'మందు తాగి వినాయకుడి ముందు చిందులా? ఒ‍క్కడికైనా మంత్రాలు వచ్చా?' | Renu Desai Reacts Vinayaka Nimajjanam Issue Latest Video | Sakshi
Sakshi News home page

Renu Desai: గణేశ్ ఉత్సవాలు మొదలుపెట్టింది డీజే పార్టీల కోసం కాదు

Sep 25 2026 4:39 PM | Updated on Sep 25 2026 4:54 PM

Renu Desai Reacts Vinayaka Nimajjanam Issue Latest Video

పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ గత ఒకటి రెండు రోజులుగా మళ్లీ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటున్న ఈమె.. అర్థరాత్రి డీజేలతో హోరెత్తిస్తూ వినాయక నిమజ్జనాలు చేయడమేంటి? సాయంత్రం 7-8 గంటల్లోపే చేసుకోవచ్చుగా అని ఓ వీడియో పోస్ట్ చేసింది. దీంతో ఈమెని ట్రోల్స్ చేస్తూ విపరీతమైన కామెంట్స్ వచ్చాయి. దీంతో మరో వీడియో పోస్ట్ చేసిన రేణు దేశాయ్.. సంచలన వ్యాఖ్యలు చేసింది.

(ఇదీ చదవండి: మూడో వ్యక్తి మా మధ్య పుల్ల పెట్టాడు.. ధనుష్‌తో గొడవపై వడివేలు)

'నేను మాట్లాడేది నాకు ఇబ్బంది అయిందని కాదు. ఎందుకంటే నేను 18వ అంతస్తులో ఉంటున్నా. నాది సౌండ్ ప్రూఫ్ బెడ్ రూం. బయట ఎంత పెద్ద శబ్దం వచ్చినా నాకు ఎలాంటి సౌండ్ వినిపించదు. ప్రస్తుతం సిటీలో చాలామందికి వైరల్ జ్వరాలు వస్తున్నాయి. నా కూతురితో పాటు ఎంతోమంది ఇళ్లల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇలాంటి టైంలో రాత్రి 11-12 గంటల వరకు డీజేలు మోగిస్తే ముసలివాళ్లు, పిల్లలు ఎంత ఇబ్బంది పడతారో మీకు తెలుసా?'

'చాలామంది మేం ఉదయం ఉద్యోగాలు చేసుకుంటాం. రాత్రి నిమజ్జనం చేసుకుంటామని అంటున్నారు. చేసుకున్నా సరే రాత్రి 6-7 గంటల్లోపు పూర్తి చేసుకోండి. రాత్రిపూట మందు తాగి, దేవుడి విగ్రహం ముందు పిచ్చిపిచ్చిగా చిందులు వేయడమేనా మీ సనాతన ధర్మం? పోనీ ఈ డ్యాన్సులు చేసేవాళ్లకు ఒక్క వినాయక మంత్రమైనా వచ్చా? ఈ నవరాత్రుల్లో నిష్టగా చదవాల్సిన ‘గణపతి అథర్వశీర్ష’ గురించి ఎంతమందికి తెలుసు? డ్యాన్సులు చేయాలనే కోరిక ఉంటే క్లబ్బులకు వెళ్లి ఎంజాయ్ చేయండి. పవిత్రమైన పూజల ముసుగులో రోడ్లపై ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు'

'సనాతన సంప్రదాయాల ప్రకారం పూజలు, క్రతువులు, నిమజ్జన కార్యక్రమాలు ఏవైనా సరే సూర్యాస్తమయానికి ముందే పూర్తి కావాలి. మానవుల అంత్యక్రియలే సాయంత్రం ఆరు గంటల దాటితే చేయరు. అలాంటిది దేవుడి నిమజ్జనాన్ని రాత్రిపూట ఎలా చేస్తారు? ఒక నిమిషం ముందు వరకు భక్తిశ్రద్ధలతో కొలిచిన మట్టి, పీవోపీ విగ్రహాలను ఆ తర్వాత నిర్లక్ష్యంగా నీళ్లలోకి విసిరేయడం చూస్తుంటే బాధ కలుగుతోంది. ఈ మూర్ఖత్వం మానేయండి. గణేశ్ ఉత్సవాలను లోకమాన్య తిలక్ ప్రారంభించింది ప్రజల్లో ఐక్యత సాధించడానికే తప్ప డీజే పార్టీలు చేసుకోవడానికి కాదు. నేను గర్వించదగిన సనాతనిని, రెండు దశాబ్దాలుగా గణపతిని ఆరాధిస్తున్నాను. ప్రశ్నించినందుకు ఒక మహిళ అయిన నాపై అసభ్యకరమైన కామెంట్లతో ట్రోలింగ్ చేయడమేనా మీ సనాతన ధర్మం?' అని ట్రోలర్స్‌ని రేణు దేశాయ్ గట్టిగా ప్రశ్నించింది.

(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' నెగిటివిటీపై స్పందించిన హీరో నాని)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement