IND vs AUS: చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్‌.. ప్రపంచ రికార్డు | Lakshya Raichandani History 1st batter achieve this vs AUSU19 Tests | Sakshi
Sakshi News home page

IND vs AUS: చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్‌.. ప్రపంచ రికార్డు

Sep 29 2026 12:21 PM | Updated on Sep 29 2026 1:19 PM

Lakshya Raichandani History 1st batter achieve this vs AUSU19 Tests

లక్ష్య (PC: BCCI/X)

భారత యువ క్రికెటర్‌ లక్ష్య రాజేశ్‌ రాయ్‌చందాని సరికొత్త చరిత్ర సృష్టించాడు. యూత్‌ టెస్టుల్లో ఆస్ట్రేలియాపై ఇంత వరకు ఏ బ్యాటర్‌కూ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించాడు. మూడు అనధికారిక వన్డేలు, రెండు అనధికారిక టెస్టులు ఆడేందుకు ఆసీస్‌ అండర్‌-19 జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా లక్ష్య కెప్టెన్సీలో వన్డే సిరీస్‌ను యువ భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

217 పరుగులకే ఆలౌట్‌
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య రాజ్‌కోట్‌ వేదికగా ఆదివారం తొలి యూత్‌ టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని.. తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకే ఆలౌట్‌ అయింది. బ్లేక్‌ క్యాటిల్‌ సెంచరీ (102) చేయగా.. జేడ్‌ హాలిక్‌ (59) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో ఇషాన్‌ ఓమ్‌ ఐదు వికెట్లతో చెలరేగి ఆసీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు.

అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత అండర్‌-19 జట్టు.. మంగళవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా 494 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్‌ అయింది. ఇందులో ఓపెనర్‌ లక్ష్య రాయ్‌చందానిదే కీలక పాత్ర.

డబుల్‌ సెంచరీతో దుమ్ములేపిన లక్ష్య
ఆసీస్‌తో తొలి యూత్‌ టెస్టులో లక్ష్య.. ద్విశతకంతో కదంతొక్కాడు. ఈ కుడిచేతివాటం బ్యాటర్‌ మొత్తంగా 281 బంతులు ఎదుర్కొని 240 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. 

ప్రపంచ రికార్డు
ఈ క్రమంలోనే ఆసీస్‌పై యూత్‌ టెస్టుల్లో డబుల్‌ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా లక్ష్య ప్రపంచ రికార్డు సాధించాడు. గతంలో పాకిస్తాన్‌ ఆటగాడు ఆస్ట్రేలియతో యూత్‌ టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 175 పరుగులు చేసి.. అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. లక్ష్య ఈ రికార్డును తాజాగా బద్దలు కొట్టాడు.  కాగా ఈ మ్యాచ్‌లో లక్ష్య థియో సింగోస్‌ బౌలింగ్‌లో ఎలి బ్రేయిన్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో లక్ష్య పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది.

మరో ఘనత
ఇక ఓవరాల్‌గా యూత్‌ టెస్టుల్లో అత్యధిక రెండో వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడినూ లక్ష్య నిలిచాడు. 2018లో శ్రీలంకతో యూత్‌ టెస్టులో భారత ఆటగాడు పవన్‌ షా 282 పరుగులు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఇదిలా ఉంటే.. లక్ష్యతో పాటు కెప్టెన్‌ యశ్‌వర్దన్‌ చౌహాన్‌ (54), మోహిత్‌ ఉల్వా (92) రాణించారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 494 పరుగులకు ఆలౌట్‌ అయిన భారత్‌.. ఆసీస్‌ కంటే 227 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది.

చదవండి: Asian Games Cricket: మరో చిన్న జట్టుకు అన్యాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement