ వయసు మర్చిపోయి సినిమాల టైటిల్స్ – అందులోని హీరో, హీరోయిన్ల పేర్లతో ‘అంత్యాక్షరి’ ఆటలో కూడా పాల్గొన్నారు. క్యూలో నిల్చొని, విమానంలోకి అడుగు పెడుతున్న ఆఖరి క్షణం వరకు ఆ ఆటలు, ఆనందాల సందడి కొనసాగింది. నటి నిహారిక తల్లి పద్మజ సైతం ‘అంత్యాక్షరి’ గేమ్‌ను ఆస్వాదిస్తూ.. కుమార్తెను సపోర్ట్ చేస్తూ, ఆటలో పాలుపంచుకుంటూ కనిపించారు. కాస్తంత దూరంలో కూర్చున్న నిహారిక తండ్రి నాగబాబు సైతం అవార్డు విజేతల ఆనంద క్షణాలను చూసి, చిరునవ్వులు చిందించారు. ‘ఒకప్పుడు కె. బాలచందర్  దర్శకత్వంలో అన్నయ్య చిరంజీవి నటించిన ‘రుద్రవీణ’ చిత్రానికి నేషనల్ అవార్డు వచ్చింది. ఆ చిత్ర నిర్మాతగా నేను జాతీయ అవార్డు అందుకున్నాను. కొన్ని దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్లీ మా అమ్మాయి ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్ర నిర్మాతగా జాతీయ అవార్డు అందుకున్న క్షణాలు నాకెప్పటికీ మర్చిపోలేని ఆనందక్షణాలు. తండ్రినైన నాకే ఈ వయసులో ఇంత ఆనందంగా ఉంటే.. కెరీర్ తొలి రోజుల్లోనే జాతీయ అవార్డ్ అందుకున్న ఆ పిల్లలకు ఇంకెంత ఆనందంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు’ అని వ్యాఖ్యానించారు. 

బాధ్యత మరువని మహిళా నిర్మాత!
ప్రజాదరణ పొందిన ఉత్తమ పాపులర్ చిత్రంగా జాతీయ అవార్డు అందుకున్న ‘కల్కి’ చిత్ర నిర్మాత సి. అశ్వినీదత్, భార్య, సినీ నిర్మాణంలో వారసురాలిగా ఎదిగిన కుమార్తె స్వప్నాదత్, అలాగే ‘కల్కి’ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ తల్లి జయంతి రెడ్డి విమానాశ్రయంలో కనిపించారు. తల్లితండ్రులను జాగ్రత్తగా ఎస్కలేటర్ ఎక్కించడం నుంచి లగేజ్ తీసుకొస్తూ... వారు ప్రశాంతంగా ఓ పక్కన కూర్చొని నిరీక్షించే ఏర్పాట్లు చేయించడం దాకా అన్నిటినీ స్వప్న దత్ దగ్గరుండి చూసుకోవడం గమనార్హం. పెద్ద వయసు తల్లితండ్రుల పట్ల పిల్లలకు ఉండాల్సిన ప్రేమతో పాటు బాధ్యతకు ఆ సన్నివేశం ఓ ప్రత్యక్ష ఉదాహరణగా అనిపించింది.

ఒకప్పుడు నంది అవార్డుల్లాగే ఇప్పుడు ‘మహానటి’ (జాతీయ ఉత్తమ నటి, ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం), ‘కల్కి’ (నేషనల్ బెస్ట్ పాపులర్ ఫిల్మ్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైనింగ్) లాంటి చిత్రాలతో... వరుసగా జాతీయ అవార్డులు ఇంటికి క్యూ కడుతున్నట్టు ఉన్నాయే అంటే తండ్రీ కూతుళ్లు హాయిగా నవ్వేశారు.

మరోపక్క ఎస్వీ రంగారావు నటించిన ప్రసిద్ధ తెలుగు పౌరాణిక చిత్రం ‘యశోద కృష్ణ’ (1975) తమిళ అనువాదం మొదలు తాజాగా జాతీయ, సామాజిక, పర్యావరణ విలువలు బోధించే చిత్రంగా జాతీయ అవార్డు, అదే చిత్రంలో నటించిన హీరో ధనుష్‌కు ప్రత్యేక ప్రశంసగా నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టిన ‘కెప్టెన్ మిల్లర్’ వరకు అయిదు దశాబ్దాలుగా పలు భాషల్లో సినిమాలు నిర్మిస్తున్న ప్రసిద్ధ చిత్ర నిర్మాణసంస్థ సత్యజ్యోతి ఫిలిమ్స్ అధినేత టి.జి. త్యాగరాజన్, తన శ్రీమతితో కలసి సేద తీరుతూ కనిపించారు.

ఆత్మీయ చర్చల్లో ఆ దర్శక త్రయం..
నటీనటులు, నిర్మాతలే కాదు... ప్రముఖ దర్శకులు సైతం పిచ్చాపాటీ కబుర్లు, సినీ విశేషాల గురించి ఆత్మీయంగా సంభాషిస్తూ కనిపించారు. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా ‘పుష్ప-2’ చిత్రానికి నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు సుకుమార్, అలాగే ఉత్తమ సంభాషణల రచయితగా ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి నేషనల్ అవార్డు గెలుచుకున్న మరో యువ దర్శకుడు వెంకీ అట్లూరి, నేషనల్ అవార్డుల తుది సెంట్రల్ జ్యూరీలోని ఏకైక తెలుగువాడైన దర్శకుడు వి.ఎన్. ఆదిత్య ఎయిర్‌పోర్ట్‌లోని లాంజ్‌లో నిలబడి, మనసు విప్పి మాట్లాడుకున్నారు. సుకుమార్, వెంకీ అట్లూరి... ఇద్దరికీ ఇదే తొలి జాతీయ అవార్డు. ‘గతంలో నేను తీసిన ధనుష్ ‘వాత్తి’ (తెలుగులో ‘సార్’ - 2023) చిత్రానికి సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్‌ను జాతీయ అవార్డు (పాటలు) వరించింది. కానీ, నాకు వ్యక్తిగతంగా మాత్రం ఇదే ఫస్ట్ నేషనల్ అవార్డ్’ అని వెంకీ అట్లూరి వ్యాఖ్యానించారు.

తోటి దర్శకులతో సాగిస్తున్న సుదీర్ఘ సంభాషణలో తన తాజా హిట్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సాధించిన విజయం, ఆ చిత్ర ఆలోచన, అందులోని కథాకథనం, లభించిన ప్రశంసలు, కొందరి పసలేని విమర్శలు, చివరకు బాక్సాఫీస్ వసూళ్ల వివరాలను తెలియజేస్తూ, వెంకీ తన మనసులోని మాటలు పంచుకున్నారు. దర్శకుడు సుకుమార్ సైతం ఉత్తమ సాహిత్యం, వార్తా నివేదనంలో తమ ప్రత్యేకతను నిలుపుకొన్న కొన్ని ప్రత్యేక పత్రికలు – మ్యాగజైన్లు, వాటి పేరు చిరస్థాయిగా నిలిచిపోవడం, దర్శకుడిగా తొలి చిత్రం ‘ఆర్య’ నాటి నుంచి నేటి దాకా తన వెన్నంటి నిలిచిన జర్నలిస్టులు... ఇలా అనేక అంశాలను తన మాటల్లో గుర్తు చేసుకున్నారు.  

జ్యూరీ సభ్యుడైన దర్శకుడు వి.ఎన్. ఆదిత్య సైతం వాళ్లందరి మాటలతో జత కలుపుతూ.. తన అనుభవాలను పంచుకున్నారు. మొత్తానికి, నేషనల్ అవార్డులు తెచ్చిపెట్టిన విజయానందం, ఆ స్నేహశీలత, సంతోషం మన విజేతలందరిలో అణువణువునా తొణికిసలాడింది. తెలుగు సినీ పరిశ్రమంటే... నిత్యం ఏదో ఒక వివాదం, అనైక్యత, అసమ్మతి మాత్రమే అనిపించే వర్తమానంలో... ఇలా సినీ పరిశ్రమ వర్గీయుల ఏకతాటిపైకి వచ్చి, ఆనందంగా గడపడం వస్తున్న మార్పుకు శుభసూచన.
-గుజరాత్‌లోని ఏక్తానగర్‌ నుంచి ఆర్. జయ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement