ఆసీస్‌తో తొలి టెస్ట్‌.. టీమిండియాకు భారీ ఆధిక్యం | India U19 team gets 277 lead in 1st unofficial test vs Australia | Sakshi
Sakshi News home page

ఆసీస్‌తో తొలి టెస్ట్‌.. టీమిండియాకు భారీ ఆధిక్యం

Sep 29 2026 12:10 PM | Updated on Sep 29 2026 12:15 PM

India U19 team gets 277 lead in 1st unofficial test vs Australia

రాజ్‌కోట్‌ వేదికగా ఆస్ట్రేలియా అండర్‌-19 జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక​ టెస్ట్‌ మ్యాచ్‌లో భారత అండర్‌-19 జట్టు భారీ ఆధిక్యం సాధించింది. రెండో రోజే డబుల్‌ సెంచరీ పూర్తి చేసిన భారత ఓపెనర్‌ లక్ష్య రాజేశ్‌ రాయ్‌చంద్‌ ఓవర్‌నైట్‌ను మరో 30 పరుగులు జోడించి 240 పరుగుల వద్ద ఔటయ్యాడు. 

అతడికి అండగా ఉన్న 10వ నంబర్‌ ఆటగాడు మోహిత్‌ ఉల్వి (92) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. వీరిద్దరు తొమ్మిదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 180 పరుగులు జోడించారు. అనంతరం లక్ష్య రాజేశ్‌ తొమ్మిదో వికెట్‌గా, మోహిత్‌ ఉల్వి పదో వికెట్‌గా వెనుదిరిగారు. 

వీరిద్దరు ఔట్‌ కావడంతో భారత తొలి ఇన్నింగ్స్‌ 494 పరుగుల వద్ద ముగిసింది. దీంతో జట్టుకు 277 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ యశ్‌వర్దన్‌ చౌహాన్‌ (54) కూడా అర్ద సెంచరీతో రాణించాడు. ఆసీస్‌ బౌలర్లలో కేసీ బార్టన్‌ 3, ధియో, గ్రీన్‌, గ్రెగరి తలో 2, బ్రియాన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్ని​ంగ్స్‌లో 217 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టు తరఫున బ్లేక్‌ క్యాటిల్‌ (102) సెంచరీ చేశాడు. జెడ్‌ హెల్లిక్‌ (59) అర్ద సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో ఇషాన్‌ ఓం 5 వికెట్లతో సత్తా చాటగా.. మోహిత్‌ ఉల్వా 3, యశ్‌వర్దన్‌ 2 వికెట్లు పడగొట్టారు.

పీకల్లోతు కష్టాల్లో ఆసీస్‌
277 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ మూడో రోజు లంచ్‌ విరామం సమయానికి 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ జట్టు భారత తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 243 పరుగులు వెనుకపడి ఉంది. ఇషాన్‌ ఓం (5-2-6-3) ఆసీస్‌ టాపార్డార్‌ను కుప్పకూల్చాడు. 

కాగా, 3 మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్‌, రెండు అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌ల కోసం​ ఆస్ట్రేలియా అండర్‌ 19 జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో ముందుగా జరిగిన వన్డే సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. 

ఇదీ చదవండి: బ్యాటింగ్‌కు కొత్త నిర్వచనం చెబుతున్న విరాట్‌-గిల్‌ జోడీ



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement