భారత్‌లో తొలి ఎల్‌ఎన్‌జీ రైలు ప్రారంభోత్సవంలో హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్య
అహ్మదాబాద్: దేశంలో రైల్వే వ్యవస్థను ప్రధాని మోదీ సమూలంగా మార్చారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలును అమిత్ షా ఆదివారం గుజరాత్‌లోని సబర్మతి స్టేషన్‌లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. రూ.1,500 కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం ఇచ్చారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తర్వాత సభలో మాట్లాడారు.
‘‘కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు తప్ప ఇంకేమీ జరగలేదు. గత 12 ఏళ్లలో మోదీపై 4 అణాల అవినీతి ఆరోపణలు కూడా ఎవరూ చేయలేకపోయారు. మోదీ పాలనలో రైల్వేశాఖ ముఖచిత్రం మారింది. ప్రత్యేక సరుకు రవాణా కారిడార్, వేగవంతమైన రైలు వ్యవస్థ, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన స్టేషన్ల వచ్చాయి.
హైడ్రోజన్‌తో నడిచే రైలును ప్రారంభించడం ద్వారా ప్రపంచంలో నాలుగు దేశాల సరసన భారత్‌కు స్థానం కల్పించారు’’ అని కొనియాడారు. ‘‘మోదీ హయాంలో 11,000 కిలోమీటర్ల రైలు మార్గాన్ని 4–ట్రాక్ నెట్‌వర్క్‌గా మారుస్తున్నారు. దీంతో ప్రయాణికులకు ఎంతో సౌలభ్యం కలుగుతుంది. రైళ్లలో 97 శాతం బయో టాయిలెట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 87 శాతం ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు మన దేశంలోనే తయారయ్యాయి’’ అని చెప్పారు.


