IND vs WI: అతడొక అద్భుతం.. మ్యాచ్‌ నేనే ముగించాల్సింది | Shubman Gill Reveals Why Virat Kohli Is Batting Better And More Dangerous Than Ever, Watch Video Trending On Social Media | Sakshi
Sakshi News home page

అతడొక అద్భుతం.. మ్యాచ్‌ నేనే ముగించాల్సింది.. అయినా సంతోషమే!

Sep 28 2026 10:49 AM | Updated on Sep 28 2026 11:32 AM

He is batting superbly: Gill Explains Why Kohli Is More Dangerous Than Ever

Photo Credit: BCCI X

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. తిరువనంతపురం వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించి.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

విధ్వంసకర శతకం
విండీస్‌పై గెలుపులో టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి కీలక పాత్ర పోషించాడు. కరేబియన్‌ జట్టు విధించిన 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగుల విధ్వంసం సృష్టించాడు. 

శతకమోత మోగించిన ఈ వన్‌డౌన్‌ బ్యాటర్‌ కేవలం 88 బంతుల్లోనే పది ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సాయంతో 139 పరుగులు సాధించాడు. సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించి జట్టు విజయాన్ని ఖరారు చేశాడు.

ప్రపంచ రికార్డు మరింత బలోపేతం
కాగా కోహ్లికి వన్డేల్లో ఇది 55వ సెంచరీ. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌ వన్డే చరిత్రలో అత్యధిక శతకాల వీరుడిగా తన ప్రపంచ రికార్డును కింగ్‌ మరింత బలోపేతం చేసుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌-2027 తాను పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నానని మరోసారి ఆటతోనే విమర్శకుల నోళ్లు మూయించాడు.

మునుపటి కన్నా గొప్పగా.. ప్రమాదకర బ్యాటర్‌గా
ఈ నేపథ్యంలో టీమిండియా వన్డే కెప్టెన్‌, మరో శతక వీరుడు శుబ్‌మన్‌ గిల్‌ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘కోహ్లి భయ్యా అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. మునుపటి కన్నా మరింత గొప్పగా ఆటను ఆస్వాదిస్తున్నాడు. స్వేచ్ఛగా బ్యాట్‌ను ఝలిపిస్తున్నాడు.

అందుకు తగ్గ ప్రతిఫలాన్ని మనం చూశాము. ఆయనకు ఇలాంటివి కొత్త కాదు. బౌండరీల వర్షం కురిపించడం అలవాటే. ఇప్పుడు కూడా సరైన దారిలోనే ఉన్నాడు. చెప్పాలంటే గతం కంటే మరింత డేంజరస్‌ బ్యాటర్‌గా మారిపోయాడు. కెప్టెన్‌గా కోహ్లి భయ్యాకు వీలైనంత ఎక్కువ స్వేచ్చను ఇస్తాను. దేశం కోసం ఇప్పటికే ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడు.

కోహ్లి ఆడితే విజయం మనదే.. మ్యాచ్‌ నేనే ముగించాల్సింది
ఇప్పటికీ అదే పని కొనసాగిస్తున్నాడు. కోహ్లి భయ్యా ఆడిన రోజు తప్పకుండా జట్టు గెలుస్తుంది’’ అని శుబ్‌మన్‌ గిల్‌ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. అదే విధంగా తాను అవుట్‌ కాకుండా ఉండి ఉంటే బాగుండేదని గిల్‌ అన్నాడు. ‘‘ఏదేమైనా నేను (108 బంతుల్లో 110) అవుటైనపుడు చాలా బాధపడ్డాను. మ్యాచ్‌ నేనే ముగించి ఉంటే ఇంకా బాగుండేది.

అయితే, నా ఇన్నింగ్స్‌ పట్ల సంతోషంగానే ఉన్నాను’’ అని గిల్‌ చెప్పుకొచ్చాడు. కాగా విండీస్‌తో తొలి వన్డేలో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ 108 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 110 పరుగులు చేశాడు. రోస్టన్‌ ఛేజ్‌ బౌలింగ్‌లో జువెల్‌ ఆండ్రూకు క్యాచ్‌ ఇవ్వడంతో గిల్‌ పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది. ఇక ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన భారత స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు ప్లేయర్‌ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

చదవండి: Asian Games 2026 Cricket: సెమీ ఫైనల్‌లో టీమిండియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement