డిఫెండింగ్ వన్డే ఛాంపియన్ ఆస్ట్రేలియాకు సౌతాఫ్రికా జట్టు భారీ షాకిచ్చింది. స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా నిన్న జరిగిన రెండో వన్డేలో జగజ్జేతను 32 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా ఆసీస్‌పై వరుసగా ఆరో వన్డే సిరీస్ గెలిచింది. ఓవరాల్‌గా ఆసీస్‌పై సౌతాఫ్రికాకు ఇది పదో ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయం. ప్రపంచంలో ఏ జట్టు ఆస్ట్రేలియాపై ఇన్ని ద్వైపాక్షిక సిరీస్ విజయాలు సాధించలేదు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (103), డేవిడ్ మిల్లర్ (142) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 365 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో జాక్ ఎడ్వర్డ్స్ 5 వికెట్లతో రాణించగా, హాజిల్‌వుడ్ 3 వికెట్లు తీశాడు.
భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియాకు శుభారంభమే లభించినా మ్యాచ్ గెలవలేకపోయింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (84), ట్రవిస్ హెడ్ (84) మెరుపు అర్ద సెంచరీలతో రాణించినప్పటికీ.. ఆతర్వాత వచ్చిన వారు పెద్దగా స్కోర్లు చేయలేకపోయారు. ఆఖర్లో జేవియర్ బార్ట్‌లెట్ (50) మెరుపు అర్ద శతకం చేసినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
సౌతాఫ్రికా బౌలర్లు తలో చేయి వేసి ఆసీస్‌ను దెబ్బకొట్టారు. లిజాడ్ విలియమ్స్ 3, మార్కో యాన్సెన్, కేశవ్ మహారాజ్, ఫోర్టుయిన్ తలో 2, మార్క్రమ్ ఓ వికెట్ తీశారు. ఈ సిరీస్‌లోని నామమాత్రపు మూడో వన్డే సెప్టెంబర్ 30న జరుగనుంది. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది.
ఇదీ చదవండి: తొలిసారి తుది జట్టులో యాన్సెన్ సోదరులు


