టైటిల్: అనుమాన పక్షి
నటీనటులు: రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సిసిల్, అనన్యా, చరిత్, బ్రహ్మాజీ, రాశి, అజయ్, మస్త్ అలీ తదితరులు
నిర్మాణ సంస్థ: చిలక ప్రొడక్షన్స్
నిర్మాతలు: రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్
రచన, దర్శకత్వం: విమల్ కృష్ణ
సంగీతం: శ్రీచరణ్‌పాకాల
ఎడిటర్ : చోటా కె. ప్రసాద్
విడుదల తేది: సెప్టెంబర్ 25, 2026
‘డీజే టిల్లు’తో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన విమల్ కృష్ణ.. చాలా గ్యాప్ తీసుకొని ‘అనుమాన పక్షి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసారి కూడా నవ్వులు పూయించే కథనే నమ్ముకున్న ఆయన.. కామెడీతో పాటు కథ, కథనం విషయంలో ఎంతవరకు మెప్పించాడు? ‘ది ప్యారడైజ్’ లాంటి భారీ సినిమాతో పోటీకి దిగిన ఈ ‘అనుమాన పక్షి’ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
వైజాగ్‌కు చెందిన యూట్యూబర్ సన్నీ(రాగ్ మయూర్)కి అనుమానాలు ఎక్కువ. ఇంటి గుమ్మానికి దిష్టి బొమ్మ పెడితే ఎక్కడ తెగి తనపై పడుతుందో అనే అనుమానంతో.. దిష్టిబొమ్మనే పెట్టించుకోడు. బట్టల్ని ఎవరికైనా దానం చేస్తే.. ఏదైనా చేతబడి చేస్తారనే అనుమానంతో ఇంట్లో ఉండే పాత చీరలు, కర్టెన్స్‌తో కూడా బట్టలు తయారు చేసుకుంటాడు.ఇలా తన అనుమానాలతో చుట్టూ ఉన్న అందరికీ పిచ్చెక్కిస్తుంటాడు. ఇతని అనుమానం వల్లే.. వర్మ(ప్రిన్స్)ని తన ప్రియురాలు రమ్య దూరం పెడుతుంది. వర్మ వార్నింగ్‌ఇవ్వడంతో రమ్యతో మాట్లాడి మళ్లీ కలిసేలా చేస్తానని చెబుతాడు. అదే సమయంలో తనకు కశ్మీర్ నుంచి ఓ ఫోన్ కాల్ వస్తుంది.
దీంతో తన స్నేహితుడితో పాటు వర్మని కూడా తీసుకొని కశ్మీర్‌కి వెళ్తాడు. అక్కడ సన్నికి కన్యాకుమారి(మెరిన్ ఫిలిప్) పరిచయమై ప్రేమలో పడతాడు. అంతా సాఫీగా సాగుతుందనకుంటున్న సమయంలో వర్మ ఊహించని రీతిలో మరణిస్తాడు. అదే సమయంలో అక్కడికి విశాఖ సీఐ వాసు (అజయ్), అతడి భార్య సుజాత (రాశి) వస్తారు. వర్మ మృతికి అసలు కారణం ఏంటి? ఈ సమస్య నుంచి సన్నీ ఎలా బయటపడ్డాడు? అసలు కన్యాకుమారి ఎవరు? ఆమెతో సన్నీ ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
సాధారణంగా కామెడీ సినిమా అంటే కథ ఎలా ఉన్నా.. కనీసం కొన్ని సన్నివేశాలైనా ప్రేక్షకులను నవ్విస్తాయి. కానీ ‘అనుమాన పక్షి’ విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. కామెడీని ప్రధాన బలంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా.. కనీసం ఒక్క సీన్‌లో కూడా ప్రేక్షకుడి ముఖంపై చిరునవ్వు తీసుకురాలేకపోయింది.
సన్నివేశాల్లో సహజత్వం లేకపోవడం, కామెడీ టైమింగ్ ఒక్క చోట కూడా వర్కౌట్ కాకపోవడంతో సినిమా అంతా బోర్ కొట్టిస్తుంది. కొన్ని చోట్ల నవ్వించడానికి చేసిన ప్రయత్నాలు కూడా ప్రేక్షకుడికి మరింత ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇక దర్శకుడు విమల్ కృష్ణ అసలు ఏ పాయింట్‌తో ఈ కథను తెరకెక్కించాడన్నది కూడా స్పష్టంగా అనిపించదు. కథలో బలం లేకపోవడం ఒక ఎత్తయితే.. దాన్ని ఆసక్తికరంగా నడిపించే కథనం కూడా కనిపించదు. ఫలితంగా కామెడీ సినిమా కాస్తా.. కామెడీ లేని సినిమాగా మారిపోయింది.
కనీసం ఒకట్రెండు సన్నివేశాల్లో అయినా నవ్విస్తే పర్వాలేదనిపించేది. కానీ సినిమా మొత్తం వెతికినా అలాంటి సందర్భం ఒక్కటి కూడా కనిపించదు. నిడివి కేవలం 111 నిమిషాలే అయినా.. ఫస్టాఫ్ చూసేసరికే నీరసించిపోతాం. ఇక సెకండాఫ్‌లో అయిన కాస్త కామెడీ ఉంటుందా అంటే.. అది మరింత చిరాకుగా ఉంటుంది. కామెడీ చిత్రం కాబట్టి కథ లేకపోయినా పర్లేదు కానీ మరీ కామెడీ లేకుండా చేస్తా ఎలా? డీజే టిల్లు లాంటి బ్లాక్ బస్టర్ తీసిన దర్శకుడేనా ఈ సినిమా తెరకెక్కించింది? అనే అనుమానంతో థియేటర్స్‌ని నుంచి బయటకు వస్తాం.
ఎవరెలా చేశారంటే..
ఇన్నాళ్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన రాగ్ మయూర్ తొలిసారి సోలో హీరోగా చేసిన సినిమా ఇది. సన్నీ పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానంలోనే లోపం ఉండడంతో అతని నటన హైలెట్ కాలేదు. ఇక వాసు పాత్రలో అజయ్ కామెడీ చేసే ప్రయత్నం చేశాడు కానీ.. అది ఒక్క చోట కూడా వర్కౌట్ కాలేదు. ప్రిన్స్ పాత్రకు పెద్ద ప్రాధాన్యత ఉండదు. హీరోగా చేసిన ఆయన ఇలాంటి పాత్ర ఎందుకు ఒప్పుకున్నాడో అర్థం కాలేదు. రాశి కూడా అంతే.. సెకండాఫ్‌లో ఒకటి రెండు సీన్లలో కనిపిస్తుంది. బ్రహ్మాజీ, మెరిన్ ఫిలప్‌తో పాటు మిగిలిన నటీనటులలో ఒకరు కూడా తమ నటనతో ఆకట్టుకోలేకపోయారు. ఈ తప్పంతా పూర్తిగా దర్శకుడిది అనే చెప్పాలి. సాంకేతికంగా కూడా ఈ సినిమా గొప్పగా లేదు. శ్రీచరణ్ పాటలే కాదు నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకోలేకపోయింది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.


