టీమిండియా విధ్వంసకర ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా తండ్రి బాటలో పయనిస్తున్నాడు. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న ఆర్యవీర్.. ఇటీవలే భారత అండర్-19 జట్టు తరఫున అరంగేట్రం చేశాడు.
తండ్రి మాదిరే ధనాధన్
రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో యూత్ వన్డే సిరీస్‌లో భాగంగా ఆర్యవీర్ బరిలోకి దిగాడు. తండ్రి మాదిరే ఓపెనర్ అయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తొలి మ్యాచ్‌లో 26 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 28 పరుగులు చేశాడు.
ఆసీస్‌పై అదరగొట్టాడు
ఆసీస్‌తో రెండో యూత్ వన్డేలో 48 బంతులు ఎదుర్కొన్న ఆర్యవీర్.. తొమ్మిది ఫోర్లు బాది 47 పరుగులు చేశాడు. కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. ఇక మూడో వన్డేలో ఆర్యవీర్ 31 బంతుల్లో ఐదు ఫోర్లు బాది 34 పరుగులు రాబట్టాడు. తద్వారా మొత్తంగా ఈ సిరీస్‌లో 109 పరుగులు సాధించాడు.
చాలా గర్వంగా ఉంది
ఈ నేపథ్యంలో వీరేందర్ సెహ్వాగ్ ఎన్డీటీవీతో మాట్లాడగా.. ఆర్యవీర్‌కు మీరిచ్చిన సలహా ఏమిటనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘ఆర్యవీర్ సెహ్వాగ్‌ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. ఎల్లప్పుడూ ఒత్తిడి ఉంటుంది. అయితే, నువ్వు మాత్రం స్వేచ్ఛగా ఆడమని సలహా ఇచ్చాను.
ప్రేమిస్తారు, విమర్శిస్తారు, ద్వేషిస్తారు
‘మైదానంలో నిన్ను నువ్వు ఆవిష్కరించుకో. భారీ స్కోర్లు సాధించాలనే ఆలోచనను పక్కనపెట్టు. నువ్వు స్వేచ్ఛగా ఆడగలిగితే పరుగులు వాటంతటవే వస్తాయి. ప్రజలు నిన్ను ప్రేమిస్తారు. ఒక్కోసారి ఘాటుగా విమర్శిస్తారు. ఇంకోసారి బాగా ద్వేషిస్తారు.
కానీ వీటిలో ఏ ఒక్కదానికీ నువ్వు స్పందించకూడదు. ఆటను ఆస్వాదిస్తూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడమే నీ పని. నువ్వు బాగా ఆడుతున్నావా? విఫలమవుతున్నావా? అన్న సంగతి నీకే అర్థమవుతుంది.
ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకు
అలాంటపుడు నైపుణ్యాలు మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టు. బయటి వ్యక్తులు ఏమంటున్నారనే దానికంటే ప్రాక్టీస్ చేయడంపైనే నీ దృష్టి ఉండాలి. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా కేవలం ఆట మీదనే మనసు లగ్నం చేయాలి’ అని చెప్పాను.
అందుకు ఆర్యవీర్ సరే నాన్న అన్నాడు. ఢిల్లీ తరఫున అండర్-19 క్రికెట్ ఆడాడు. పరుగులు రాబట్టాడు. ఒక్కోసారి విఫలమయ్యాడు. ఏ దశలోనైనా అతడు ఒకేలా ఉన్నాడు. అది అత్యుత్తమ విషయం. అయినా తను ఇంకా చిన్న పిల్లాడే. కాబట్టి ఒక్కోసారి నిరాశకు గురై బాధపడుతూ ఉంటాడు. పద్దెమినిదేళ్ల పిల్లాడు మెల్లగా అన్నీ నేర్చుకుంటాడు’’ అని వీరేందర్ సెహ్వాగ్ పుత్రోత్సాహంతో పొంగిపోయాడు.


